cash troubles
-
వెక్కిరిస్తున్న ఏటీఎంలు
•ఆర్బీఐ నుంచి రాని నగదు •ఖాళీగా ఏటీఎంలు •ఖాతాదారులకు తప్పని పాట్లు •మరో వారం రోజులు వెతలు •తప్పవంటున్న బ్యాంకర్లు విశాఖపట్నం : ఏటీఎంల తీరు మారడం లేదు. ఏప్రిల్ ఒకటి నుంచి ఏటీఎంల్లో సరిపడినంత నగదు అందుబాటులో ఉంచుతామని చెప్పిన బ్యాంకర్లు ఆ పని చేయడం లేదు. దీంతో జనానికి నగదు కష్టాలు తప్పడం లేదు. దాదాపు నెల రోజుల నుంచి ఏటీఎంలు ఖాతాదారుల అవసరాలు తీర్చడం లేదు. నగదు లేదనో, సాంకేతిక సమస్య అనో, ఔటాఫ్ సర్వీసు అనో రకరకాల కారణాలు చూపుతూ ఏటీఎంలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నగదు లేదంటూ వెక్కిరిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి ఏటీఎంలకు సరిపడినంత నగదు సరఫరా అవుతుంది. బ్యాంకులకు అవసరమైన నగదును ఆర్బీఐ నుంచి ఆయా జిల్లాల్లోని స్కేబ్‌లకు వస్తుంది. అక్కడ నుంచి కేటాయించిన మేరకు పంపిణీ చేస్తారు. కాని దాదాపు నెల రోజులుగా పూర్తి స్థాయిలో నగదు రావడం లేదు. దీంతో ఏటీఎంలు ఎందుకూ పనికిరాకుండా ఖాతాదార్లను పరిహసిస్తున్నాయి. మరోవైపు ఎస్బీఐ ఏటీఎంలే పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ ఇవే ఇప్పుడు ఎక్కువగా పనికిరాకుండా పోతున్నాయి. స్టేట్ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌లు ఎస్బీఐలో ఇటీవలే విలీనమయ్యాయి. ఇప్పుడు వీటి ఏటీఎంల్లో సాంకేతికంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడా ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తి కావడానికి మరికొన్నాళ్ల సమయం పడుతుంది. ఇది కూడా ఎస్బీఐ ఏటీఎంల్లో నగదు కొరతకు కారణమవుతోంది. నగరం మొత్తమ్మీద ఎక్కడో కొన్ని ఏటీఎంల్లో మాత్రమే అరకొర క్యాష్ లభ్యమవుతోంది. ఆ సంగతి తెలుసుకున్న జనం అక్కడికి పరుగులు తీస్తున్నారు. అక్కడ చాంతాడంత క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు సంస్థల నుంచి తప్పించినా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ల్లో ఉండే ఏటీఎంల్లో నగదు ఉంచే బాధ్యతను ప్రైవేటు సంస్థల నుంచి తప్పించి ఇకపై సంబంధిత బ్యాంకుల సిబ్బందికే అప్పగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇది ఈ నెల ఒకటో తేదీ నుంచే అమలు చేస్తామని, అందువల్ల ఆయా శాఖల్లో ఉన్న ఏటీఎంల్లో నగదు కొరత ఉండబోదని బ్యాంకర్లు భరోసా ఇచ్చారు. కాని కొన్ని బ్రాంచిల ఏటీఎంలే అరకొరగా అవసరాలు తీరుస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల పరిస్థితి మరింత దిగజారింది. వివిధ ఏటీఎంల్లో నగదు నింపే బాధ్యతను ప్రైవేటు సెక్యూరిటీ/ఔట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించారు. కానీ రిజర్వు బ్యాంకు నుంచి తగినంతగా సొమ్ము రాకపోవడంతో వీరు కూడా ఏటీఎంల్లో క్యాష్ పెట్టడం లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ క్యాష్ కష్టాలు మరో వారం రోజుల పాటు ఉంటాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
'రూ.30వేలకు మించి క్యాష్ ఇవ్వలేం'
-
క్యాష్ లెస్ బ్యాంక్
-
'రూ.30వేలకు మించి క్యాష్ ఇవ్వలేం'
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్న క్రమంలో మళ్లీ నగరంలో నగదు కొరత ప్రారంభమైంది. విత్ డ్రా పరిమితి ఆంక్షలన్నింటిన్నీ ఆర్బీఐ ఎత్తివేసినప్పటికీ ప్రజలను నగదు కష్టాలు వీడటం లేదు. ఎక్కడ ఏటీఎంలు చూసినా నో క్యాష్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. ఒక్క ఏటీఎంలలోనే కాక, ఇటు బ్యాంకుల్లోనూ నగదు కొరత భారీగా ఏర్పడినట్టు తెలుస్తోంది. రోజువారీ నగదు డిపాజిట్లు తగ్గడంతో పాటు నెలరోజులుగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రానికి డిమాండ్ కు తగ్గ మేర నగదు రాకపోవడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నట్టు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా వెల్లువెత్తిన డిపాజిట్లు ఇటీవల దారుణంగా పడిపోయాయని బ్యాంకర్లు చెప్పారు. చలామణిలోకి తీసుకొచ్చిన కొత్త కరెన్సీ నోట్ల డిపాజిట్లు చాలా తక్కువగా వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా నగదు అందించడం కష్టతరంగా మారుతుందని వారు వాపోతున్నారు. ఆర్బీఐ ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ రూ.30 వేలకంటే మించి నగదు ఇవ్వలేమని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలోనే మరింత నగదు కష్టాలు పెరుగుతాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. మరోవైపు నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం నిబంధనల మీద నిబంధనలు తీసుకొస్తూనే ఉంది. నగదు లావాదేవీలను రూ.2 లక్షలకే పరిమితం చేసేందుకు కొత్త చట్టాలను కూడా తీసుకొస్తోంది. