తండా.. చదువుల అండ | sadhu thanda.. fully educators | Sakshi
Sakshi News home page

తండా.. చదువుల అండ

Published Sat, Sep 10 2016 8:33 PM | Last Updated on Thu, Jul 11 2019 5:31 PM

ఇంజినీర్లుగా పనిచేస్తున్న సాధుతండావాసులు - Sakshi

ఇంజినీర్లుగా పనిచేస్తున్న సాధుతండావాసులు

  • సర్కారు కొలువులే ధ్యేయంగా సాధుతండావాసులు
  • ఇంజినీరింగ్‌ చేస్తున్నవారే అధికం
  • విదేశాల్లో స్థిరపడుతున్న గిరిజనులు
  • యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన ఉద్యోగులు
  • కంగ్టి: మండలంలోని జమ్గి(బి) గ్రామ పంచాయతీ పరిధిలోని సాధుతండాలో 62 గృహాలు, 83 కుటుంబాలు ఉండగా.. 640 జనాభా ఉన్నారు. 20 ఏళ్ల క్రితం ఇంజినీర్లుగా ఉద్యోగం సాధించిన ఇద్దరు గిరిజనులు ఆ తండాలోని యువతకు ఆదర్శంగా నిలిచారు. వారిని ఆదర్శంగా తీసుకున్న గ్రామస్తుల్లో ప్రస్తుతం దాదాపు 20 మంది ఇంజినీర్లుగా.. మరికొందరు ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. అంతేకాదు బ్యాంకులు, అటవీశాఖతో పాటు మిలటరీలోనూ ఉద్యోగం పొందారు. విదేశాల్లోనూ స్థిరపడినవారు ఉన్నారు. దాదాపు 40 మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండటం విశేషం.

    మూడు కిలోమీటర్ల నడక
    సాధుతండా మొత్తం అడవులు, గుట్టల్లో ఉంది. మండల కేంద్రం నుంచి సాధుతండా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాలంటే కనీసం మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. నిజామాబాద్‌ జిల్లా సరిహద్దు కూడా ఈ ప్రాంతం. అయినా, ఏ మాత్రం అభివృద్ధి లేని తండా.

    ఉన్నత చదువుల్లో ముందంజ
    బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివిన అక్కాచెళ్లెళ్లు చైతన్య, సింధూ యూఎస్‌ఏలో స్థిరపడ్డారు. మరో సోదరి స్వాతి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎంబీఏ పూర్తి చేసి ఆంధ్రాబ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వారి తల్లి గంగబాయి ఎంఈఓ కాగా తండ్రి మారుతి ఎస్‌బీఐ రిజినల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

    పండరి ఆదిలాబాద్‌ జిల్లా భూపాలపల్లిలో జెన్‌కోలో ఏడీఈ, నారాయణ, మోతీరాం ట్రాన్స్‌కోలో అసిస్టెంట్‌ ఎక్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, కుషాల్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసి ఇరిగేషన్‌ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. తండాలో చదువుకొంటున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది కంప్యూటర్‌, మెకానికల్‌, అగ్రికల్చర్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌తో పాలు డిప్లొమాలు, ఐటీఐ చేస్తున్నారు.

    తండా అభివృద్ధికి పాటుపడతా
    మా తండాతో పాటు పరిసర గ్రామాల అభివృద్ధికి పాటుపడతా. మా ప్రాంతంలోని నిరుద్యోగ యువకులు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేందుకు కృషిచేస్తా. నా తర్వాత మా కుటుంబంలో చాలామంది ఇంజినీర్లు అయ్యారు. - మోతీరాం, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ట్రాన్స్‌కో

    మాతృదేశానికి సేవ
    మాతృదేశానికి సైనికుడిగా సేవ చేస్తున్నా. ఇంతటి సాహసోపేతమైన ఉద్యోగం సాధించడానికి ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులు, తండావాసులకు సెల్యూట్‌. సరిహద్దులో సేవలందించే భాగ్యాన్ని పొందడం నా అదృష్టం. - రవీందర్‌, సైనికుడు

    విద్యాభివృద్ధికి చేయూత
    మా తండాతో పాటు పరిసర గ్రామాల్లో విద్యాభివృద్ధికి చేయూత అందిస్తున్నా. మా తండాలో పిల్లలు పోటీతత్వంతో చదువుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులకు వారంతా సాయం చేయడం అభినందనీయం. - నారాయణ, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ట్రాన్స్‌కో

    పిల్లలను ఎంకరేజ్‌ చేస్తున్నాం
    మా తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకున్నా శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, వైజాగ్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి డబ్బులు కూడబెడుతున్నారు. పిల్లల చదువుల కోసం ఎంతో శ్రమపడుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన పిల్లలు అదేస్థాయిలో చదువుకుంటున్నారు. - పండరి, ఏడీఈ, జెన్‌కో, భూపాలపల్లి

    వలసతో బాధ
    వ్యవసాయం సక్రమంగా సాగకపోవడంతో మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా మారారు. వ్యవసాయంలో ఆధునిక, శాస్త్రీయ పద్ధతులు పాటించాలనిపించింది. అందుకే అగ్రికల్చర్‌ బీటెక్‌ చేస్తున్నా. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ రాబడి ఇచ్చే పంటల అభివృద్ధికి కృషి చేస్తా. - అనిత, బి.టెక్‌, అగ్రికల్చర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement