నగదు కోసం నిరీక్షిస్తున్న రాము
వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న పెళ్లి కుమార్తె
‘రూ.2.5 లక్షల’పై ఎలాంటి
ఆదేశాలు లేవని బ్యాంకు స్పష్టీకరణ
దేవరాపల్లి: సందడిగా ఉండాల్సిన పెళ్లి ఇంట్లో పెద్ద నోట్ల రద్దుతో బిక్కచచ్చిపోతున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన రొంగలి నారాయణమూర్తి, అచ్చియ్యమ్మ దంపతులు తమ కుమార్తె రొంగలి రాముకు డిసెంబర్ 21న వివాహం నిశ్చయించారు. బ్యాంకులో ఉన్న తమ రూ. 1.80 లక్షల డబ్బును తీసుకునేందుకు వారు వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. పెళ్లి పనులను శుక్రవారం నుంచి చేపట్టాలని పురోహితులు నిర్ణయించడంతో వారు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు.
గురువారం పెళ్లి కుమార్తె స్వయంగా వెళ్లి వేడుకున్నా వారానికి రూ.24 వేలే ఇవ్వగలమని అధికారులు చెప్పారు. అదైనా తీసుకుందామంటే గురువారం సాయంత్రం వరకు బ్యాంక్‌కు నగదే రాలేదు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పెళ్లిళ్లు ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు తీసుకునే వీలు కల్పించినా బ్యాంక్‌లు నిరాకరించడం అన్యాయమని వాపోయింది. ఈ విషయమై దేవరాపల్లి యూకో బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. పెళ్లిళ్ల వారికి నగదు డ్రాలో వెసులుబాటు కల్పిస్తున్నట్లు తమకు ఆదేశాలు రాలేదన్నారు.