ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న గిరిజన గురుకుల పాఠశాలలు,కళాశాలల టీచర్లు
దోమలగూడ: తెలంగాణ ఏర్పాటు తర్వాత తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందని తెలంగాణ లెక్చరర్ల ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి అన్నారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గిరిజన గురుకుల పుల్‌టైం, గెస్ట్ లెక్చరర్స్, టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన గురుకులాల ఉపాధ్యాయులకు కొత్త రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగుతోందన్నారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హరినాయక్, ప్రధానకార్యదర్శి మల్సూర్ యాదవ్ మాట్లాడుతూ గిరిజన గురుకులాలు, కళాశాలల్లో 15 ఏళ్లుగా పని చేస్తున్నా రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. మారుమూల ఏజన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు.
]మానవతా దృక్ఫథంతో తమ సమస్యలను పరిష్కరించి జీవో 27 ప్రకారం కనీస వేతనాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షల్లో నాయకులు లక్షీ్ష్మప్రసాదు, సుజాత, అనిత, టీక్యానాయక్, నారాయణ పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఆదివాసీమంచ్ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీరాంనాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధీరావత్ రవినాయక్, రాష్ట్ర కార్యదర్శి ధర్మానాయక్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సత్యనారాయణ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.