
‘పులిలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ’
కోల్ కతా: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కష్టాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. గురువారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి ప్రధాని మోదీ కారణమయ్యారని మండిపడ్డారు.
‘ఓ నియంత కారణంగా దేశంలో నోట్ల కష్టాలు వచ్చాయి. ఇది చీకటి యుగం. దీని నుంచి ప్రజలను బయట పడేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. నోట్ల రద్దుతో ప్రధాని, ఆయన మద్దతుదారులకే లబ్ది చేకూరింది. మోదీ వన్ మేన్ షో కారణంగానే నోట్ల కష్టాలు వచ్చిపడ్డాయి. దేశాన్ని చాలా మంద్రి ప్రధాన మంత్రులు పాలించారు కానీ మోదీలా ఎవరూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేదు. ప్రజల డబ్బును మోదీ తన సొంత సొమ్ములా భావిస్తున్నారు. నల్లధనం ఎక్కడుంది? మీరు తీసుకున్నదంతా ప్రజా ధనమే. అదంతా పన్నుల కడుతున్న వారి డబ్బు. ఎవరినీ సంప్రదించకుండానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను ప్రధాని మోదీ లెక్క చేయకుండా అందరి డబ్బు దోచుకుంటున్నారు. ప్రస్తుత ప్రధాని నాయకత్వంలో ప్రభుత్వం గాడి తప్పింది. నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ మౌనం వహించారు. ప్రధానిపై ఆధారపడడం మానేసి స్వతంత్రంగా వ్యవహరించాలి. కరెన్సీ నోట్ల గురించి ఎవరూ వివరాలు వెల్లడించడం లేదు.
ప్రధాని మోదీ తనకు తాను పులి అనుకుంటున్నారు. తాను చేసిందే కరెక్టు అని అన్నట్టుగా వ్యహరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ అత్యంత గోప్యత పాటిస్తున్నారు. తాను రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నారు. రేపు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రధాని సమాధానాలు ఇవ్వడం మానేసి సుభాషితాలు వల్లిస్తున్నారు. గత నెల రోజులుగా ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాల’ని మమతా బెనర్జీ అన్నారు.