కారణాలు చెప్పొద్దు..నీళ్లు ఇవ్వాల్సిందే
కారణాలు చెప్పొద్దు..నీళ్లు ఇవ్వాల్సిందే
Published Wed, Sep 14 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
– ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు సిటీ: ‘ కాల్వలకు నీరు ఇవ్వలేకపోవడానికి కారణాలు చెప్పొద్దు..అదంతా మీ నిర్లక్ష్యమే’ అంటూ ఇంజినీర్లపై జిల్లా కలెక్టర్ విజయమోహన్ మండిపడ్డారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సాగు నీటి ప్రాజెక్టులు, వెలుగోడు, ఆవుకు, గోరుకల్లు రిజర్వాయర్ల నీటి నిల్వలపై కలెక్టర్ జల వనరుల శాఖ ఇంజినీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు–చెట్టు కింద కాల్వల మరమ్మతులు చేయాలని చెబితే చేయకుండా...ఈ రోజు కాల్వలకు నీరు ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పడం తగదన్నారు. కాల్వలకు లేకేజీలు ఉంటాయి..మరమ్మతులు చేయించాలనే ఆలోచన కూడా లేకపోవడం దారుణమన్నారు. ఎస్.ఆర్.బి.సీ ద్వారా ఆవుకు రిజర్వాయర్ నింపేందుకు ఉన్న ఇబ్బందులపై నివేదికలు ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామని సూచించారు. సీఎం పర్యటించిన సమయంలో గోరుకల్లులో 7 టీయంసీలు, ఆవుకులో 4 టీయంసీలు నింపుతామని చెప్పారని, ఈ రోజు సాధ్యం కాదని చెబుతున్నారని, ఇందుకు కారణాలపై నివేదిక ప్రభుత్వానికి అందజేయాలన్నారు. ఎస్సార్బీసీలో 900 క్యుసెక్కుల నీరు కూడా వెళ్లడం లేదని ఇంజినీర్లు చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు.
పక్షం రోజులకోసారి సమీక్ష
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు, నీటి నిల్వలు, సాగైన ఆయకట్టు తదితర అంశాలపై ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. హంద్రీనీవా కాల్వ కింద పంట కాల్వలకు భూసేకరణ చేసి ఇంజినీర్లకు అప్పగించినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. జిల్లాలో బనగానపల్లె, ఆవుకు ప్రాంతాల్లో చెరువులను ఎస్‌ఆర్‌బీసీ ద్వారా ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటు చేసి నింపుతామని.. ఇందుకు త్వరతోనే అనుమతలు ఇస్తామన్నారు. గుండ్లకమ్మ వాగుకు నీరు ఇచ్చేందుకు అవసరమైన పనులు చేసేందుకు రూ. 54 లక్షలు మంజూరు చేస్తే ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదన్నారు. సిద్ధాపురం లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. గోరుకల్లు లీకేజిపై నివేదిక ఇవ్వాలని, వెలుగోడులో సాధ్యం అయినంత వరకు నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంజినీర్లకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు, ఈఈలు, డీఈఈలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement