పల్లెల్లో పైసల్లేవ్‌ | no money at the people | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పైసల్లేవ్‌

Published Wed, Dec 21 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

పల్లెల్లో పైసల్లేవ్‌

పల్లెల్లో పైసల్లేవ్‌

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడి ఉపాధికి గండి
 ఆర్థిక సంక్షోభంలో 5 లక్షల మంది
 పనులు దొరక్క పొరుగు రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన 50 వేల మంది
 ఉపాధి హామీ పనులూ అరకొరే
 వేతన సొమ్ములు బ్యాంకుల్లో జమ చేసినా తీసుకునే పరిస్థితి లేదు
 
 
 
 
 
 అనుబంధాలకు బాటలు వేస్తూ.. బాగోగుల హారతి పట్టే పల్లె పెద్దనోట్ల దెబ్బకు కుదేలై మూగగా రోదిస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఆవేదనను పంటి బిగువన నొక్కిపెడుతూ.. ఉబికివస్తున్న కన్నీటిని అదిమిపడుతోంది. కాసు కష్టాలను ఎలా అధిగమించాలో తెలియక బేలచూపులు చూస్తోంది. పనుల్లేక కొందరు.. పనులు దొరికినా కూలి డబ్బులు చేతికందక ఇంకొందరు విలవిల్లాడుతున్నారు. పొరుగు ప్రాంతాల్లో పొట్టపోసుకునే కూలీ బతుకులన్నీ.. అక్కడ పనులు దొరక్క పల్లెతల్లి చెంతకు చేరుతున్నాయి. కడుపులోకి కాళ్లు చేర్చుకుని.. ఆకలి బాధనుంచి ఎలా గట్టెక్కాలి దేవుడా అంటూ మౌనంగా రోదిస్తున్నారు.
 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పెద్ద నోట్ల రద్దు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములున్నా తీసుకోలేని స్థితికి రైతులు నెట్టబడగా.. కష్టించి పనిచేసినా కూలి డబ్బు అందని దుస్థితిలో కూలీలు ఉన్నారు. అసంఘటిత రంగం కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో పనుల కోసం పట్టణాలకు, దూర ప్రాంతాలకు వెళ్లే కూలీలు పనులు దొరక్క ఇళ్ల వద్దే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
సమస్త వృత్తులు సమస్యల్లోనే..
గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, చేతివృత్తులపై ఆధారపడిన వారు, అసంఘటిత రంగ కార్మికులు పెద్దనోట్ల రద్దు కారణంగా అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగం కుదేలైంది. తాపీ, వడ్రంగి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, పెయింటింగ్‌ ఇలా వివిధ వృత్తులు చేసుకుని జీవించే వారికి ప్రస్తుత సంక్షోభం తేరుకోని విధంగా దెబ్బకొట్టింది. దాదాపుగా 50 శాతం మంది పల్లె ప్రజలు పనులు తగ్గిపోయి ఉపాధి కోల్పోయారు. ఇళ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభించిన వారు చేతిలో సొమ్ములు లేక పనులు ఆపేశారు. రైతు కూలీలు, బంటా కార్మికులు సైతం ఆందోళనలో ఉన్నారు.  హామాలీలు, బిల్డింగ్‌ వర్కర్స్, ఫ్యాక్టరీలో పనిచేసే వారు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో బిల్డింగ్‌ వర్కర్స్, వడ్రంగి కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనులు చేసేవారు, రైస్‌ మిల్లు కార్మికులు కలిపి సుమారు 5 లక్షల మంది ఉన్నట్టు ఆంచనా. వీరంతా పనులు దొరక్క అవస్థలు పడుతున్నారు. జిల్లా నుంచి బెంగళూరు, కేరళ, తమిళనాడు, హైదరాబాద్‌ తదితర ప్రాంబాలకు భవన నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లిన 50 వేల మంది అక్కడ పనులు దొరక్క ఇళ్లకు తిరిగొచ్చారు. ప్రస్తుతం ఉపాధి ఉన్న కార్మికులకూ యాజమాన్యాలు వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదు. చెక్కులు రూపంలో కూలి డబ్బులు ఇవ్వడంతో వాటిని మార్చుకునేందుకు కార్మికులు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు పండించిన ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అయినప్పటికీ తీసుకునే అవకాశం లేదు. కాళ్లరిగేలా తిరిగినా వారానికి రూ.20 వేలు కూడా ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం మంది రైతులకు వివిధ కారణాల వల్ల ఇంకా నగదు జమ కాని పరిస్థితి. జాతీయ బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కనీసం రూ.50 వేల చొప్పున ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతు చేతుల్లో డబ్బులుంటేనే గ్రామాల్లో ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. రైతులకు సొమ్ములు అందకపోవడంతో కూలీలకు చెల్లింపులు చేయడం లేదు. ఏజెన్సీ ప్రాంతాలైన పోలవరం,  బుట్టాయగూడెం, వేలేరుపాడు, జీలుగుమిల్లి తదితర మండలాల్లో పనుల్లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లా వెళ్లి వ్యవసాయ పనులు చేస్తున్నారు.అక్కడ కూడా చేసిన పనులకు సొమ్ము చెల్లించకపోవటంతో వెనుతిరుగుతున్నారు. రబీ సీజన్, క్రిస్ట్‌మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు నెల రోజుల ముందు పనులు ముమ్మరంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో పనులు లేక వ్యవసాయ కూలీలు, కార్మికులు, హమాలీ జట్టు కూలీలు ఖాళీగా ఉంటున్నారు. దీంతో కుటుంబాల పోషణ కష్టమవుతోందని వాపోతున్నారు. ఒకవిధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు పల్లెలను కన్నీరు పెట్టిస్తోంది.
 
అక్కరకు రాని ఉపాధి హామీ పథకం
మరోవైపు ఉపాధి హామీ పథకం కూడా అక్కరకు రావడం లేదు. జిల్లాలో 5.37 లక్షల మందికి జాబ్‌ కార్డులు ఉన్నా.. రోజుకు 12 వేల పనిదినాలే కల్పించే పరిస్థితి ఉంది. చెరువుల్లో నీరు ఉండటంతో ఉపాధి హామీ పనులు అనుకున్న స్థాయిలో ప్రారంభం కాలేదు. అక్కడక్కడా పనులు నిర్వహిస్తున్నా కూలీలకు వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నారు. వాటిని తీసుకోవడానికి వెళితే బ్యాంకుల్లో చిల్లర లేదని వెనక్కు పంపుతున్నారని కూలీలు వాపోతున్నారు. రెండు నెలల కాలంలో ఉపాధి హామీ వేతనాల రూపంలో రూ.6 కోట్లు పోస్టాఫీసుల్లో డబ్బులు జమయ్యాయి. నగదు కొరత కారణంగా పదోవంతు మంది కూడా ఈ సొమ్ముతతీసుకోలేకపోయారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.2 వేల నోట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఉన్న కొద్దిపాటి సొమ్ము కూడా తీసుకోలేని దుస్థితిలో కూలీలు ఉన్నారు. జిల్లాలో 48 వేల మంది ఉపాధి హామీ కూలీలకు బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో వీరికి చెల్లింపులు నిలిచిపోయాయి.
 
 
 
 
నెలల తరబడి తిరిగినా సొమ్ములు రాలేదు
జనవరి 2016 నెలలో చేసిన మూడు వారాల పనికి సంబంధించి కూలి డబ్బులు నేటికీ ఇవ్వలేదు. ఎంపీడీవో ఆఫీసుకు వెళితే.. పోస్టాఫీసుకు వస్తాయని.. పోస్టాఫీసుకు వెళితే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమని చెబుతున్నారు. ఏడాదిగా తిరుగుతున్నా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
  పిల్లా లక్ష్మి, ఉపాధి కూలీ, తాటియాకుల గూడెం
 
 
 
 
చిల్లర లేదని ఇవ్వలేదు
గత ఏడాది చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.3,500 కూలి డబ్బులు దర్భగూడెం బ్యాంకుకు వచ్చాయి. మూడుసార్లు తిరిగితే రూ.2 వేలు ఇచ్చారు. చిల్లర నోట్లు లేవని మిగిలిన సొమ్ము ఇవ్వడం లేదు.
 సరియం రాములమ్మ, ఉపాధి కూలీ, తాటిరాముడుగూడెం
 
పూట గడవటం లేదు
పొటొరైటప్‌ ఇఎల్‌ఆర్‌1004  మడకం కృష్ణమూర్తి మామిడిగొంది,పోలవరం మండలం
పోలవరంలో ఉపాధి హామీ, వ్యవసాయ పనులులేక గోపాలపురం వెళ్లి కూలి పని చేస్తున్నా. రైతులు కూలి డబ్బులు ఇవ్వలేక కిరాణా షాపులో సరుకులు ఇప్పిస్తున్నారు. బ్యాంకోళ్లు డబ్బులిచ్చాక కూలి చెల్లిస్తామంటున్నారు. ఇబ్బంది పడుతూనే పనులు చేస్తున్నాం.
 మడకం కృష్ణమూర్తి, కూలీ, మామిడిగొంది, పోలవరం మండలం
 
 ఫ్యాక్టరీల వద్ద ఏటీఎంలు పెట్టాలి
పెద్ద నోట్ల రద్దు కారణంగా కార్మికుల ఉపాధిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో యజామాన్యాలు ఆలస్యం చేస్తున్నాయి. వేతనాలను బ్యాంకుల్లో వేస్తామంటున్నారు. దీనివల్ల రేషన్‌ కార్డులు తొలగించే ప్రమాదం ఉంది. 500 మంది కార్మికులు ఉన్నచోట్ల ఏటీఎంలను ఏర్పాటు చేయాలి. 
 డీఎన్‌డీవీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement