
వెక్కిరిస్తున్న ఏటీఎంలు
•ఆర్‌బీఐ నుంచి రాని నగదు
•ఖాళీగా ఏటీఎంలు
•ఖాతాదారులకు తప్పని పాట్లు
•మరో వారం రోజులు వెతలు
•తప్పవంటున్న బ్యాంకర్లు
విశాఖపట్నం : ఏటీఎంల తీరు మారడం లేదు. ఏప్రిల్ ఒకటి నుంచి ఏటీఎంల్లో సరిపడినంత నగదు అందుబాటులో ఉంచుతామని చెప్పిన బ్యాంకర్లు ఆ పని చేయడం లేదు. దీంతో జనానికి నగదు కష్టాలు తప్పడం లేదు. దాదాపు నెల రోజుల నుంచి ఏటీఎంలు ఖాతాదారుల అవసరాలు తీర్చడం లేదు. నగదు లేదనో, సాంకేతిక సమస్య అనో, ఔటాఫ్ సర్వీసు అనో రకరకాల కారణాలు చూపుతూ ఏటీఎంలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నగదు లేదంటూ వెక్కిరిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు.
రిజర్వు బ్యాంకు నుంచి ఏటీఎంలకు సరిపడినంత నగదు సరఫరా అవుతుంది. బ్యాంకులకు అవసరమైన నగదును ఆర్‌బీఐ నుంచి ఆయా జిల్లాల్లోని స్కేబ్‌లకు వస్తుంది. అక్కడ నుంచి కేటాయించిన మేరకు పంపిణీ చేస్తారు. కాని దాదాపు నెల రోజులుగా పూర్తి స్థాయిలో నగదు రావడం లేదు. దీంతో ఏటీఎంలు ఎందుకూ పనికిరాకుండా ఖాతాదార్లను పరిహసిస్తున్నాయి. మరోవైపు ఎస్‌బీఐ ఏటీఎంలే పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ ఇవే ఇప్పుడు ఎక్కువగా పనికిరాకుండా పోతున్నాయి. స్టేట్ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌లు ఎస్‌బీఐలో ఇటీవలే విలీనమయ్యాయి.
ఇప్పుడు వీటి ఏటీఎంల్లో సాంకేతికంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడా ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తి కావడానికి మరికొన్నాళ్ల సమయం పడుతుంది. ఇది కూడా ఎస్‌బీఐ ఏటీఎంల్లో నగదు కొరతకు కారణమవుతోంది. నగరం మొత్తమ్మీద ఎక్కడో కొన్ని ఏటీఎంల్లో మాత్రమే అరకొర క్యాష్ లభ్యమవుతోంది. ఆ సంగతి తెలుసుకున్న జనం అక్కడికి పరుగులు తీస్తున్నారు. అక్కడ చాంతాడంత క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
ప్రైవేటు సంస్థల నుంచి తప్పించినా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ల్లో ఉండే ఏటీఎంల్లో నగదు ఉంచే బాధ్యతను ప్రైవేటు సంస్థల నుంచి తప్పించి ఇకపై సంబంధిత బ్యాంకుల సిబ్బందికే అప్పగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇది ఈ నెల ఒకటో తేదీ నుంచే అమలు చేస్తామని, అందువల్ల ఆయా శాఖల్లో ఉన్న ఏటీఎంల్లో నగదు కొరత ఉండబోదని బ్యాంకర్లు భరోసా ఇచ్చారు. కాని కొన్ని బ్రాంచిల ఏటీఎంలే అరకొరగా అవసరాలు తీరుస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల పరిస్థితి మరింత దిగజారింది. వివిధ ఏటీఎంల్లో నగదు నింపే బాధ్యతను ప్రైవేటు సెక్యూరిటీ/ఔట్‌సోర్సింగ్ సంస్థలకు అప్పగించారు. కానీ రిజర్వు బ్యాంకు నుంచి తగినంతగా సొమ్ము రాకపోవడంతో వీరు కూడా ఏటీఎంల్లో క్యాష్ పెట్టడం లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ క్యాష్ కష్టాలు మరో వారం రోజుల పాటు ఉంటాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.