Kangti
-
చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత
కంగ్టి: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతై వ్యక్తి మృతి చెందిన సంఘటన కంగ్టి మండలంలోని తడ్కల్‌లో సోమవారం చోటుచేసుకొంది. స్థానికుడైన మత్స్యకారుడు పస్పుల రాములు (45) ఉదయం తడ్కల్ గ్రామ శివారులోని చిన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడడంతో వెంట వెళ్లిన వారు పసిగట్టి కాపాడే ప్రయత్నం చేసేలోపే నీటిలో మునిగి గల్లంతైనట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించి గ్రామస్తుల సహాయంతో గాలించగా మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ నానునాయక్ సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
వైభవంగా ‘కాళూబాబా’ ఉత్సవాలు
ఆకట్టుకున్న గిరిజనుల నృత్యాలు సంతానం కోసం మహిళల వేడుకోలు ఉత్సవాల్లో పాల్గొన్న ఖేడ్, జుక్కల్ ఎమ్మెల్యేలు వేల సంఖ్యలో పాల్గొన్న గిరిజనులు కంగ్టి: మండలంలోని తడ్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎడ్లరేగడి తండాలోని జ్వాలాముఖి కాళుబాబా ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలు ఏటా ఆశ్వాయుజ మాసంలోని మొదటి మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ నిత్యపూజారి మంగళ్‌చంద్ మహారాజ్, జవహర్ మహారాజ్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కొనసాగిన గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాకు చెందిన గిరిజనులతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, గాంధారీ, కామారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాల నుంచి దాదాపు 5 వేలకు పైగా గిరిజనులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. నృత్యాల్లో దాదాపు 40కి పైగా బృందాలు పాల్గొన్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు వేడుకలు, నృత్యాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. నృత్యాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు మంగల్‌చంద్ మహారాజ్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే పాల్గొని జ్వాలాముఖి కాళుబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవునెయ్యితో ఆలయం ఆవరణలో హోమం నిర్వహించారు. సంతానం లేని మహళలకు హోమంలో వేసిన చెరుకు గడలు ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. దీంతో అధిక సంఖ్యలో మహిళలు ప్రసాదం కోసం పోటీపడ్డారు. కోరికలు తీరిన దాదాపు 100 మంది ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. వసతి కోసం సత్రం ఏర్పాటు చేయడం విశేషం. ఉత్సవాల కోసం భారీగా నిధులు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే మాట్లాడుతూ.. సేవాలాల్ ఉత్సవాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి నిర్వహింస్తుందన్నారు. దీంతో పాటు సేవాలాల్ పూజారులకు తెలంగాణ ప్రభుత్వం గౌరవవేతనం చెల్లిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో కోట ఆంజనేయులు, నారాయణ, దత్తుసేఠ్, పండరి, రమేశ్, మాణిక్‌రెడ్డి, రాజుపటేల్, శివాజీరావు, సాయాగౌడ్, సిద్ధు, రాజప్ప, సంజు, రాములు, వెంకట్రాంరెడ్డి, విశ్వనాథ్, తహసీల్దార్ రాజయ్య, ఎస్సై నానునాయక్, ఎంపీడీఓ మధుసూదన్, పిట్లం మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, నర్సాగౌడ్, వాసరి రమేశ్, ప్రతాప్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంప్లెక్స్ స్థాయిలోనే ప్రశ్నపత్రాల రూపకల్పన
కంగ్టి: స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలోనే ప్రశ్న పత్రాలను తయారు చేసుకోవాలని ఎంఈఓ మల్లేశం సూచించారు. బుధవారం మండలంలోని తడ్కల్, వాసర్, కంగ్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్, ఉపాధ్యాయులకు, విద్యా వలంటీర్లకు సులభ రీతిలో విద్యాబోధనపై అవగాహన కల్పించారు. సీసీఈ పద్ధతిలో విద్యార్థుల భాగస్వామ్యంపై దృష్టి సారించాలని, విషయ అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశాల్లో ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, పెంటయ్య, కాశీనాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
చేతిపంపు.. నీటిపొంగు
కంగ్టి: ఇటీవల కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. దీంతో బోర్గిలో చేతిపంపు నుంచి నీరు ఉబికి వస్తోంది. కంగ్టి మండలంలో అత్యంత నీటి కొరత ఉన్న గ్రామంగా బోర్గికి పేరుంది. దీంతో ఏటా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో డిసెంబర్ నెలలోనే తాగునీటి ట్యాంకర్‌తో నీటిని అందించే ఏర్పాట్లు చేయించారు. కాగా దగ్గరలో నీటి జాడలు లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుండి నీటిని సరఫరా చేసేవారు. అలాంటి గ్రామంలోని చేతిపంపు నుండి నీరు వస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
తండా.. చదువుల అండ
సర్కారు కొలువులే ధ్యేయంగా సాధుతండావాసులు ఇంజినీరింగ్ చేస్తున్నవారే అధికం విదేశాల్లో స్థిరపడుతున్న గిరిజనులు యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన ఉద్యోగులు కంగ్టి: మండలంలోని జమ్గి(బి) గ్రామ పంచాయతీ పరిధిలోని సాధుతండాలో 62 గృహాలు, 83 కుటుంబాలు ఉండగా.. 640 జనాభా ఉన్నారు. 20 ఏళ్ల క్రితం ఇంజినీర్లుగా ఉద్యోగం సాధించిన ఇద్దరు గిరిజనులు ఆ తండాలోని యువతకు ఆదర్శంగా నిలిచారు. వారిని ఆదర్శంగా తీసుకున్న గ్రామస్తుల్లో ప్రస్తుతం దాదాపు 20 మంది ఇంజినీర్లుగా.. మరికొందరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. అంతేకాదు బ్యాంకులు, అటవీశాఖతో పాటు మిలటరీలోనూ ఉద్యోగం పొందారు. విదేశాల్లోనూ స్థిరపడినవారు ఉన్నారు. దాదాపు 40 మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండటం విశేషం. మూడు కిలోమీటర్ల నడక సాధుతండా మొత్తం అడవులు, గుట్టల్లో ఉంది. మండల కేంద్రం నుంచి సాధుతండా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాలంటే కనీసం మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా సరిహద్దు కూడా ఈ ప్రాంతం. అయినా, ఏ మాత్రం అభివృద్ధి లేని తండా. ఉన్నత చదువుల్లో ముందంజ బయోటెక్నాలజీ, కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివిన అక్కాచెళ్లెళ్లు చైతన్య, సింధూ యూఎస్ఏలో స్థిరపడ్డారు. మరో సోదరి స్వాతి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎంబీఏ పూర్తి చేసి ఆంధ్రాబ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వారి తల్లి గంగబాయి ఎంఈఓ కాగా తండ్రి మారుతి ఎస్బీఐ రిజినల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పండరి ఆదిలాబాద్ జిల్లా భూపాలపల్లిలో జెన్కోలో ఏడీఈ, నారాయణ, మోతీరాం ట్రాన్స్‌కోలో అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్లు, కుషాల్ సివిల్ ఇంజినీరింగ్ చేసి ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. తండాలో చదువుకొంటున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది కంప్యూటర్, మెకానికల్, అగ్రికల్చర్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌తో పాలు డిప్లొమాలు, ఐటీఐ చేస్తున్నారు. తండా అభివృద్ధికి పాటుపడతా మా తండాతో పాటు పరిసర గ్రామాల అభివృద్ధికి పాటుపడతా. మా ప్రాంతంలోని నిరుద్యోగ యువకులు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేందుకు కృషిచేస్తా. నా తర్వాత మా కుటుంబంలో చాలామంది ఇంజినీర్లు అయ్యారు. - మోతీరాం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ట్రాన్స్‌కో మాతృదేశానికి సేవ మాతృదేశానికి సైనికుడిగా సేవ చేస్తున్నా. ఇంతటి సాహసోపేతమైన ఉద్యోగం సాధించడానికి ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులు, తండావాసులకు సెల్యూట్. సరిహద్దులో సేవలందించే భాగ్యాన్ని పొందడం నా అదృష్టం. - రవీందర్, సైనికుడు విద్యాభివృద్ధికి చేయూత మా తండాతో పాటు పరిసర గ్రామాల్లో విద్యాభివృద్ధికి చేయూత అందిస్తున్నా. మా తండాలో పిల్లలు పోటీతత్వంతో చదువుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులకు వారంతా సాయం చేయడం అభినందనీయం. - నారాయణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ట్రాన్స్‌కో పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నాం మా తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకున్నా శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, వైజాగ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి డబ్బులు కూడబెడుతున్నారు. పిల్లల చదువుల కోసం ఎంతో శ్రమపడుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన పిల్లలు అదేస్థాయిలో చదువుకుంటున్నారు. - పండరి, ఏడీఈ, జెన్కో, భూపాలపల్లి వలసతో బాధ వ్యవసాయం సక్రమంగా సాగకపోవడంతో మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా మారారు. వ్యవసాయంలో ఆధునిక, శాస్త్రీయ పద్ధతులు పాటించాలనిపించింది. అందుకే అగ్రికల్చర్ బీటెక్ చేస్తున్నా. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ రాబడి ఇచ్చే పంటల అభివృద్ధికి కృషి చేస్తా. - అనిత, బి.టెక్, అగ్రికల్చర్ -
మూగరోదనే..
పల్లెల్లో అందని పశువైద్యం మూగజీవాల పరిస్థితి దయనీయం నాటువైద్యులను ఆశ్రయిస్తున్న రైతులు -పశుసంపదకు అనుగుణంగా లేని వైద్యశాలలు -పట్టించుకోని పాలక, అధికార గణం -ఉన్న ఉద్యోగిని డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు తరలింపు -పశుపోషణ, నిర్వహణ భారంతో విక్రయిస్తున్న రైతులు కంగ్టి: పల్లెల్లో పశువులకు వైద్యం అందడంలేదు. పశువైద్య శాలలు ఎప్పుడూ మూసే ఉంటున్నాయి. ఒక వేళ తెరిచినా సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందడంలేదు. మూగజీవాలకు వ్యాధులు సోకితే వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు పరిస్థితులు నెలకొన్నా.. తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడ్డా తమ పశువులను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న రైతులకు పశువైద్యం అందించడం తలకుమించిన భారమవుతున్నది. వ్యవసాయం, పశుపోషణే ప్రధాన జీవనాధారంగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు పశువైద్యం అందడంలేదు. మండలంలో పశుసంపద ఎక్కువగా ఉన్నా తడ్కల్, కంగ్టి, వాసర్ గ్రామాల్లో మాత్రమే పశువైద్యశాలలున్నాయి. ఐదారు ఏళ్ళ నుంచి డాక్టర్లు, సిబ్బంది లేక మూతపడటమో.. లేక అటెండర్లు వైద్యం అందించి మూగజీవాల చావుబతుకులను రైతుల అదృష్టానికి వదిలేయడమో జరుగుతోంది. గత వేసవిలో మండలానికి విచ్చేసిన పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి పశుసంపద పుష్కలంగా ఉన్న తడ్కల్ వైద్యశాలకు సిబ్బంది సమకూరుస్తామని చెప్పి వెంటనే కంపౌండర్‌గా ఎండీ ఫయాజ్ను బదిలీ చేశారు. ఆయన ఒక్క రోజు కూడా విధులు నిర్వహించకుండానే జూన్‌లో పూర్తి హాజరు, జులై 14 వరకు విధులు నిర్వహించినట్లు హాజరు పట్టికలో సంతకాలు చేసి డిప్యుటేషన్‌పై జహీరాబాద్ ప్రాంతానికి వెళ్ళినట్లు సమాచారం. ఇప్పటికే మండలంలో 50 శాతం సిబ్బంది కొరత ఉంది. పశుసంపదకు అనుగుణంగా మండలంలో ఎనిమిది వైద్యశాలలుండాల్సి ఉండగా మూడు మాత్రమే ఉన్నాయి. తడ్కల్‌లో డాక్టర్, కంగ్టి, తడ్కల్‌లో కంపౌండర్, వాసర్‌లో అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్ళ క్రితమే మండలంలోని గాజుల్పాడ్, పోట్పల్లి, వంగ్ధాల్ గ్రామాల్లో పశువైద్య శాలల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు ఎలాంటి మంజూరు లభించలేదు. ప్రతి 5వేల పశుసంపదకు ఒక వైద్యశాల ఉండాలనే నిబంధనను పట్టించుకొన్న నాథుడే లేరు. మండలంలో 24వేల తెల్లజాతి పశువులు, 13 వేల నల్లజాతి పశువులు, 35వేల గొర్రెలు, 11 వేల మేకలు ఉన్నట్లు పశుగణనలు తెలుపుతున్నాయి. పశుసంపద ఎక్కువగా ఉన్న వైద్యశాల నుంచి కంపౌండర్‌గా డిప్యుటేషన్‌పై వెళ్ళడం అధికారుల అండ..రాజకీయ నాయకుల పైరవీల ఫలితమేనని రైతులు ఆరోపిస్తున్నారు. పశువుల పోషణ విషయంలో కరువు కాలంలోనూ ఎంతగానో కష్టపడి పశువులను కాపాడుకున్న రైతాంగానికి పశువైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత రెండు నెలల్లో పాముకాటుతో ఇప్పటి వరకు మండలంలో 20 వరకు పశువులు మృత్యువాత పడ్డాయి. రైతుల సమస్యలపై దృష్టిసారించి తమ పశువులకు సకాలంలో వైద్యం అందేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు. మూసి ఉన్న తడ్కల్‌లోని పశువైద్యం, శస్త్ర చికిత్స కేంద్రం -
ముమ్మరంగా వాటర్‌షెడ్ పనులు
కంగ్టి, న్యూస్‌లైన్: భూగర్భ జలవనరులను సమృద్ధి పరి చేందుకు చేపడుతున్న మెగా వాటర్‌షెడ్ పథకం పనులు మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తుర్కవడ్‌గాం శివారులో నీటి కుంటల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోనే అతి పెద్ద తుర్కవడ్‌గాం గ్రామ పంచాయతీ పరిధిలో రాజారాం తండా, సాధుతండా, చింతామణి తండాలు ఉన్నాయి. ఇక్కడ సాగుకు పనికి రాని భూములే ఎక్కువ. బొడిగె రాళ్లు, పరుపు బండ రాళ్ల భూములే అధికం. నీటి వనరులు చాలా తక్కువ. ఇక్కడి రైతులు కేవలం వర్షాధారం కింద ఖరీఫ్ పంటలు మాత్రమే పండిస్తారు. అందుకే ఈ ప్రాంత గిరిజనులు ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. వీరి భూములను అభివృద్ధి పరిచేందుకు మండలంలో ‘మెగా వాటర్ షెడ్ తుర్కవడ్‌గాం’ పథకం పేరిట పనులు చేపడుతున్నారు. నీటి కుంటలు, ర్యాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణాలను చేపడుతున్నారు.తుర్కవడ్గాంలోని 870 హెక్టార్ల భూములను మెగా వాటర్‌షెడ్ కింద గుర్తించారు. ఈ మేరకు రూ.1.04 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు 25 శాతం పనులు పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే 34 నీటి కుంటల నిర్మాణం పనులను యంత్రాల ద్వారా పూర్తి చేశారు. మరో 14 నీటి కుంటల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో నీటి కుంటకు రూ.30 నుంచి రూ.50వేల వర కు వెచ్చిస్తున్నారు. ఇవే కాకుండా ఈ ప్రాంతంలో ర్యాక్ఫీల్డ్ డ్యాంలు(రాతి కట్టడాలు) కూడా చేపట్టారు. కుంటల అభివృద్ధి వల్ల తమ ప్రదేశాల్లో భూగర్భ జల వనరులు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.