పాత భవనంలో నడుస్తున్న పశువైద్యశాల, విధులు నిర్వహించే ఇరుకు గది
సాక్షి, అద్దంకి (ప్రకాశం): మనుషులకు అనారోగ్యం వస్తే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారు. పశువులకు అనారోగ్యం వస్తే పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు. కానీ పశువైద్యశాలకే అనారోగ్యం వస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉన్న పాత వైద్యశాలలోనే విధులు నిర్వహిస్తున్నారు పశువైద్యులు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని క్షణం క్షణం భయపడుతూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే నూతన వైద్యశాల నిర్మించినా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజాధనం లక్షలు ఖర్చుపెట్టి నూతనంగా నిర్మించినప్పటికీ ఇంత వరకు ప్రారంభించలేదు. అరకొర మరమ్మతులు పూర్తి చేసి నూతన వైద్యశాలను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
మందులు మరో చోట
ఉన్న వైద్యశాల వాన కురిస్తే కారుతుండడంతో పశువులకు సంబందించి వచ్చిన దాణా, మందులను మరో చోట భద్రపరుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కనీస మందుల నిల్వకు వీలు కాకపోవడంతో, పశువుకు వైద్యం చేసినప్పుడు ఇవ్వాల్సిన మందుల కోసం అక్కడకు పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల నెలకొన్న సమయంలో మందుల కోసం పశు పోషకులు ఇబ్బందులు ఎదుక్కొవాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు.
కొత్త భవనం నిర్మించినా ఉపయోగం లేని వైనం
ప్రస్తుతం ఉన్న పాత వైద్యశాలకు దగ్గరలో పశు వైద్యశాల కోసం ఐదు సంవత్సరాల క్రితం రూ. 20 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు. ప్రహరీ కోసం నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ ఓపీ రూం, వెయిటింగ్ రూమ్, ఆఫీస్ రూం, స్టాక్ రూంతో ఈ భవనాన్ని ఐదారేళ్ల క్రితం నిర్మించారు. ఇక గోడలకు ప్లాస్టింగ్ చేస్తే అందులో చేరిపోవచ్చు. ఈ క్రమంలో కాంట్రాక్టరు ప్లాస్టింగ్ చేయాల్సిన దశలో వదిలి వెళ్లిపోవడంతో వైద్యశాల నిర్మించినా ఉపయోగం లేకుండాపోయింది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి నూతన వైద్యశాలకు ప్లాస్టింగ్ చేయించి, తలుపులు, కిటికీలు పెట్టిస్తే, శిథిల వైద్యశాల నుంచి పశు వైద్యశాలను నూతన భవనంలోకి మార్పిడి జరిగితే ఇబ్బందులు తప్పతాయని వైద్యురాలు, మండల ప్రజలు కోరుతున్నారు.
బొమ్మనంపాడు గ్రామంలో మండలంలోని 26 గ్రామాలకు ఒకే ఒక పశు వైద్యశాల ఉంది. సుమారు 22 వేల పశువులు, 33 వేల గొర్రెలకు ఇక్కడ నుంచి వైద్యం అందిచాల్సి ఉంది. ఈ వైద్యశాల పాత పెంకుటింట్లో నడుస్తోంది. వాన కురిస్తే కారుతుంది. లోపల పగుళ్లిచ్చింది. నేలలో ఎలుకలు కన్నాలు వేసి ఫీడింగ్ మందుల సంచులను కొట్టేస్తున్నాయి. ఇందులో బయట పంచ, లోపల రెండు గదులు మాత్రమే ఉన్నాయి. అందులోని ఒక గదిలో వైద్యురాలు ఒక పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని రికార్డు వర్క్ చేసుకోవాల్సిన దుస్థితి, మరో గదిలో అత్యవసర మందుల స్టాకు ఉంటుంది. వాన కురిస్తే తెరచిన రికార్డులు తడిసిపోతాయి. రికార్డులను ఎలుకలు కొరికేస్తాయి. బయటి ఆవరణ సైతం మురుగుతో కూడి ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల మధ్య పశువైద్యులు సేవలు అందిస్తున్నారు.
నూతన భవనం ప్రారంభించాలి
పాత భవనం వర్షం కురిస్తే కారుతోంది. మండలంలోని 26 గ్రామాలకు ఒకే వైద్యశాల కావడంతో, మందుల స్టాకుకు కుదరడం లేదు. పెట్టిన మందులను ఎలుకలు కొరికేస్తున్నాయి. రికార్డుల నిర్వహణ కష్టంగా ఉంది. పాత భవనంలో విధులు నిర్వహించాలంటే భయమేస్తుంది. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నాం. ఎండైనా వానైనా ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మించిన నూతన భవనంకు తలుపులు పెట్టి ప్లాస్టింగ్ చేయించి, ప్రారంభిస్తే కష్టాలు తప్పుతాయి.
– అనిత, వైద్యురాలు
Comments
Please login to add a commentAdd a comment