పూర్తయ్యేదెన్నడో?
– పీటీసీలో అసంపూర్తిగా పనులు
- స్వాతంత్ర్య వేడుకల సమయంలో హడావుడి
- అనంతరం పట్టించుకోని అధికారులు
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య వేడుకలు పీటీసీ మైదానంలో జరుగుతుండడంతో స్టేడియానికి మహర్దశ రానుందని అప్పట్లో అందరూ భావించారు. దాదాపు రూ. 2 కోట్లు నిధులు ఖర్చు పెడుతున్నారంటే స్టేడియం సర్వాంగ సుందరంగా తయారవుతుందని ఆశించారు. అప్పట్లో కలెక్టర్ కూడా రాష్ట్రంలో బెస్ట్ స్టేడియంగా తీర్చిదిద్దుదామని ప్రకటించారు. అయితే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు ముగిసినా స్టేడియానికి మహర్దశ రాలేదు.
రాష్ట్ర విభజన తర్వాత తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (ఆగష్టు 15) జిల్లాలోని పీటీసీ మైదానంలో జరిగాయి. నగరంలో రోడ్లు, నీలం సంజీవరెడ్డి స్టేడియం (పీటీసీ) అభివృద్ధి, ఇతర పనులకు సంబంధించి దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారు. కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే ఈ పనులు జరిగాయి. అయితే పనుల నాణ్యత దేవుడికెరుక.. కానీ పూర్తి చేయాల్సిన పనులను వదిలేశారు.అప్పట్లో పనుల నాణ్యతపై అనేక విమర్శలు వినిపించాయి. స్టేడియం విషయానికొస్తే అంతా నాసిరకంగానే చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేడియం చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీ, టైల్స్ ఏర్పాటు విషయంలో అలసత్వం వహించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో టైల్స్ ఏర్పాటు చేయలేదు.
భారీ వర్షాలు వచ్చినప్పుడు స్టేడియంలో నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులైన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. స్టేడియంలో క్రీడాపోటీలు జరిగేందుకు మైదానం కూడా అనువుగా ఉందా? అన్న అంశంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియంలో అక్కడక్కడ ఎగుడుదిగుడుగా ఉండడంతో వర్షం వచ్చిన సమయంలో మడుగులను తలపిస్తోంది. స్వాతంత్ర దినోవ్సం రోజున కూడా పెండింగ్ పనులు కనపించకుండా గ్రీన్ కార్పైట్ పర్చారు. అయితే తక్కువ సమయం ఉండడంతో పనులు చేపట్టలేకపోయారేమో.. తర్వాత పూర్తి చేస్తారు అని భావించారు. అయితే ఆగష్టు 15వ తేదీ వరకూ జరిగిన పనులే.. ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేద్దామన్న ఆలోచన అధికారుల్లో కనిపించడం లేదు. వేడుకలు ముగిసి దాదాపు 5 నెలలు కావస్తోంది. దీంతో పెండింగ్ పనులు ఇక అంతేనా? అనుమానాలు కలుగుతున్నాయి.
జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..
ఈ విషయంపై జిల్లా ఎస్పీ రాజశేఖరబాబును వివరణ కోరగా... స్వాతంత్ర వేడుకలు జరుగుతున్న సమయంలో పీటీసీ మైదానం అభివృద్ధి పనులు ఆర్‌అండ్‌బీ అధికారులు చేపట్టారని తెలిపారు. పెండింగ్ పనులపై కూడా వారే చెప్పాలన్నారు.
ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుబ్రమణ్యం, డీఈ సంజీవయ్యను వివరణ కోరగా... పెండింగ్‌లో పనులు ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే మెజర్మెంట్స్ వేయకపోవడం వల్ల పనులు చేపట్టలేదని అన్నారు. త్వరలో పెండింగ్ పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.