మూగరోదనే..
- పల్లెల్లో అందని పశువైద్యం
- మూగజీవాల పరిస్థితి దయనీయం
- నాటువైద్యులను ఆశ్రయిస్తున్న రైతులు
- -పశుసంపదకు అనుగుణంగా లేని వైద్యశాలలు
- -పట్టించుకోని పాలక, అధికార గణం
- -ఉన్న ఉద్యోగిని డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు తరలింపు
- -పశుపోషణ, నిర్వహణ భారంతో విక్రయిస్తున్న రైతులు
కంగ్టి: పల్లెల్లో పశువులకు వైద్యం అందడంలేదు. పశువైద్య శాలలు ఎప్పుడూ మూసే ఉంటున్నాయి. ఒక వేళ తెరిచినా సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందడంలేదు. మూగజీవాలకు వ్యాధులు సోకితే వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు పరిస్థితులు నెలకొన్నా.. తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడ్డా తమ పశువులను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న రైతులకు పశువైద్యం అందించడం తలకుమించిన భారమవుతున్నది.
వ్యవసాయం, పశుపోషణే ప్రధాన జీవనాధారంగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు పశువైద్యం అందడంలేదు. మండలంలో పశుసంపద ఎక్కువగా ఉన్నా తడ్కల్, కంగ్టి, వాసర్ గ్రామాల్లో మాత్రమే పశువైద్యశాలలున్నాయి. ఐదారు ఏళ్ళ నుంచి డాక్టర్లు, సిబ్బంది లేక మూతపడటమో.. లేక అటెండర్లు వైద్యం అందించి మూగజీవాల చావుబతుకులను రైతుల అదృష్టానికి వదిలేయడమో జరుగుతోంది. గత వేసవిలో మండలానికి విచ్చేసిన పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి పశుసంపద పుష్కలంగా ఉన్న తడ్కల్ వైద్యశాలకు సిబ్బంది సమకూరుస్తామని చెప్పి వెంటనే కంపౌండర్‌గా ఎండీ ఫయాజ్‌ను బదిలీ చేశారు.
ఆయన ఒక్క రోజు కూడా విధులు నిర్వహించకుండానే జూన్‌లో పూర్తి హాజరు, జులై 14 వరకు విధులు నిర్వహించినట్లు హాజరు పట్టికలో సంతకాలు చేసి డిప్యుటేషన్‌పై జహీరాబాద్ ప్రాంతానికి వెళ్ళినట్లు సమాచారం. ఇప్పటికే మండలంలో 50 శాతం సిబ్బంది కొరత ఉంది. పశుసంపదకు అనుగుణంగా మండలంలో ఎనిమిది వైద్యశాలలుండాల్సి ఉండగా మూడు మాత్రమే ఉన్నాయి. తడ్కల్‌లో డాక్టర్, కంగ్టి, తడ్కల్‌లో కంపౌండర్, వాసర్‌లో అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఐదేళ్ళ క్రితమే మండలంలోని గాజుల్‌పాడ్, పోట్‌పల్లి, వంగ్ధాల్ గ్రామాల్లో పశువైద్య శాలల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు ఎలాంటి మంజూరు లభించలేదు. ప్రతి 5వేల పశుసంపదకు ఒక వైద్యశాల ఉండాలనే నిబంధనను పట్టించుకొన్న నాథుడే లేరు. మండలంలో 24వేల తెల్లజాతి పశువులు, 13 వేల నల్లజాతి పశువులు, 35వేల గొర్రెలు, 11 వేల మేకలు ఉన్నట్లు పశుగణనలు తెలుపుతున్నాయి.
పశుసంపద ఎక్కువగా ఉన్న వైద్యశాల నుంచి కంపౌండర్‌గా డిప్యుటేషన్‌పై వెళ్ళడం అధికారుల అండ..రాజకీయ నాయకుల పైరవీల ఫలితమేనని రైతులు ఆరోపిస్తున్నారు. పశువుల పోషణ విషయంలో కరువు కాలంలోనూ ఎంతగానో కష్టపడి పశువులను కాపాడుకున్న రైతాంగానికి పశువైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత రెండు నెలల్లో పాముకాటుతో ఇప్పటి వరకు మండలంలో 20 వరకు పశువులు మృత్యువాత పడ్డాయి. రైతుల సమస్యలపై దృష్టిసారించి తమ పశువులకు సకాలంలో వైద్యం అందేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు.
మూసి ఉన్న తడ్కల్‌లోని పశువైద్యం, శస్త్ర చికిత్స కేంద్రం