అందని సరుకులు..ఆకలి కేకలు! | no rathion | Sakshi
Sakshi News home page

అందని సరుకులు..ఆకలి కేకలు!

Published Sun, May 7 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

సరుకుల కూపన్లు తీసుకుని చౌకదుకాణం దగ్గరున్న విద్యార్థులు

సరుకుల కూపన్లు తీసుకుని చౌకదుకాణం దగ్గరున్న విద్యార్థులు

- అమలుకాని మధ్యాహ్న భోజన పథకం 
- భోజనం బదులు సరుకులిస్తామన్న సర్కారు
- కూపనులిచ్చి చేతులు దులుకుపున్న వైనం
- బియ్యం, గుడ్ల కోసం విద్యార్థుల ప్రదక్షిణ
- సరుకులు రాలేదంటున్న చౌక దుకాణ డీలర్లు 
- బియ్యం కార్డులో పేరున్న వారికే సరుకులని కొత్తమెలిక 
===============
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 2867
విద్యార్థుల సంఖ్య: 6,41,547 
నెలకు వీరికి అవసరమయ్యే బియ్యం: 4,101 క్వింటాళ్లు
ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బియ్యం విడుదలకు సంబంధించిన సమాచారం సివిల్‌ సప్లై అధికారులకు, డీలర్లుకు అందలేదు. 
=============
వేసవిలో విద్యార్థులకు అందాల్సిన సరుకులివి : 
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు :–
నెలకు ఒక్క విద్యార్థికి 4 కేజీల బియ్యం, 15 గుడ్లు, నూనె 200 గ్రాములు, కందిపప్పు 800 గ్రాములు.
ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు : –
బియ్యం 6 కేజీలు, గుడ్లు 15, నూనె 300 గ్రాములు, కందిపప్పు 1200 గ్రాములు.
=============
 
కోడుమూరు: సెలవుల్లో సైతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. గత ఏడాది వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం పథకం సరిగా అమలు కాలేదని, ఈ ఏడాది  నేరుగా విద్యార్థులకే వంట సరుకులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 19వ తేదీన (ప్రొసీడింగ్‌ ఆర్సీ నెం. 01, మెమో నం.523349) జీవో విడుదలైంది. ఇందు కోసం విద్యార్థుల జాబితాను ప్రభుత్వానికి ప్రధానోపాధ్యాయులు పంపారు. ఈ నెల 23 నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ దగ్గరిలో ఉన్న చౌక దుకాణాల్లో మే 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా బియ్యం, గుడ్లు, కందిపప్పు, నూనె తెచ్చుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు కూపన్లు అందజేశారు. విద్యార్థులు ఆ కూపన్లు పట్టుకుని చౌక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే సరుకులు రాలేదని డీలర్లు చేతులెత్తేస్తున్నారు. విద్యార్థులు రేషన్‌ సరుకుల కోసం ఎండను లెక్కచేయకుండా కూపన్లను పట్టుకుని చౌక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. 
 
సరుకులకు కొత్తమెలిక : 
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో సరుకులిస్తామని ప్రభుత్వం ఒకవైపు హామీ ప్రకటించి మరోవైపు కొత్తమెలిక పెట్టింది. బియ్యం కార్డులో ఉన్న వాళ్లకు మాత్రమే సరుకులిస్తామని ఏప్రిల్‌ 22వ తేదీ జీవో విడుదలైంది. విద్యార్థుల రేషన్‌కార్డు నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలందాయి. వేసవి సెలవులు రావడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల బియ్యం కార్డు నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. దీనికితోడు చాలామంది విద్యార్థుల పేర్లు బియ్యం కార్డులో లేవని ప్రధానోపాధ్యాయులు తెలియజేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదుచేసిన ఆధార్‌నంబర్ల ఆధారంగా విద్యార్థులకు సరుకులందజేస్తే సరిపోతుందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. 
 
కూపన్లు ఇచ్చారు : మంజుల
వేసవి సెలవుల్లో మధ్యాహ్నం భోజనం బదులు బియ్యం, బ్యాళ్లు, నూనె ఇస్తారని మాబడి సారోళ్లు కూపన్లు ఇచ్చారు. రేషన్‌ షాపుకు వెళితే సరుకులివ్వబోమని డీలర్లు చెబుతున్నారు.
 
దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం : భారతి  
మధ్యాహ్నం భోజనం సరుకులు రేషన్‌ దుకాణాల్లో ఇస్తారని మాబడి సారోళ్లు కూపన్లు ఇచ్చారు. సరుకుల కోసం కూపన్లు తీసుకుని ఎండలకు రేషన్‌ షాపుల చుట్టూ తిరుగుతున్నాం. డీలర్లు సరిగ్గా సమాధానం చెప్పడంలేదు. టోల్‌ఫ్రీ నంబర్‌(9393121651, 9985746401)లకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదు. 
 
30 నుంచి సరుకులిస్తాం : అనంతయ్య, ఎంఈఓ, కోడుమూరు 
ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల నుంచి విద్యార్థులకు సరుకులందివ్వాలని డీఈఓ కార్యాలయం సమాచారమందింది. ఎప్పుడిస్తారనే విషయం స్పష్టంగా సమాచారం లేదు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement