ప్రగతే లేదు
– గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి
– దృష్టి సారించాలని ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, ప్రధాన మంత్రి ఆవాజ్ యోజనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రగతి లేదంటూ కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో దష్టి సారించాలని ఆదేశించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రతిపాదనలు పంపాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో శుక్రవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది పట్టణ ప్రాంతాల్లో 10,600 గృహ నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన కలెక్టర్ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 11లోగా ప్రతిపాదనలు పంపాలని హౌసింగ్ పీడీ, ఈఈలను ఆదేశించారు. మంజూరైన గృహాల నిర్మాణం కోసం ఈ నెల 15 నుంచి లబ్ధిదారుల స్థలాల్లో మార్కింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన యోజన కింద 7107 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని, వీరిలో అర్హులను గుర్తించి ప్రతిపాదనలు ఇస్తామని హౌసింగ్ పీడీ రాజశేఖర్ కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద దెబ్బతిన్న గృహాలల మరమ్మతులకు రూ.10వేల ప్రకారం మంజూరు చేస్తామని, ఇందుకు సంబంధించిన గృహాలను వారంలోగా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. హౌస్ పార్ ఆల్ గృహ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ అధికారులతో ఈ నెల 14న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై ఈ నెల 23న సమీక్షిస్తామని ప్రకటించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజశేఖర్, ఈఈలు సుధాకర్‌రెడ్డి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు