హరి(ఫైల్)
సాగర్ కాల్వలో యువకుడు గల్లంతు
Published Sun, Sep 4 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
– ప్రకాశం జిల్లా చీమకుర్తి వద్ద ఘటన
– చెన్నంపల్లెలో విషాదం
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని ఎస్. చెన్నంపల్లెకు చెందిన యువకుడు హరి(16) శనివారం ప్రకాశం జిల్లా చీమకుర్తి వద్ద ఉన్న నాగార్జున సాగర్ కాల్వలో గల్లంతయ్యాడు. అక్కడి పోలీసులు యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెన్నంపల్లెకు చెందిన నందిగం నడిపెన్న, శారద దంపతులకు అరుణ, హరి సంతానం. రెండేళ్ల క్రితం కూతురును అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రామాంజికిచ్చి పెళ్లి జరిపించారు. అక్కడే వారు సోపాసెట్ల అమ్మకాలు, మరమతుల షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రామాంజి జీపులో భార్య అరుణను పుట్టింటి వద్ద వదిలిపెట్టి...బావమర్ది హరితో కలిసి సోపాసెట్ల కొనుగోలుకు హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడు. శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలోని జలాశయం నుంచి ఒంగోలుకు నీటిని సరఫరా చేసే నాగార్జున సాగర్ కుడికాల్వలో హరి కొట్టుకుపోతున్నట్లు అత్తమామకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు బయలుదేరి వెళ్లారు. అక్కడి పోలీసులు కాల్వ వెంట గాలింపు చేపట్టారు. అయితే బావమర్ధిని హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు చెప్పిన రామాంజి.. ప్రకాశం జిల్లాలోని కాల్వలో కొట్టుకుపోతున్నట్లు ఫోన్ చేయడంపై బంధువులు, కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement