
ఆదిభట్ల... అభివృద్ధి ఎట్లా?
పేరులోనే ‘ఆది’... అభివృద్ధిలో చివరి వరుస... ఇదీ ఆదిభట్ల పంచాయతీ తీరు. ఇది ఐటీ కారిడార్...
ఇబ్రహీంపట్నం రూరల్: పేరులోనే ‘ఆది’... అభివృద్ధిలో చివరి వరుస... ఇదీ ఆదిభట్ల పంచాయతీ తీరు. ఇది ఐటీ కారిడార్... అయినా అభివృద్ధికి నోచుకోవడం లేదు. పంచాయతీ ఆదాయ వనరులు, అధికారాలను టీఎస్‌ఐఐసీకి బదలాయించాలని 2013 జూన్ 13న అప్పటి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ నాగిరెడ్డి జీవో జారీ చేశారు. దీంతో పంచాయతీకి అందాల్సిన నిధులు టీఎస్‌ఐఐసీ ద్వారా హెచ్‌ఎండీఏ కు బదలాయిస్తున్నారు. ఫలితంగా స్థానికంగా అభివృద్ధి కి అవకాశం లేకుండాపోతోంది. ఈ ప్రాంతాన్ని ఇండస్టియ్రల్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏరోస్పేస్, ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా టీఎస్‌ఐఐసీ గుర్తించింది.
టీడీలు, ప్రభుత్వ నిధులే ఆధారం
ఆదిభట్లకు ప్రధాన ఆదాయం టీడీలు మాత్రమే. పరిశ్రమల ద్వారా నయాపైసా రావడం లేదు. ఇంటి అనుమతులు, రియల్‌ఎస్టేట్ అనుమతులు హెచ్‌ఎండీఏనే మంజూరు చేస్తోంది.
దీంతో పంచాయతీ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని అనేకసార్లు పంచాయతీ పాలకవర్గం కలెక్టర్, మంత్రులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోరుుంది.
వన్నె తగ్గిన పంచాయతీ
ఆదిభట్లలో ఏరోస్పేస్, ఎస్‌ఈజెడ్‌లకు సర్వే నెంబరు 656లో 351 ఎకరాలు, ఐటీ సెజ్‌కు సర్వే నెంబరు 255లో 180 ఎకరాలు గతంలో కేటాయించారు. ప్రస్తుతం టాటా సెజ్‌లలో టాటా ఎయిరోస్పేస్, టాటా లాకిడ్‌మార్టిన్, సికోరోస్కి, టీసీఎస్ లాంటి సంస్థలు వెలిశాయి. వాటిని చూసి రియల్ ఎస్టేట్ జోరందుకుంది. పంచాయతీకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని అంతా అనుకున్నారు. పన్నులు, అనుమతులతో వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం నేరుగా హెచ్‌ఎండీఏ ఖాతాలోకి చేరుతోంది. ఇంటి పన్నులనూ టీఎస్‌ఐఐసీ వసూలు చేయాలని భావిస్తోంది. పంచాయతీ పాలకవర్గం అధికారాలు తగ్గిపోయాయి. టీఎస్‌ఐఐసీ కర్ర పెత్తనానికి చూస్తోంది.
పంచాయతీకే హక్కులు ఇవ్వాలి
అప్పటి ప్రభుత్వాలు ఆదిభట్లకు అన్యాయం చేశాయి. అధికారాలను టీఎస్‌ఐఐసీ ద్వారా హెచ్‌ఎండీఏకు కేటాయించడం దారుణం. అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని... ఆదాయం బాగుంటుందని ఆనందం వ్యక్తం చేశాం. పూర్తి స్థారయి అధికారాలు హెచ్‌ఎండీఏ తీసుకుంటే... పంచాయతీ ఉన్నా... లేకున్నా ఒక్కటే.
-భూపతిగళ్ల రాజు, సర్పంచ్, ఆదిభట్ల