అసలు పనిచేసే ఏటీఎంలెన్నో తెలుసా?
ముంబై: పెద్ద నోట్ల రద్దులో అత్యంత కీలకమైన ఘట్టం.. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు డిసెంబర్ 30 శుక్రవారంతో ముగిసింది. ఈ లోపల ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సరిపడ నగదు విషయంలో ప్రభుత్వం వాగ్దానం నెరవేరినట్టు కనిపించడం లేదు. దేశీయంగా ఉన్న ఏటీఎంలో కేవలం 30 శాతం మాత్రమే నగదును అందిస్తున్నాయని, మిగతా రెండు వంతులకు పైగా ఏటీఎంలు నోక్యాష్ బోర్డులనే వెక్కిరిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో ఈ ఏటీఎంలు ఉన్నా ఒకటే లేకపోయినే ఒకటే అన్నచందాగా మారాయి. బ్యాంకులు సైతం కస్టమర్లకు నగదును తమ బ్రాంచ్ కార్యాలయాల నుంచే అందిస్తున్నాయని ఏటీఎంలలో మాత్రం నగదు నింపడం లేదని తెలిసింది.
కేవలం 30 శాతం అంటే 66,000 ఏటీఎంలు మాత్రమే యాక్టివ్గా పనిచేస్తున్నాయని ఏటీఎం ఇండస్ట్రి కాన్ఫడరేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ పటేల్ తెలిపారు. రెండు నెలల డీమోనిటైజేషన్ కాలంలో కేవలం 20 శాతం ఏటీఎంలలోనే రెగ్యులర్గా నగదును నింపినట్టు ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజూ రూ.7-8 లక్షల వరకు ఏటీఎంలలో నగదును నింపేవారని, కానీ నోట్ల రద్దు అనంతరం రోజుకు కేవలం రూ.2-3 లక్షల నగదునే నింపినట్టు తెలిసింది. అత్యధిక మొత్తంలో నగదు కావాలనుకునే వారు బ్యాంకుల్లోనే నగదు తీసుకోవడానికి మొగ్గుచూపారని భారత్, దక్షిణాసియా ఎన్సీఆర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్రోజ్ దస్తూర్ చెప్పారు. ఎస్బీఐ ఒక్క బ్యాంకే ఏటీఎంలలో నగదును మంచిగా ఫిల్ చేసిందని, ప్రైవేట్ బ్యాంకులు తమ కార్యాలయాల నుంచే నగదును అందించాయని తెలిపారు.