'రూ.30వేలకు మించి క్యాష్ ఇవ్వలేం'
'రూ.30వేలకు మించి క్యాష్ ఇవ్వలేం'
Published Thu, Mar 23 2017 10:53 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్న క్రమంలో మళ్లీ నగరంలో నగదు కొరత ప్రారంభమైంది. విత్ డ్రా పరిమితి ఆంక్షలన్నింటిన్నీ ఆర్బీఐ ఎత్తివేసినప్పటికీ ప్రజలను నగదు కష్టాలు వీడటం లేదు. ఎక్కడ ఏటీఎంలు చూసినా నో క్యాష్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. ఒక్క ఏటీఎంలలోనే కాక, ఇటు బ్యాంకుల్లోనూ నగదు కొరత భారీగా ఏర్పడినట్టు తెలుస్తోంది. రోజువారీ నగదు డిపాజిట్లు తగ్గడంతో పాటు నెలరోజులుగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రానికి డిమాండ్ కు తగ్గ మేర నగదు రాకపోవడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నట్టు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా వెల్లువెత్తిన డిపాజిట్లు ఇటీవల దారుణంగా పడిపోయాయని బ్యాంకర్లు చెప్పారు. చలామణిలోకి తీసుకొచ్చిన కొత్త కరెన్సీ నోట్ల డిపాజిట్లు చాలా తక్కువగా వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా నగదు అందించడం కష్టతరంగా మారుతుందని వారు వాపోతున్నారు. ఆర్బీఐ ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ రూ.30 వేలకంటే మించి నగదు ఇవ్వలేమని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు.
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలోనే మరింత నగదు కష్టాలు పెరుగుతాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. మరోవైపు నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం నిబంధనల మీద నిబంధనలు తీసుకొస్తూనే ఉంది. నగదు లావాదేవీలను రూ.2 లక్షలకే పరిమితం చేసేందుకు కొత్త చట్టాలను కూడా తీసుకొస్తోంది. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం, కొత్త కరెన్సీ నోట్లు రూ.2000, రూ.500లను చలామణిలోకి తీసుకొచ్చింది. విత్ డ్రా పరిమితులు విధిస్తూ వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చింది. కానీ బ్యాంకుల నుంచి ఖాతాదారుల చేతికి వచ్చిన రూ.2000 నోట్లు తిరిగి డిపాజిట్లకు రావడం లేదు. మార్కెట్లో లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకుల్లో డిపాజిట్ కాక నగదు కొరత సమస్య తీవ్రమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి.. దీనికి తోడు ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి కొత్త నోట్ల పంపిణీ డిమాండ్కు తగ్గట్టు లేదని తెలుస్తోంది.
Advertisement
Advertisement