సాయం‘బంద్‌’! | no help | Sakshi
Sakshi News home page

సాయం‘బంద్‌’!

Aug 12 2016 11:39 PM | Updated on Sep 4 2017 9:00 AM

పొలంలో పని చేస్తున్న రైతు

పొలంలో పని చేస్తున్న రైతు

ఆపదలో ఆదుకోవాల్సిన ‘రైతు బంధు’ పథకం జిల్లాలో నీరుగారుతోంది. రైతులకు ఆశించినంతగా రుణాలు మంజూరు చేయడంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు విఫలమవుతున్నారు

 
– జిల్లాలో నీరుగారుతున్న రైతు బంధు పథకం
– సరైన అవగాహన లేక నష్టపోతున్న రైతులు
– 19 మార్కెట్‌ యార్డులకు గాను శ్రీకాళహస్తిలోనే రుణాలు
– అక్కడా అయినవారికి, అధికారపార్టీ అనుచరులకే..
 
సాక్షి, చిత్తూరు: ఆపదలో ఆదుకోవాల్సిన ‘రైతు బంధు’ పథకం జిల్లాలో నీరుగారుతోంది. రైతులకు ఆశించినంతగా రుణాలు మంజూరు చేయడంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఈ పథకానికి కేటాయించిన నిధులూ పూర్తిస్థాయిలో ఖర్చు చేయడంలేదు. పంటకు గిట్టుబాటు ధర లేకున్నా ఒకటికి సగానికి అమ్ముకుని అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోంది. 
పథకం ఉద్దేశం ఇదీ
పంటకు గిట్టుబాటు ధర లేనప్పుడు ఉదారంగా రైతులకు వడ్డీలేని రుణం ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. దీనికోసం మార్కెటింగ్‌ కమిటీల దగ్గర ‘రైతు బంధు’ పేరుతో ప్రభుత్వం నిధులు ఉంచుతోంది. మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర లేకుంటే గోదాముల్లో నిల్వ ఉంచి ఆ పంటపై వడ్డీ లేని రుణాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు కష్టం లేకుండా చేయాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కానీ అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల ఉదాసీనత వెరసి రైతులకు తీరని నష్టాల్ని మిగుల్చుతోంది. రాజకీయ పలుబడి ఉన్న వారికే రుణాలు మంజూరు చేస్తూ సామాన్య, మధ్యతరగతి వారిని గాలికొదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. 
ఆరు నెలలు వడ్డీ లేని రుణం
ఈ పథకం కింద రైతులకు 180 రోజుల పాటు వడ్డీ లేని రుణం తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ఆరు నెలల తర్వాత అప్పును కట్టలేని పక్షంలో 3 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఇది కూడా 270 రోజుల వరకే పరిమితం. 
నిధులు పుష్కలంగా ఉన్నా..
ప్రతి సంవత్సరం రైతులకు ‘రైతు బంధు’ పథకం కింద విరివిగా రుణాలు ఇవ్వాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కెటింగ్‌ కమిటీల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నా.. రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు కూడా ప్రై వేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో వేలకు వేలు వడ్డీలు కట్టాల్సి వస్తోంది.
ఒక్క యార్డులో మాత్రమే..
జిల్లాలో 19 మార్కెటింగ్‌ యార్డులున్నాయి. వీటిలో శ్రీకాళహస్తి యార్డులో మాత్రమే రైతు బంధు పథకం కింద 24 మంది రైతులకు రుణం ఇచ్చారు. జిల్లా అంతటా రుణాలు ఇవ్వాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. పాలకులూ దీన్ని సక్రమంగా పట్టించుకోవడంలేదు. కనీసం ఏడాదిలో ఒక్కసారీ ఎంతమందికి రుణాలిస్తున్నారో తెలుకోని పరిస్థితి. 
రైతులు అడిగితే రుణాలిస్తాం
రైతులు అడిగితే రైతు బంధు పథకం కింద తప్పకుండా రుణాలు ఇస్తాం. ఈ సంవత్సరం తొట్టంబేడు మార్కెటింగ్‌ యార్డు పరిధిలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. రాజకీయాలతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణాలు ఇస్తాం. ఎలాంటి సందేహాలకు తావులేదు.
– పరమేశ్, సూపరింటెండెంట్, మార్కెటింగ్‌ శాఖ
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement