వెల్దుర్తి శెట్టిపల్లి గ్రామం వద్ద వేటగాళ్ల దాడిలో చనిపోయిన జింకలు
- గుంపులు...గుంపులుగా వధిస్తున్న వేటగాళ్లు
- అధికారుల అండదండలతోనే వేటాడుతున్నారనే ఆరోపణ...?
- ఐదు సంవత్సరాలుగా పదుల సంఖ్యలో హతం
- వేటగాళ్లపై కానరాని కఠిన చర్యలు
మెదక్: వణ్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్న వన్యప్రాణుల రక్షణ చట్టం కాగితాలకే పరిమితమవుతోంది. వేటగాళ్లు దర్జాగా తుపాకులు, ఉచ్చులు, విషపుగుళికలు పెట్టి రకరకాల జంతువులతో పాటు జాతీయ పక్షులైన నెమళ్లను సైతం వేటాడి చంపుతున్నారు. అయినా నిందితులు రాజకీయ ప్రోద్బలంతో శిక్షల నుండి తప్పించుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.
వేటగాళ్లు స్వయంగా అటవీశాఖకు చెందిన కొందరు అధికారుల అండదండలతోనే వణ్యప్రాణులను చంపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో పదుల సంఖ్యలో వేటగాళ్ల బారిన పడి రకరకాల జంతువులతోపాటు జాతీయ పక్షులు మృత్యువాత పడుతున్నాయి. అయినా ఇప్పటివరకు ఏ ఒక్క వేటగాడికీ కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. దీంతో వారు ఆడిందే ఆటపాడిందే పాటగా మారుతోంది.
వణ్యప్రాణులతోపాటు అడవులను ర„క్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అటవీ శాఖ అధికారులకు అధునాతన వాహనాలను సమకూర్చింది. అయినా అటు అడవులు, ఇటు వణ్యప్రాణులు వధకు గురికాక తప్పటం లేదు. ఇందులో కొందరు వినోదం కోసం తుపాకులతో వచ్చి జంతువులను హతమార్చిన వారు కొందరైతే..జంతువుల మాంసం విక్రయించి సొమ్ము చేసుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు మరికొందరు.
ముఖ్యంగా జాతీయ రహదారులపై దాబాలు, హోటళ్లలో వణ్యప్రాణులైన పిట్టలు, నెమళ్లు, జింకలు, దుప్పులు, అడవిపందుల మాంసం వంటకాలను బహిరంగంగానే వడ్డిస్తున్నారు. అయినా వాటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అస్సలు అడవి జంతువల మాంసం ఎక్కడి నుండి వస్తోందని ఇప్పటివరకు అధికారయంత్రాంగం హాటళ్లు, దాబాల యజమానులను ప్రశ్నించిన పాపాన పోలేదు. దీంతో వారు వేటగాళ్లకు డబ్బులు ఎరచూపడంతో వారు అడవులపై పడి జంతువులను వేటాడి యథేచ్ఛగా చంపేస్తున్నారు.
సుమారు ఐదు సంవత్సరాల్లో జిల్లాలో పదుల సంఖ్యలో జంతువులను వేటాడి పట్టుపడిన వారు ఎందరో ఉన్నారు. గతంలో జిల్లాలో జహీరాబాద్, రామాయంపేట, మెదక్ ప్రాంతాలతోపాటు అనేక చోట్ల వేటగాళ్లు వన్యప్రాణులను చంపిన ఘటనలున్నాయి. 2014లో మెదక్ మండలం బ్యాతోల్ అడవుల్లోకి హైదరాబాద్ నుండి జీపులో వచ్చిన కొందరు ప్రముఖ వ్యక్తులు తుపాకులతో జింకలను వేటాడగా అందులోఒకటి చనిపోయింది.
అప్పట్లో ఈ కేసును రామాయంపేట ఫారెస్ట్ అధికారులు నమోదుచేసి నిందితులను అరెస్ట్‌చేశారు. అలాగే 2011లో ఇదే రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి జింక మాంసాన్ని అమ్ముతుండగా రామాయంపేట ఫారెస్ట్ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. మెదక్ మండలం ఔరంగాబాద్ గ్రామశివారులో మూడు, నాలుగేళ్ల క్రితం వేటగాళ్లు విషంపెట్టి 10 నెమళ్లను చంపేశారు. అప్పట్లో ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను నేటికి ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేయక పోవడం గమనార్హం. మూడేళ్ల క్రితం జహీరాబాద్ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు అడవిలోకి వెళ్లగా అప్పట్లో ఫారెస్ట్ అధికారులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అలాగే నాలుగేళ్ల క్రితం తూప్ర సమీపంలో ఓ ముఠా అటవీ అధికారులకు చిక్కింది. వారి నుండి ఉడుము, తాబేళ్లతోపాటు వేట పరికరాళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం మునిపల్లి మండలం కంకోళ్లవద్ద ప్రమాదానికి గురైన ఓ వాహనంలో తుపాకులు, తూటాలు లభించడంతో సదరు వ్యక్తులు అడవుల్లో వేట కోసం వచ్చినట్లు అధికారులు భావించారు. అలాగే తాజాగా ఈనెల 22న, నాలుగు జింకలను దారుణంగా చంపి ఓ ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకోగా ఆటోను వదిలి పరారయ్యారు.
ఇందులో సంబంధిత అటవీ అధికారుల అండదండలతోనే ఈ ఘోరం జరిగి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల హస్తంలేనిదే ఏకకాలంలో 4జింకలను ఎలా చంపుతారని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అటవీ జంతువులకు రక్షణ లేకుండా పోయిందనేది అక్షరసత్యమనే చెప్పాలి.