- పోస్టులు ఖాళీ
- ఎంపీడీవోకు అదనపు బాధ్యతలు
ఒకే ఒక్కరూ...
Published Tue, Aug 2 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
గంగాధర: సిబ్బంది లేక మండల పరిషత్ కార్యాలయం వెలవెలబోతోంది. జూనియర్ అసిస్టెంట్ ఒక్కరే ఇక్కడ అన్ని విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే ఒక ఉద్యోగి ఉండడంతో కార్యాలయంలోని పలు పనులు కుంటుబడుతున్నాయి. దీంతో పలు పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాక ప్రజాప్రతినిధులు తంటాలు పడుతున్నారు. సమయానికి పనులు జరగకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు అవస్థలు పడుతున్నారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరు బదిలీపై, మరొకరు సెలవుపై వెళ్లడంతో ఉద్యోగుల కొరత ఏర్పడింది. మరోపోస్టు ఖాళీగా ఉండడంతో కార్యాలయం సిబ్బంది లేక బోసిపోతోంది. కార్యాలయం సిబ్బందికంటే అటెండర్లే ఎక్కువగా ఉన్నారు. మండలపరిషత్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో సూపరింటెండెంట్ ఎప్రిల్‌లో బదిలీపై వెళ్లాడు. జూనియర్ అసిస్టెంట్ మార్చి నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్నాడు. టైపిస్ట్ పోస్టు సంవత్సర కాలంగా ఖాళీగా ఉంది. ఈవోపీఆర్డీ, జూనియర్ అసిస్టెంట్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, ఆర్‌డబ్లూ్యయస్ ఎఈలు ఉన్నా, ఈవోపీఆర్డీ గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులే నిర్వరిస్తుంటారు. ఇంజినీరింగ్ అధికారులు తమ,తమ పనులకు సంబంధించి గ్రామాల్లో పర్యవేక్షిస్తుంటారు. ఎంపీడీవోకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎవోగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. అందరు పోగా ఇక్కడ మిగిలింది ఒక్క జూనియర్ అసిస్టెంట్ మాత్రమే. తానే అన్ని పనులు చేయాల్సి వస్తోంది.
పట్టించుకోని జిల్లా పరిషత్
మండల పరిషత్ కార్యాలయంలో కొన్ని నెలలుగా సిబ్బంది లేక వెలవెల బోతున్నా జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు పట్టించుకోవడం లేదు. సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేసే అవకాశం ఉన్నా మండల పరిషత్ సిబ్బంది, పాలకవర్గం చేసిన తప్పిదాలతో అధికారులు సిబ్బందిని ఇక్కడి పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు. కోటి రూపాయల వ్యయంతో నిర్మించే మండల పరిషత్ కార్యాలయ భవనం శంకుస్థాపనకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను ఆహ్వానించకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఇక్కడి సిబ్బందిపై గుర్రుగా ఉన్నారు. పాలకవర్గం సభ్యులు కూడా సిబ్బందిని ఈ కార్యాలయానికి బదిలీ చేయించేందుకు ఆసక్తి చూపడం లేదు.
Advertisement
Advertisement