పడకేసిన ప్రగతి | not progress in development | Sakshi
Sakshi News home page

పడకేసిన ప్రగతి

Published Mon, Jul 25 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

పడకేసిన ప్రగతి

పడకేసిన ప్రగతి

  • అడుగు ముందుకు పడని టెక్స్‌టైల్స్‌
  • కొర్రీల చిక్కుల్లో వ్యాగన్‌ పరిశ్రమ
  • ఫలితాలివ్వని ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌
  • ప్రతిపాదనల దశలోనే ఇండస్ట్రియల్‌ కారిడార్‌ 
  • సాక్షి, హన్మకొండ : జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. ఏళ్లు గడుస్తున్నా కొత్త పరిశ్రమలు రాక  యువతకు ఉపాధి కరువైంది. వ్యాగన్‌ వర్క్‌షాప్, టెక్స్‌టైల్స్‌ పార్కు, ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్, వరంగల్‌ – హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అంటూ  ఒక్కో ప్రాజెక్టు గురించి ప్రకటనలు వెలువడుతున్నాయే తప్ప పరిశ్రమలు ప్రారంభం కావడం లేదు. 
     
    కదలని వ్యాగన్‌..
    దశాబ్దాలు గడుస్తున్నా రైల్వేశాఖ పరంగా జిల్లాకు ఒక్క భారీ పరిశ్రమ దక్కలేదు. కొన్నాళ్లు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అని, మరికొన్ని రోజులు వ్యాగన్‌ వర్క్‌షాప్‌ అని, ఇప్పుడు తాజాగా వ్యాగన్‌ మెయింటనెన్స్‌ వర్క్‌షాప్‌ అని పేర్లు మార్చడం మినహా పరిశ్రమ స్థాపనకు అడుగుముందుకు పడలేదు. ఐదేళ్ల క్రితం ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో వ్యాగన్‌ వర్క్‌షాప్‌ కాజీపేటకు మంజూరైంది. దీనికి అవసరమైన 54 ఎకరాల భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది. తీరా భూసేకరణ పూర్తయిన తర్వాత రైల్వేశాఖ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ స్థానంలో వ్యాగన్‌ మెయింటెనెన్స్‌ వర్క్‌షాప్‌ను నిర్మిస్తామని తెలిపింది. ఇందుకోసం 150 ఎకరాల స్థలం కావాలంటూ కొర్రీ పెట్టింది. 50 ఎకరాలకే నాలుగేళ్లు పడితే ఇప్పుడు అదనంగా 100 ఎకరాలు సేకరించేందుకు ఎన్నేళ్లు పడుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా రైల్వేశాఖ సొంతంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తే తప్ప, ఈ ప్రాజెక్టుకు పట్టాలు ఎక్కడం కష్టమే. 
     
    ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
    వస్త్ర పరిశ్రమకు వరంగల్‌ను హబ్‌గా తయారు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 జనవరిలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా దేశంలో వస్త్ర పరిశ్రమకు కేంద్రాలుగా విరాజిల్లుతున్న షోలాపూర్, సూరత్, తిర్పూర్‌లలో పర్యటించేందుకు ప్రస్తుత డిప్యూటీ æసీఎం, అప్పటి ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో స్థా్థనిక ప్రజాప్రతినిధులను చేర్చి కమిటీ వేశారు. టెక్స్‌టైల్స్‌ పార్కు , అనుబంధ పరిశ్రమలు వీటికి సంబంధించిన టౌన్‌షిప్‌ తదితర నిర్మాణాల కోసం ఒకే చోట రెండువేల ఎకరాల స్థలం సేకరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. టెక్స్‌టైల్స్‌ పార్కు నిర్మాణానికి ధర్మసాగర్‌ మండలం దేవనూరు సమీపంలో స్థలాన్ని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. ప్రజాప్రతినిధుల కమిటీ తమ నివేదికను రాçష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టు పనుల్లో ఆశించిన పురోగతి లేదు.
     
    అడ్రస్‌ లేని ఐటీ..
    నేటి యువతలో క్రేజ్‌ ఉన్న ఐటీ పరిశ్రమ నగరంలో వేళ్లూనుకునేందుకు ఈ ఇంక్యూబేషన్‌ సెంటర్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వరంగల్‌కు మంజూరు చేశారు. 2013లో రూ. 5.6 కోట్లతో పనులు ప్రారంభించి.. మూడేళ్ల పాటు నిర్మాణ పనులు కానిచ్చారు. ఎట్టకేలకు 2016 ఫిబ్రవరిలో ఇంక్యూబేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఇక్కడ 1500 అడుగుల వర్కింగ్‌ ప్లేస్‌ అందుబాటులో ఉంది. నిరంతరం విద్యుత్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఆర్నెళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క కంపెనీ కూడా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించలేదు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున జరుగుతున్న ప్రయత్నాలు పెద్దగా లేవు. 
     
    పత్తాలేని పారిశ్రామిక వాడ..
    తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో భాగంగా హైదరాబాద్‌ – వరంగల్‌ మధ్య ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదు. కనీసం ఏ తరహా పరిశ్రమలు, ఎక్కడ ఏర్పాటు చేస్తారనే ముసాయిదా కూడా సిద్ధం కాలేదు. మంగపేట మండలం కమలాపూర్‌లోని బిల్ట్‌ పరిశ్రమ పునరుద్ధరణ వ్యవహారం కూడా ఏడు నెలలుగా కొలిక్కి రాలేదు.
     

Advertisement

పోల్

Advertisement