కల్హేర్‌లో శిథిలమైన గదిలో కొనసాగుతున్న పశువైద్యశాల
- పశువైద్యశాలల్లో వసతులు కరువు
- డాక్టర్లు, సిబ్బంది కోరతతో పీడిస్తున్న సమస్య
- వ్యాక్సినేషన్, చికిత్సలు చేసేందుకు ఇక్కట్లు
కల్హేర్: మండలంలోని కల్హేర్, సిర్గాపూర్ రెండు పశువైద్యశాలలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యశాలల్లో సరైన వసతులు లేక మూగజీవాలు తీవ్ర నరకయాతన పడుతున్నాయి.దీనికితోడు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో మూగజీవులకు వైద్య సేవలు అందడం లేదు. సొంత భవనాలు నిర్మాణానికి నోచుకోవడం లేదు.
మండలంలో 30 వేలకు పైగా గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. రెండు చోట్ల సర్కార్ వైద్యశాలలున్నా అటెండర్లే వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్, కంపౌండర్ పోస్టులు రెండు చొప్పున ఖాళీగా ఉన్నాయి. సంజీవన్‌రావుపేట పశువైద్యాధికారి డాక్టర్ నేతాజీ ఇన్‌చార్జీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పశువులకు గర్భకోశ వ్యాధి, ఇతర చికిత్సలు చేసేందుకు అటెండర్లు, గోపాలమిత్రలు దిక్కుగా మారారు. మండలంలో 4గురు మాత్రమే గోపాలమిత్రలు ఉన్నారు. గోపాలమిత్రలు అత్యవసర సమయంలో దొరకని దుస్థితి. డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా పశువులకు చికిత్స జరిపేందుకు, వ్యాక్సినేషన్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డాక్టర్లు, సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పశుపోశకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ భవనంలో నిర్వహణ
కల్హేర్‌లో పశు వైద్యశాల నిర్వహణ కోసం సొంత భవనాలు నిర్మాణానికి నోచుకోవడం లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని శిథిలావంతమైన ఓ గదిలో వైద్యశాల కొనసాగిస్తున్నారు. కల్హేర్‌లో పశువైద్యశాల ప్రారంభించి దాదాపు 40 సంవత్సరాలు గడుస్తున్న సొంత భవనం నిర్మాణం కోసం మోక్షం లభించడం లేదు.
శిథిలమైన భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సరిపోయెంత గదులు, వసతులు లేక పోవడంతో మందులు, వ్యాక్సిన్‌లు ఉంచేందుకు ఇక్కట్లు తప్పడం లేదు. సిర్గాపూర్‌లో సొంత భవనం ఉన్న శిథిలవస్థలో చేరింది. భవనాల నిర్మాణం, డాక్టర్లు, సిబ్బందిని నియమించి పశువులకు మెరుగైన వైద్యసేవాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పశుపోశకులు కోరుతున్నారు.