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం, కొత్త కరెన్సీ నోట్లు రూ.2000, రూ.500లను చలామణిలోకి తీసుకొచ్చింది. విత్ డ్రా పరిమితులు విధిస్తూ వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చింది. కానీ బ్యాంకుల నుంచి ఖాతాదారుల చేతికి వచ్చిన రూ.2000 నోట్లు తిరిగి డిపాజిట్లకు రావడం లేదు. మార్కెట్లో లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకుల్లో డిపాజిట్ కాక నగదు కొరత సమస్య తీవ్రమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి.. దీనికి తోడు ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి కొత్త నోట్ల పంపిణీ డిమాండ్‌కు తగ్గట్టు లేదని తెలుస్తోంది. -
‘పులిలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ’
కోల్ కతా: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కష్టాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. గురువారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి ప్రధాని మోదీ కారణమయ్యారని మండిపడ్డారు. ‘ఓ నియంత కారణంగా దేశంలో నోట్ల కష్టాలు వచ్చాయి. ఇది చీకటి యుగం. దీని నుంచి ప్రజలను బయట పడేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. నోట్ల రద్దుతో ప్రధాని, ఆయన మద్దతుదారులకే లబ్ది చేకూరింది. మోదీ వన్ మేన్ షో కారణంగానే నోట్ల కష్టాలు వచ్చిపడ్డాయి. దేశాన్ని చాలా మంద్రి ప్రధాన మంత్రులు పాలించారు కానీ మోదీలా ఎవరూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేదు. ప్రజల డబ్బును మోదీ తన సొంత సొమ్ములా భావిస్తున్నారు. నల్లధనం ఎక్కడుంది? మీరు తీసుకున్నదంతా ప్రజా ధనమే. అదంతా పన్నుల కడుతున్న వారి డబ్బు. ఎవరినీ సంప్రదించకుండానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను ప్రధాని మోదీ లెక్క చేయకుండా అందరి డబ్బు దోచుకుంటున్నారు. ప్రస్తుత ప్రధాని నాయకత్వంలో ప్రభుత్వం గాడి తప్పింది. నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ మౌనం వహించారు. ప్రధానిపై ఆధారపడడం మానేసి స్వతంత్రంగా వ్యవహరించాలి. కరెన్సీ నోట్ల గురించి ఎవరూ వివరాలు వెల్లడించడం లేదు. ప్రధాని మోదీ తనకు తాను పులి అనుకుంటున్నారు. తాను చేసిందే కరెక్టు అని అన్నట్టుగా వ్యహరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ అత్యంత గోప్యత పాటిస్తున్నారు. తాను రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నారు. రేపు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రధాని సమాధానాలు ఇవ్వడం మానేసి సుభాషితాలు వల్లిస్తున్నారు. గత నెల రోజులుగా ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాల’ని మమతా బెనర్జీ అన్నారు. -
క్యాష్ కష్టాలు..
-
పెళ్లికి ‘పెద్ద’ కష్టం...
వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న పెళ్లి కుమార్తె ‘రూ.2.5 లక్షల’పై ఎలాంటి ఆదేశాలు లేవని బ్యాంకు స్పష్టీకరణ దేవరాపల్లి: సందడిగా ఉండాల్సిన పెళ్లి ఇంట్లో పెద్ద నోట్ల రద్దుతో బిక్కచచ్చిపోతున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన రొంగలి నారాయణమూర్తి, అచ్చియ్యమ్మ దంపతులు తమ కుమార్తె రొంగలి రాముకు డిసెంబర్ 21న వివాహం నిశ్చయించారు. బ్యాంకులో ఉన్న తమ రూ. 1.80 లక్షల డబ్బును తీసుకునేందుకు వారు వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. పెళ్లి పనులను శుక్రవారం నుంచి చేపట్టాలని పురోహితులు నిర్ణయించడంతో వారు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. గురువారం పెళ్లి కుమార్తె స్వయంగా వెళ్లి వేడుకున్నా వారానికి రూ.24 వేలే ఇవ్వగలమని అధికారులు చెప్పారు. అదైనా తీసుకుందామంటే గురువారం సాయంత్రం వరకు బ్యాంక్‌కు నగదే రాలేదు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పెళ్లిళ్లు ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు తీసుకునే వీలు కల్పించినా బ్యాంక్‌లు నిరాకరించడం అన్యాయమని వాపోయింది. ఈ విషయమై దేవరాపల్లి యూకో బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. పెళ్లిళ్ల వారికి నగదు డ్రాలో వెసులుబాటు కల్పిస్తున్నట్లు తమకు ఆదేశాలు రాలేదన్నారు.