ఆ యువకుల సాహసం బాలుడి ప్రాణం కాపాడింది..
ఉయ్యాలవాడ : వాగులో కొట్టుకుపోయిన ఓ బాలుడు ఇద్దరు యువకుల సాహసంతో సురక్షితంగా బయటపడిన సంఘటన ఆదివారం ఇంజేడులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సంజామల మండలం ఆర్.లింగందిన్నె గ్రామానికి చెందిన లింగన్న కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డలో జరిగే పుట్టు వెంటుకల శుభకార్యానికి బయలుదేరారు. మండలంలోని ఇంజేడు వద్ద కుందరవాగు వంతెన దాటుతున్న సమయంలో లింగన్న కుమారుడు లింగమయ్య(6వ తరగతి విద్యార్థి) కాలి పాదరక్షలు జారిపోవడంతో వాటిని పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కుందరవాగులో పడ్డాడు. తండ్రి, కుమారుడు, బంధువులు గట్టిగా కేకలు వేయడంతో పక్కన్నే పొలాల్లో ఉన్న ఇంజేడు గ్రామానికి చెందిన సర్ధార్ వుశేన్, నాగేష్‌లు వాగులోకి దూకి ముళ్ల పొదల మధ్య వున్న బాలుడిని ఒడ్డుకు తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.