veternary hospital
-
దేశంలోనే తొలిసారి... కుక్కలకు వెంటిలేటర్ సౌకర్యం..
గాంధీనగర్: సాధారణంగా శునకాన్ని విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. యజమానులు కుక్కని తమ కుటుంబ సభ్యుల్లో ఒకదానిలా చూసుకుంటారు. ఒకవేళ తమ పెంపుడు కుక్కకు ఏమైనా జరిగితే యజమానులు విలవిల్లాడిపోతారు. కుక్కలు కూడా తమ యజమానిపట్ల అదే విధంగా ప్రేమను, విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. ఇక్కడ ఒక యజమాని.. తన పెంపుడు కుక్క పట్ల తన ప్రేమను గొప్పగా చాటుకున్నాడు. వివరాలు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన శైవల్ దేశాయ్ అనే వ్యక్తి ఒక కుక్కను పెంచుకున్నాడు. అది ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో.. శైవల్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తన కుక్కకు సరైన వైద్యం దొరికితే.. బతికేదని భావించాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి ఒక కొత్త ఆలోచన చేశాడు. మనిషి మాదిరిగానే కుక్కలకు కూడా వెటర్నరీ ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ తర్వాత.. అతను కొన్నిరోజులకు అహ్మదాబాద్‌లో.. వెటర్నరీ బెస్ట్ బడ్స్ పెట్ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. దీనిలో అన్నిరకాల సదుపాయాలతోపాటు.. వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేశాడు. భారత్‌లో మూగజీవాలకు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న తొలి ఆస్పత్రిగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఆస్పత్రిలో మూగజీవాలన్నింటికి ఉచితంగా వైద్యం అందిస్తారని శైవల్ దేశాయ్ తెలిపారు. ఈ ఆస్పత్రి సీనియర్ వైద్యుడిగా దివ్వ్యేష్ కేలవాయ పనిచేస్తున్నారు. కొంత మంది కుక్కల నుంచి కరోనా సోకుతుందని పుకార్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో ఎలాంటి నిజంలేదని తెలిపారు. -
కొత్తది ఉన్నా ఇంకా పాతదానిలోనే..
సాక్షి, అద్దంకి (ప్రకాశం): మనుషులకు అనారోగ్యం వస్తే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారు. పశువులకు అనారోగ్యం వస్తే పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు. కానీ పశువైద్యశాలకే అనారోగ్యం వస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉన్న పాత వైద్యశాలలోనే విధులు నిర్వహిస్తున్నారు పశువైద్యులు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని క్షణం క్షణం భయపడుతూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే నూతన వైద్యశాల నిర్మించినా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజాధనం లక్షలు ఖర్చుపెట్టి నూతనంగా నిర్మించినప్పటికీ ఇంత వరకు ప్రారంభించలేదు. అరకొర మరమ్మతులు పూర్తి చేసి నూతన వైద్యశాలను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. మందులు మరో చోట ఉన్న వైద్యశాల వాన కురిస్తే కారుతుండడంతో పశువులకు సంబందించి వచ్చిన దాణా, మందులను మరో చోట భద్రపరుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కనీస మందుల నిల్వకు వీలు కాకపోవడంతో, పశువుకు వైద్యం చేసినప్పుడు ఇవ్వాల్సిన మందుల కోసం అక్కడకు పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల నెలకొన్న సమయంలో మందుల కోసం పశు పోషకులు ఇబ్బందులు ఎదుక్కొవాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. కొత్త భవనం నిర్మించినా ఉపయోగం లేని వైనం ప్రస్తుతం ఉన్న పాత వైద్యశాలకు దగ్గరలో పశు వైద్యశాల కోసం ఐదు సంవత్సరాల క్రితం రూ. 20 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు. ప్రహరీ కోసం నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ ఓపీ రూం, వెయిటింగ్ రూమ్, ఆఫీస్ రూం, స్టాక్ రూంతో ఈ భవనాన్ని ఐదారేళ్ల క్రితం నిర్మించారు. ఇక గోడలకు ప్లాస్టింగ్ చేస్తే అందులో చేరిపోవచ్చు. ఈ క్రమంలో కాంట్రాక్టరు ప్లాస్టింగ్ చేయాల్సిన దశలో వదిలి వెళ్లిపోవడంతో వైద్యశాల నిర్మించినా ఉపయోగం లేకుండాపోయింది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి నూతన వైద్యశాలకు ప్లాస్టింగ్ చేయించి, తలుపులు, కిటికీలు పెట్టిస్తే, శిథిల వైద్యశాల నుంచి పశు వైద్యశాలను నూతన భవనంలోకి మార్పిడి జరిగితే ఇబ్బందులు తప్పతాయని వైద్యురాలు, మండల ప్రజలు కోరుతున్నారు. బొమ్మనంపాడు గ్రామంలో మండలంలోని 26 గ్రామాలకు ఒకే ఒక పశు వైద్యశాల ఉంది. సుమారు 22 వేల పశువులు, 33 వేల గొర్రెలకు ఇక్కడ నుంచి వైద్యం అందిచాల్సి ఉంది. ఈ వైద్యశాల పాత పెంకుటింట్లో నడుస్తోంది. వాన కురిస్తే కారుతుంది. లోపల పగుళ్లిచ్చింది. నేలలో ఎలుకలు కన్నాలు వేసి ఫీడింగ్ మందుల సంచులను కొట్టేస్తున్నాయి. ఇందులో బయట పంచ, లోపల రెండు గదులు మాత్రమే ఉన్నాయి. అందులోని ఒక గదిలో వైద్యురాలు ఒక పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని రికార్డు వర్క్ చేసుకోవాల్సిన దుస్థితి, మరో గదిలో అత్యవసర మందుల స్టాకు ఉంటుంది. వాన కురిస్తే తెరచిన రికార్డులు తడిసిపోతాయి. రికార్డులను ఎలుకలు కొరికేస్తాయి. బయటి ఆవరణ సైతం మురుగుతో కూడి ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల మధ్య పశువైద్యులు సేవలు అందిస్తున్నారు. నూతన భవనం ప్రారంభించాలి పాత భవనం వర్షం కురిస్తే కారుతోంది. మండలంలోని 26 గ్రామాలకు ఒకే వైద్యశాల కావడంతో, మందుల స్టాకుకు కుదరడం లేదు. పెట్టిన మందులను ఎలుకలు కొరికేస్తున్నాయి. రికార్డుల నిర్వహణ కష్టంగా ఉంది. పాత భవనంలో విధులు నిర్వహించాలంటే భయమేస్తుంది. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నాం. ఎండైనా వానైనా ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మించిన నూతన భవనంకు తలుపులు పెట్టి ప్లాస్టింగ్ చేయించి, ప్రారంభిస్తే కష్టాలు తప్పుతాయి. – అనిత, వైద్యురాలు -
తెరచుకోని పశువుల ఆస్పత్రి
డాక్టర్ డిప్యూటేషన్ రద్దు సెలవులో అటెండర్ సమాచారం లేదన్న ఏడీఏ కౌడిపల్లి: రెండు రోజులుగా పశువులు ఆసుపత్రి తెరచుకోవడం లేదు. శనివారం ఆసుపత్రికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రణీత్‌రాజ్ విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఇటీవల అతని డిప్యూటేషన్ రద్దు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించే అటెండర్ రెండు రోజుల నుంచి సెలవుపై వెళ్తున్నట్లు ఆసుపత్రి ఎదుట బోర్డుపై కాగితం అంటించారు. వైద్యుడు లేక అటెండర్ రాక మూగజీవులకు వైద్యం అందడదం లేదు. ఆసుపత్రికి వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నర్సాపూర్ ఏడీఏ వెంకటయ్య వివరణ కోరగా డాక్టర్‌పై ఆరోపణలు రావడంతో అతని డిప్యూటేషన్ రద్దు చేశామన్నారు. అటెండర్ సెలవు పెట్టిని విషయం తమకు తెలియదన్నారు. సెలవుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు. రాయలాపూర్ లైవ్‌స్టాక్ అసిస్టెంట్‌ను డిప్యుటేషన్ వేస్తామని తెలిపారు. -
మూగజీవాలకు అందని వైద్యం
సిబ్బంది కొరత.. ఇబ్బందుల్లో రైతన్నలు కొండాపూర్: మూగజీవాలకు వైద్య సేవలు కరువయ్యాయి. దీంతో పశు యజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు గానూ మారేపల్లి, కొండాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో మాత్రమే పశు వైద్యశాలలున్నాయి. మండలంలో ఆవులు 4,230, ఎడ్లు 2,531 ,గేదేలు 3,804, మేకలు 8,321, గొర్రెలు 4,231 ఉన్నాయి. పశువైద్యశాలలు ఉన్నప్పటికీ, కొండాపూర్, గొల్లపల్లి, మారేపల్లిలోని పశువైద్యశాలల్లో వైద్యులే లేరు. గొల్లపల్లిలోని వైద్యురాలు పుల్కల్ మండలానికి డిప్యూటేషన్‌పై వెళ్లి సుమారు రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు కేవలం అటెండరే అక్కడ అరకొర వైద్యం అందిస్తున్నారు.కొండాపూర్‌లోని డాక్టర్ కూడా మొబైల్ వ్యానులో డిప్యుటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం కేవలం మూడు వైద్యశాలలకు కలిపి ఒక్క వైద్యుడే అందుబాటులో ఉన్నారు. మారేపల్లిలో లైవ్‌స్టాక్ ఆఫీసర్ ఉద్యోగ విరమణ పొంది ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఆయన స్థానంలో ఎవరూ రాలేదు. ప్రసుతతం కొండాపూర్‌లోని లైవ్‌స్టాక్ ఆఫీసరే మారేపల్లికి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.దీంతో గ్రామాల్లోని పశువులకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని చెప్పవచ్చు. అసలే వర్షాకాలం కావడంతో పశువులు నిత్యం అనారోగ్యాలకు గురై మృత్యువాత పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. దీనికి తోడు ఉద్యోగుల పనితీరు సైతం రైతులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది.ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వైద్యసిబ్బంది కేవలం ఉదయం 9 రావడం 12 గంటలకే వెళ్ళిపోవడంతో ఏమాత్రం ప్రజలకు అందుబాటులో వుండడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా సిబ్బందిని నియమించి పశువులకు మెరుగైన వైద్యం అందించాలనీ రైతన్నలు కోరుతున్నారు. -
మూగజీవాలకు తప్పని వ్యథ!
పశువైద్యశాలల్లో వసతులు కరువు డాక్టర్లు, సిబ్బంది కోరతతో పీడిస్తున్న సమస్య వ్యాక్సినేషన్, చికిత్సలు చేసేందుకు ఇక్కట్లు కల్హేర్: మండలంలోని కల్హేర్, సిర్గాపూర్ రెండు పశువైద్యశాలలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యశాలల్లో సరైన వసతులు లేక మూగజీవాలు తీవ్ర నరకయాతన పడుతున్నాయి.దీనికితోడు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో మూగజీవులకు వైద్య సేవలు అందడం లేదు. సొంత భవనాలు నిర్మాణానికి నోచుకోవడం లేదు. మండలంలో 30 వేలకు పైగా గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. రెండు చోట్ల సర్కార్ వైద్యశాలలున్నా అటెండర్లే వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్, కంపౌండర్ పోస్టులు రెండు చొప్పున ఖాళీగా ఉన్నాయి. సంజీవన్‌రావుపేట పశువైద్యాధికారి డాక్టర్ నేతాజీ ఇన్‌చార్జీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశువులకు గర్భకోశ వ్యాధి, ఇతర చికిత్సలు చేసేందుకు అటెండర్లు, గోపాలమిత్రలు దిక్కుగా మారారు. మండలంలో 4గురు మాత్రమే గోపాలమిత్రలు ఉన్నారు. గోపాలమిత్రలు అత్యవసర సమయంలో దొరకని దుస్థితి. డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా పశువులకు చికిత్స జరిపేందుకు, వ్యాక్సినేషన్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డాక్టర్లు, సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పశుపోశకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ భవనంలో నిర్వహణ కల్హేర్‌లో పశు వైద్యశాల నిర్వహణ కోసం సొంత భవనాలు నిర్మాణానికి నోచుకోవడం లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని శిథిలావంతమైన ఓ గదిలో వైద్యశాల కొనసాగిస్తున్నారు. కల్హేర్‌లో పశువైద్యశాల ప్రారంభించి దాదాపు 40 సంవత్సరాలు గడుస్తున్న సొంత భవనం నిర్మాణం కోసం మోక్షం లభించడం లేదు. శిథిలమైన భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సరిపోయెంత గదులు, వసతులు లేక పోవడంతో మందులు, వ్యాక్సిన్లు ఉంచేందుకు ఇక్కట్లు తప్పడం లేదు. సిర్గాపూర్‌లో సొంత భవనం ఉన్న శిథిలవస్థలో చేరింది. భవనాల నిర్మాణం, డాక్టర్లు, సిబ్బందిని నియమించి పశువులకు మెరుగైన వైద్యసేవాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పశుపోశకులు కోరుతున్నారు. -
శిథిలావస్థలో పశువైద్యశాల
కొల్చారం : కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలోని పశువైద్యశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి మధ్య కొనసాగుతోంది. భవనం పైకప్పు బీటలువారింది. వర్షం పడిందంటే నీరంతా భవనంలోని గోడల వెంట కారుతోంది. విలువైన మందులు, దాణా తడుస్తోంది. రాంపూర్, కిష్టాపూర్ గ్రామాలకు అనుబంధంగా ఉన్న ఈ పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పశువులకు మెరుగైన మందులు అందడం లేదు. ఈ గ్రామాల రైతులు పశువులకు వైద్యం చేయించేందుకు సమీపంలోని మెదక్ మండలం మాచవరం గ్రామానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. నూతన భవనం మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రూ.16 కోట్లతో 60 పశువైద్య భవనాలు
జి.సిగడాం: జిల్లాలో 60 పశువైద్యశాలల నిర్మాణానికి రూ.16 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ మెట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన బుధవారం టంకాల దిగ్గువలసలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 102 భవనాలు ఉన్నాయని, మరో 60 పక్కా భవనాలు నిర్మించాల్సి ఉందని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పాల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ డెయిరీ ద్వారా 1లక్ష 35 వేల లీటర్లు పాలసేకరణ చేసేవారని ఈసారి 1లక్ష 75 వేల లీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జిల్లాలో మినీ డెయిరీ పథకం కింద ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేసిందని, యూనిట్ ధర 2.50 లక్షల రూపాయలైతే యాభై శాతం రాయితీ కల్పిస్తోందని చెప్పారు. మేలు జాతి పశువుల పెంపకానికి ప్రత్యేక యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కోళ్లు, పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో యూనిట్ 11 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 3 రూపాయల 75 పైసల మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తే సరిపోతుందన్నారు. అలాగే గ్రామ ప్రియ పథకం కింద పెరటి కోళ్లు పెంపకానికి యూనిట్లు వచ్చాయన్నారు. లబ్ధిదారుడు రూ 810 చెల్లిస్తే 5 వేల రూపాయలు విలువ చేసే 45 కోళ్లు, వాటికి సంబంధించిన సామగ్రిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు జనార్ధనరావు, సత్యప్రసాద్, శ్రీనివాసరావు, ఆశకుమారితో పాటు సిబ్బంది ఉన్నారు. -
పశువైద్యశాల తనిఖీ
కౌడిపల్లి: మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించాలని పశుసంవర్ధకశాఖ జేడీ విక్రంకుమార్ సూచించారు. గురువారం కౌడిపల్లి పుశువైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకుతాయన్నారు. గొర్రెలకు నీలినాలుక వ్యాధి వ్యాపిస్తుందన్నారు. అనారోగ్యంతో మేత మేయక పోవడంవల్ల మృతి చెందుతాయని వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించాలన్నారు. ఇటీవల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశామన్నారు. ఆసుపత్రులలో మందుల కొరత లేదన్నారు. ఆయన వెంట డాక్టర్ ప్రణీత్‌రాజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మూగరోదనే..
