ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం
సబ్సిడీ రుణాలు గోవిందా
Published Fri, Aug 26 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
అన్ని కార్పొరేషన్లకు బ్యాక్‌టు సబ్సిడీ విధానం
అధికారులతో వర్కుషాపులు నిర్వహించనున్న సర్కారు
రుణాల మంజూరులో మరిన్ని కఠిన నిర్ణయాలు?
విజయనగరం కంటోన్మెంట్: ఏ ఆసరా లేనివారికి ఉపాధి కల్పించే విషయంలో సర్కారు కఠిన వైఖరి అవలంబిస్తోంది. సబ్సిడీలు వర్తింపజేయడానికి లెక్కలేనన్ని ఆంక్షలు విధిస్తోంది. రుణాల మంజూరులో లేనిపోని చిక్కులు కల్పిస్తోంది. యూనిట్ల పనితీరుకు పరీక్ష పెడుతోంది. సబ్సిడీని తాత్కాలికంగా రుణంగానే ఇస్తూ... దానిపైనా వడ్డీ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వెనుకబడి, అట్టడుగున ఉన్నవారికి ఆసరా కల్పించేందుకు ఏర్పాటు చేసిన సబ్సిడీ రుణాలపై సర్కారు కఠినవైఖరి అనుసరిస్తోంది. ప్రతీ సబ్సిడీ రుణానికీ ముందుగా సబ్సిడీ విడుదల చేస్తే దాంతో బ్యాంకు రుణం జత చేసుకుని ఉపాధి పొందేందుకు అవకాశం ఉండేది. కానీ బ్యాక్‌టు సబ్సిడీ విధానాన్ని ప్రవేశ పెట్టి మొత్తంగా రుణాలుగానే అందించి... రెండేళ్లపాటు సబ్సిడీని లాక్ చేసే కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. భవిష్యత్తులో ఇక సబ్సిడీ అనేదే తమకు అందకుండా చేయాలన్నదే సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ముందుగా సబ్సిడీ వస్తేనే రుణం ఇచ్చే బ్యాంకర్లకు సబ్సిడీ లాక్ చేసుకుని ఆ మొత్తాన్ని కూడా రుణంగా ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేసింది. మొదటగా పైలట్ ప్రాజెక్టు రూపంలో ఎస్సీ కార్పొరేషన్‌కు అన్వయించిన ఈ విధానం ఇప్పుడు బీసీ కార్పొరేషన్‌కూ వర్తింపజేసింది. త్వరలో మరిన్ని కార్పొరేషన్లలో అమలు చేయనుంది.
యూనిట్ కొనసాగితేనే...
రుణంగా పొందిన యూనిట్ నిర్వహణపై ఇక డేగకన్ను వేస్తారు. ఏమాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా ఆ లబ్ధిదారుకు సబ్సిడీని రద్దు చేస్తారు. కార్పొరేషన్ల అధికారులు ఆ యూనిట్లను మూడు నెలలకోసారి పర్యవేక్షించి యూనిట్ నడుస్తుందని ధ్రువీకరించి సర్టిఫికేట్ ఇవ్వాలి. అలా రెండేళ్ల పాటు ఇస్తే యూనిట్ నడుస్తుందని సబ్సిడీ ఉంటుంది. యూనిట్‌లో నష్టం వచ్చినా... మరే ఇతర ఇబ్బందులెదురయినా సబ్సిడీ రద్దవుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త విధానాన్ని అవలంబించి లబ్దిదారులకు సబ్సిడీని రానీయకుండా చేసే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెబుతున్నారు. దీనిని మరింత కఠినతరం చేసేందుకు ఈ అంశాలనే ప్రాధాన్యాంశాలుగా తీసుకుని గుంటూరు, విజయవాడల్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అందరు అధికారులు, కార్పొరేషన్ల ఈడీలు, బ్యాంకర్లతో వర్క్ షాపులను నిర్వహిస్తున్నట్టు తెల్సింది.
గత ఐదేళ్లలో సగమే రుణం
జిల్లాలో గత ఐదేళ్లుగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం రుణాలివ్వడమే లేదు. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వారికే రుణాలనిచ్చి నిరుపేదలకు మొండిచెయ్యి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తంగా అన్ని కార్పొరేషన్లకూ బ్యాక్‌టు సబ్సిడీ విధానాన్ని అవలంబించడం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement