మాట్లాడుతున్న జేడీ
రూ.16 కోట్లతో 60 పశువైద్య భవనాలు
Published Wed, Aug 17 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
జి.సిగడాం: జిల్లాలో 60 పశువైద్యశాలల నిర్మాణానికి రూ.16 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ మెట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన బుధవారం టంకాల దిగ్గువలసలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 102 భవనాలు ఉన్నాయని, మరో 60 పక్కా భవనాలు నిర్మించాల్సి ఉందని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పాల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ డెయిరీ ద్వారా 1లక్ష 35 వేల లీటర్లు పాలసేకరణ చేసేవారని ఈసారి 1లక్ష 75 వేల లీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జిల్లాలో మినీ డెయిరీ పథకం కింద ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేసిందని, యూనిట్ ధర 2.50 లక్షల రూపాయలైతే యాభై శాతం రాయితీ కల్పిస్తోందని చెప్పారు.
మేలు జాతి పశువుల పెంపకానికి ప్రత్యేక యూనిట్‌లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కోళ్లు, పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో యూనిట్ 11 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 3 రూపాయల 75 పైసల మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తే సరిపోతుందన్నారు. అలాగే గ్రామ ప్రియ పథకం కింద పెరటి కోళ్లు పెంపకానికి యూనిట్లు వచ్చాయన్నారు. లబ్ధిదారుడు రూ 810 చెల్లిస్తే 5 వేల రూపాయలు విలువ చేసే 45 కోళ్లు, వాటికి సంబంధించిన సామగ్రిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు జనార్ధనరావు, సత్యప్రసాద్, శ్రీనివాసరావు, ఆశకుమారితో పాటు సిబ్బంది ఉన్నారు.
Advertisement