తేలిక నేలల్లో పత్తి సాగు వద్దు
తేలిక నేలల్లో పత్తి సాగు వద్దు
Published Thu, Apr 13 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
నంద్యాల అర్బన్ : భూసార పరీ„ýక్షల ఫలితాలకనుగుణంగా పంటల సాగు జరగాలని, తేలికపాటి నేలల్లో పత్తిసాగు చేపట్టవద్దని జేడీఏ ఉమామహేశ్వరమ్మ రైతులకు సూచించారు. స్థానిక వైఎస్సార్ సెంటినరీ హాల్‌లో బుధవారం నంద్యాల రెవెన్యూ డివిజన్ స్థాయి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక ఖరీఫ్ 2017పై డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేడీఏ మాట్లాడుతూ పంటలతో పాటు పాడి పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. రసాయనిక ఎరువులను విచక్షణా రహితంగా వాడరాదని చెప్పారు. నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పచ్చిరొట్టె ఎరువులు, అంతర్ పంటలను ప్రోత్సహించాలన్నారు. నల్లరేగడి నేలల్లో రెండు పంటలను సాగు చేయాలని చెప్పారు. కొత్త వంగడాలతో పంటల సాగు పెరగాలని తెలిపారు.
ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికల ప్రకారం జిల్లాలో 6 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతున్నాయన్నారు. ఈ ఏడాది పత్తి, వరి, మినుము, మొక్కజొన్న తదితర పంటల సాగు పెరగవచ్చన్నారు. గత ఏడాది జిల్లాలో 1.76 లక్షల హెక్టార్లలో సాగైన పత్తి ఈ ఏడాది 2.30 లక్షల హెక్టార్లు, లక్ష హెక్టార్లలో వరి సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు. కంది గతేడాది 1.10 లక్షల హెక్టార్లలో సాగు కాగా ఈ ఏడాది 50 వేల హెక్టార్లకు తగ్గవచ్చని చెప్పారు. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల్లో యాజమాన్య పద్ధతులను అనుసరించాలన్నారు. సీనియర్ శాస్త్రవేత్త సరళమ్మ, ఆత్మ డీడీ భగత్‌సింగ్ స్వరూప్, ఎఫ్‌టీసీ డీడీ సంధ్యారాణి, ఆత్మ డీడీ రవికుమార్, జేడీఏ కార్యాలయ ప్రతినిధి మల్లికార్జున పాల్గొన్నారు.
Advertisement