cenal
-
ఆ యువకుల సాహసం బాలుడి ప్రాణం కాపాడింది..
ఉయ్యాలవాడ : వాగులో కొట్టుకుపోయిన ఓ బాలుడు ఇద్దరు యువకుల సాహసంతో సురక్షితంగా బయటపడిన సంఘటన ఆదివారం ఇంజేడులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సంజామల మండలం ఆర్.లింగందిన్నె గ్రామానికి చెందిన లింగన్న కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డలో జరిగే పుట్టు వెంటుకల శుభకార్యానికి బయలుదేరారు. మండలంలోని ఇంజేడు వద్ద కుందరవాగు వంతెన దాటుతున్న సమయంలో లింగన్న కుమారుడు లింగమయ్య(6వ తరగతి విద్యార్థి) కాలి పాదరక్షలు జారిపోవడంతో వాటిని పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కుందరవాగులో పడ్డాడు. తండ్రి, కుమారుడు, బంధువులు గట్టిగా కేకలు వేయడంతో పక్కన్నే పొలాల్లో ఉన్న ఇంజేడు గ్రామానికి చెందిన సర్ధార్ వుశేన్, నాగేష్‌లు వాగులోకి దూకి ముళ్ల పొదల మధ్య వున్న బాలుడిని ఒడ్డుకు తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
భారీ వర్షానికి 80 గొర్రెలు మృతి
హాలహర్వి: భారీ వర్షానికి 80 గొర్రెలు మృతి చెందిన ఘటన కామినహాల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కిష్టిపాడుకు చెందిన గొర్రెల కాపరులు 210 గొర్రెలను కామినహాల్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొలంలో ఆదివారం రాత్రి నిలిపారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి సమీపంలో కాల్వకు నీళ్లు రావడం, అదే సమయంలో గొర్రెలు నిలిపిన ప్రాంతానికి పక్కనే పిడుగు పడటంతో గొర్రెలు పరుగులు తీసి కాల్వ వైపు వెళ్లి నీటిలో పడ్డాయి. దీంతో 80 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న హాలహర్వి తహసీల్దార్ రామసుబ్బయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. గొర్రెలు మృతిచెందడానికి కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. -
వడదెబ్బతో ఉపాధి కూలీమృతి
దొర్నిపాడు: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన గురువారం కొండాపురంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన షేక్‌మహబూబ్‌బాషా (47) బుధవారం కొండాపురం–భాగ్యనగరం గ్రామాల మధ్యలో జరుగుతున్న పంట కాల్వల్లో పూడికతీత పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫీల్డ్ అసిస్టెంట్ బషీర్ కూలీల సాయంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేటు వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. పంచాయతీ కార్యదర్శి సులోచన, ఏపీఓ పిడుగు రాముడు గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని బంధువులు, కుటుంబసభ్యులు కోరారు. -
కాలువ పనులు వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కాలువల తవ్వకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. ఇంతవరకు పనులు జరుగకపోవడదానికి కారణాలు తెలుసుకొని పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బందితో 9 బృందాలు ఏర్పాటు చేశారు. బుధవారం కలెక్టర్ తన సమావేశ మందిరంలో నీటిపారుదల అధికారులు, భూసేకరణ అధికారులతో కాలువ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో మిషన్లు ఏర్పాటు చేసి కాలువ తవ్వకం చేపట్టాలని తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ రాఘవరెడ్డిని ఆదేశించారు. సిద్దేపల్లి, కరివెన, కృష్ణాపురం, తదితర గ్రామాలకు ఒక జూనియర్ ఇంజనీర్‌ను నియమించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామం వారిగా ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, ఇంకా ఎంత తవ్వాలనే దానిని పరిశీలించాలన్నారు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినా, ఽనిర్లక్ష్యం వహించినా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. రైతులందరికీ పరిహారం అందిందని, ఏ ఒక్కరూ పనులకు అడ్డు పడకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యం, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
హంద్రీనీవా కాలువలో యువతి మృతి
నెహ్రూనగర్ (పగిడ్యాల): మతిస్థిమితం లేని ఓ యువతి ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన వీరమ్మ కూతురు తిరుపతమ్మ(22) పుట్టకతోనే మతిస్థిమితంతో బాధపడుతోంది. కుమార్తెను ఈమె జాగ్రత్తగా చూసుకునేది. అయితే సోమవారం..సీఎం బహిరంగ సభ కోసం ఆమె ముచ్చుమర్రి వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సరికి కుమార్తె కనిపించలేదు. ఆచూకీ కోసం బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారించినా జాడ కనిపించలేదు. అనుమానం వచ్చిన బంధువులు నివాస ప్రాంతాలకు సమీపంలోని హంద్రీనీవా కాలువ వెంబడి గాలించి తిరుపతమ్మ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై ముచ్చుమర్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బంధువులు పేర్కొన్నారు. -
హంద్రీనీవాను పూడ్చకపోతే చాలు
- కాల్వ విస్తరణ విషయంపై చెరుకులపాడు నారాయణరెడ్డి - ఆలోచించాలని జిల్లా ప్రజాప్రతినిధులకు హితవు మద్దికెర : హంద్రీనీవా కాలువను ఇరువైపులా విస్తరిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సాకుతో పూడ్చే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి ఆరోపించారు. ఆదివారం మద్దికెరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన హంద్రీనీవా కాలువను వైఎస్సార్ 90 శాతం పూర్తిచేశారన్నారు. మిగతా పనులు పూర్తి చేసి అనంతర ప్రభుత్వం నీటిని విడుదల చేసిందన్నారు. రైతులు, ప్రజలు వైఎస్‌ను తలుచుకుంటుంటే సహించలేక టీడీపీ ప్రభుత్వం కాలువ విస్తరణను తెరపైకి తెచ్చిందన్నారు. కాల్వను విస్తరించి 40 టీఎంసీల నీటిని వదులుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు కాల్వను గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాల్వను విస్తరించడానికి బదులు డోన్, ప్యాపిలి, గుత్తి మీదుగా కుప్పం వరకు కొత్త కాల్వను ఏర్పాటు చేసి నీటిని తీసుకుపోవచ్చన్నారు. వెడల్పు చేసేందుకు కనీసం పదేళ్లు పడుతుందని, అంతవరకు కాలువకు నీరు వదలరన్నారు. అదే జరిగితే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాల్వ విస్తరణకు భూసేకరణ చేపట్టాలని, అలాంటప్పుడు కొత్త కాలువ ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాల వారికి కూడా నీటిని అందించే అవకాశం ఉంటుందని, దీనిపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు చర్చించాలన్నారు. విషయాన్ని సీఎంకు వివరించాలని డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కోరారు. విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్ మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, నాయకులు సర్కార్ వెంకటరాముడు, బాలచంద్ర, నాగేష్, చంద్రశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మంజునాథ్‌రెడ్డి, రామాంజులు, చౌరెడ్డి వన్నాల గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
వడ్డేమాన్ గ్రామంలోకి హంద్రీనీవా నీరు
గుర్తు తెలియని వ్యక్తులు కాలువ తూం గేటు ఎత్తివేత –ముంపునకు గురైన పంట పొలాలు - స్పందించి గేటు మూసేసిన హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు నందికొట్కూరు: మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామ పొలిమేరలో ఉన్న హంధ్రీనీవా కాలువ తూం గేటును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఎత్తేశారు. దీంతో ఉద్ధృతంగా ప్రవహిస్తూ కాలువ నీరు వడ్డేమాను గ్రామంలోకి చేరాయి. దాదాపు 30 ఎకరాల్లో పంటలు నీట మునగగా, పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఊహించని విధంగా గ్రామంలోకి నీరు రావడంతో ప్రజలు, రైతులు కొద్దిసేపు ఆందోళన గురయ్యారు. సమాచారం తెలుకున్న హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు హుటాహుట్టిన కాలువ వద్దకు చేరుకుని తూంను వెంటనే మూసివేశారు. దీంతో నీటి ఉద్ధృతి తగ్గిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే స్పందించకపోయి ఉంటే వందల ఎకరాల పంట దెబ్బతినే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. గేటు ఎత్తేసిందేవరో గుర్తించడంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని వారు అధికారులకు కోరారు. -
హంద్రీనదిలో విద్యార్థి మృతి
కృష్ణగిరి: హంద్రీనదిలో నీరు తాగడానికి వెళ్లి గుంతలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదిగ కర్రెన్న, మరియమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు పవన్‌కుమార్ నందికొట్కూరులో ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్నవాడు చిన్న చరణ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో తరగతి చదవుతున్నాడు. తల్లిదండ్రులు ఇంటి వద్ద చరణ్‌కు భోజనం పెట్టి కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లవాడు కనిపించలేదు. గ్రామస్తులంతా సమీపంలోని కాల్వలు, హంద్రీలో ఉన్న ఇసుకగుంతలో గాలించగా శవమై తేలాడు. ఆదివారం సెలవు కావడంతో తోటి పిల్లలతో సమీపంలోని ఎల్లమ్మ గుడి సమీంలో అడుకుంటూ నీరు తాగేందుకు హంద్రీలోకి వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడి చరణ్(9)మృతి చెందాడు. కుమారుడు ఆకాల మరణంతో తల్లిదండ్రులు రోదన అందరిని కలిచివేసింది. గుంతలే ప్రాణం తీశాయి.. హంద్రీలో ఇసుకను అమ్మకోవడంతో కొందరు పెద్ద గుంతలు తీశారు. ఇవి ప్రమాదకరంగా మారాయని 25రోజుల క్రితమే ‘సాక్షి’ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.నాలురోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి హంద్రీ పొంగి గుంతలో నీరు చేరింది. ఈ గుంతే చిన్నారి చరణ్ మృతికి కారణమైంది. -
ఎస్సార్బీసీ కాల్వలో వ్యక్తి మృతదేహం
గడివేముల: కొర్రపోలూరు సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వలో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుంది. వీఆర్వో ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. -
కారణాలు చెప్పొద్దు..నీళ్లు ఇవ్వాల్సిందే
– ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం కర్నూలు సిటీ: ‘ కాల్వలకు నీరు ఇవ్వలేకపోవడానికి కారణాలు చెప్పొద్దు..అదంతా మీ నిర్లక్ష్యమే’ అంటూ ఇంజినీర్లపై జిల్లా కలెక్టర్ విజయమోహన్ మండిపడ్డారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సాగు నీటి ప్రాజెక్టులు, వెలుగోడు, ఆవుకు, గోరుకల్లు రిజర్వాయర్ల నీటి నిల్వలపై కలెక్టర్ జల వనరుల శాఖ ఇంజినీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు–చెట్టు కింద కాల్వల మరమ్మతులు చేయాలని చెబితే చేయకుండా...ఈ రోజు కాల్వలకు నీరు ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పడం తగదన్నారు. కాల్వలకు లేకేజీలు ఉంటాయి..మరమ్మతులు చేయించాలనే ఆలోచన కూడా లేకపోవడం దారుణమన్నారు. ఎస్.ఆర్.బి.సీ ద్వారా ఆవుకు రిజర్వాయర్ నింపేందుకు ఉన్న ఇబ్బందులపై నివేదికలు ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామని సూచించారు. సీఎం పర్యటించిన సమయంలో గోరుకల్లులో 7 టీయంసీలు, ఆవుకులో 4 టీయంసీలు నింపుతామని చెప్పారని, ఈ రోజు సాధ్యం కాదని చెబుతున్నారని, ఇందుకు కారణాలపై నివేదిక ప్రభుత్వానికి అందజేయాలన్నారు. ఎస్సార్బీసీలో 900 క్యుసెక్కుల నీరు కూడా వెళ్లడం లేదని ఇంజినీర్లు చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. పక్షం రోజులకోసారి సమీక్ష జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు, నీటి నిల్వలు, సాగైన ఆయకట్టు తదితర అంశాలపై ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. హంద్రీనీవా కాల్వ కింద పంట కాల్వలకు భూసేకరణ చేసి ఇంజినీర్లకు అప్పగించినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. జిల్లాలో బనగానపల్లె, ఆవుకు ప్రాంతాల్లో చెరువులను ఎస్ఆర్బీసీ ద్వారా ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటు చేసి నింపుతామని.. ఇందుకు త్వరతోనే అనుమతలు ఇస్తామన్నారు. గుండ్లకమ్మ వాగుకు నీరు ఇచ్చేందుకు అవసరమైన పనులు చేసేందుకు రూ. 54 లక్షలు మంజూరు చేస్తే ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదన్నారు. సిద్ధాపురం లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. గోరుకల్లు లీకేజిపై నివేదిక ఇవ్వాలని, వెలుగోడులో సాధ్యం అయినంత వరకు నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంజినీర్లకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ఈ చంద్రశేఖర్ రావు, ఈఈలు, డీఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ కాల్వలో యువకుడు గల్లంతు
– ప్రకాశం జిల్లా చీమకుర్తి వద్ద ఘటన – చెన్నంపల్లెలో విషాదం కొలిమిగుండ్ల: మండల పరిధిలోని ఎస్. చెన్నంపల్లెకు చెందిన యువకుడు హరి(16) శనివారం ప్రకాశం జిల్లా చీమకుర్తి వద్ద ఉన్న నాగార్జున సాగర్ కాల్వలో గల్లంతయ్యాడు. అక్కడి పోలీసులు యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెన్నంపల్లెకు చెందిన నందిగం నడిపెన్న, శారద దంపతులకు అరుణ, హరి సంతానం. రెండేళ్ల క్రితం కూతురును అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రామాంజికిచ్చి పెళ్లి జరిపించారు. అక్కడే వారు సోపాసెట్ల అమ్మకాలు, మరమతుల షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రామాంజి జీపులో భార్య అరుణను పుట్టింటి వద్ద వదిలిపెట్టి...బావమర్ది హరితో కలిసి సోపాసెట్ల కొనుగోలుకు హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడు. శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలోని జలాశయం నుంచి ఒంగోలుకు నీటిని సరఫరా చేసే నాగార్జున సాగర్ కుడికాల్వలో హరి కొట్టుకుపోతున్నట్లు అత్తమామకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు బయలుదేరి వెళ్లారు. అక్కడి పోలీసులు కాల్వ వెంట గాలింపు చేపట్టారు. అయితే బావమర్ధిని హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు చెప్పిన రామాంజి.. ప్రకాశం జిల్లాలోని కాల్వలో కొట్టుకుపోతున్నట్లు ఫోన్ చేయడంపై బంధువులు, కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.