పల్లెల్లో అందని పశువైద్యం మూగజీవాల పరిస్థితి దయనీయం నాటువైద్యులను ఆశ్రయిస్తున్న రైతులు -పశుసంపదకు అనుగుణంగా లేని వైద్యశాలలు -పట్టించుకోని పాలక, అధికార గణం -ఉన్న ఉద్యోగిని డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు తరలింపు -పశుపోషణ, నిర్వహణ భారంతో విక్రయిస్తున్న రైతులు కంగ్టి: పల్లెల్లో పశువులకు వైద్యం అందడంలేదు. పశువైద్య శాలలు ఎప్పుడూ మూసే ఉంటున్నాయి. ఒక వేళ తెరిచినా సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందడంలేదు. మూగజీవాలకు వ్యాధులు సోకితే వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు పరిస్థితులు నెలకొన్నా.. తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడ్డా తమ పశువులను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న రైతులకు పశువైద్యం అందించడం తలకుమించిన భారమవుతున్నది. వ్యవసాయం, పశుపోషణే ప్రధాన జీవనాధారంగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు పశువైద్యం అందడంలేదు. మండలంలో పశుసంపద ఎక్కువగా ఉన్నా తడ్కల్, కంగ్టి, వాసర్ గ్రామాల్లో మాత్రమే పశువైద్యశాలలున్నాయి. ఐదారు ఏళ్ళ నుంచి డాక్టర్లు, సిబ్బంది లేక మూతపడటమో.. లేక అటెండర్లు వైద్యం అందించి మూగజీవాల చావుబతుకులను రైతుల అదృష్టానికి వదిలేయడమో జరుగుతోంది. గత వేసవిలో మండలానికి విచ్చేసిన పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి పశుసంపద పుష్కలంగా ఉన్న తడ్కల్ వైద్యశాలకు సిబ్బంది సమకూరుస్తామని చెప్పి వెంటనే కంపౌండర్‌గా ఎండీ ఫయాజ్ను బదిలీ చేశారు. ఆయన ఒక్క రోజు కూడా విధులు నిర్వహించకుండానే జూన్‌లో పూర్తి హాజరు, జులై 14 వరకు విధులు నిర్వహించినట్లు హాజరు పట్టికలో సంతకాలు చేసి డిప్యుటేషన్‌పై జహీరాబాద్ ప్రాంతానికి వెళ్ళినట్లు సమాచారం. ఇప్పటికే మండలంలో 50 శాతం సిబ్బంది కొరత ఉంది. పశుసంపదకు అనుగుణంగా మండలంలో ఎనిమిది వైద్యశాలలుండాల్సి ఉండగా మూడు మాత్రమే ఉన్నాయి. తడ్కల్‌లో డాక్టర్, కంగ్టి, తడ్కల్‌లో కంపౌండర్, వాసర్‌లో అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్ళ క్రితమే మండలంలోని గాజుల్పాడ్, పోట్పల్లి, వంగ్ధాల్ గ్రామాల్లో పశువైద్య శాలల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు ఎలాంటి మంజూరు లభించలేదు. ప్రతి 5వేల పశుసంపదకు ఒక వైద్యశాల ఉండాలనే నిబంధనను పట్టించుకొన్న నాథుడే లేరు. మండలంలో 24వేల తెల్లజాతి పశువులు, 13 వేల నల్లజాతి పశువులు, 35వేల గొర్రెలు, 11 వేల మేకలు ఉన్నట్లు పశుగణనలు తెలుపుతున్నాయి. పశుసంపద ఎక్కువగా ఉన్న వైద్యశాల నుంచి కంపౌండర్‌గా డిప్యుటేషన్‌పై వెళ్ళడం అధికారుల అండ..రాజకీయ నాయకుల పైరవీల ఫలితమేనని రైతులు ఆరోపిస్తున్నారు. పశువుల పోషణ విషయంలో కరువు కాలంలోనూ ఎంతగానో కష్టపడి పశువులను కాపాడుకున్న రైతాంగానికి పశువైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత రెండు నెలల్లో పాముకాటుతో ఇప్పటి వరకు మండలంలో 20 వరకు పశువులు మృత్యువాత పడ్డాయి. రైతుల సమస్యలపై దృష్టిసారించి తమ పశువులకు సకాలంలో వైద్యం అందేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు. మూసి ఉన్న తడ్కల్‌లోని పశువైద్యం, శస్త్ర చికిత్స కేంద్రం