marepalli
-
వెండితెరపై మారేపల్లి కుర్రోడు
పుట్టింది పల్లెలో అయినా చలనచిత్రసీమలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఓ యువకుడి కథ ఇది. పేదరికమే నేపథ్యం కానీ కష్టపడి చదువుకుని ఉద్యోగం చేస్తూనే తన కిష్టమైన చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు కుమార స్వామి. కథనాయకుడుగా ఎదిగిన దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన ఈ యువకుడు ‘హెచ్ 23’ సినిమాలో హీరో అవకాశం దక్కించుకున్నాడు. శుక్రవారం థియేటర్లలో విడుదుల కానున్న ఆ సినిమా హీరో ప్రస్థానం ఇలా సాగింది. సాక్షి, దేవరాపల్లి (విశాఖపట్నం): దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందిన ఎన్నేటి వెంకట కుమార స్వామి తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు. మారేపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎన్నేటి అప్పారావు, రమణమ్మ దంపతుల కుమారుడు స్వామి. అతనికి అక్కా చెల్లి ఉన్నారు. తల్లిదండ్రులు రోజు వారీ కూలీ పనులకు వెళ్తూ కుటుంబ పోషణ చేసేవారు. కష్టపడి ఉన్నత చదువులు చదివిన కుమార స్వామి మదురై లో ఉద్యోగం చేస్తుండగా ఏర్పడిన పరిచయాలతో అనుకోకుండా చిత్ర పరిశ్రమవైపు అడుగులు పడ్డాయి. ప్రస్తుతం వైవీకేఎస్ క్రియేషన్స్ పతాకంపై ఇమంది శ్రీను దర్శకుడిగా రూపొందించిన హెచ్ 23 సినిమాలో కుమారస్వామి హీరోగా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో దాదాపు 100 థియేటర్లలో శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం యూత్ ఫుల్ హర్రర్, కామెడీ అని, అందరినీ అలరిస్తుందని కుమార్‌స్వామి తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైల్ రన్ సందీప్ కిషన్ ఆవిష్కరించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో కోటి రూపాయల బడ్జెట్‌తో కేవలం 27 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాకు నిర్మాతలుగా కె.నవీన, వైవీ సంధ్య వ్యవహరించారు. సినీ రంగ ప్రస్థానం ఇలా.. ఎన్నేటి వెంకట కుమార్ స్వామి టెన్త్, ఇంటర్ దేవరాపల్లి ప్రభుత్వ హైస్కూల్, కళాశాలలోను, డిగ్రీ చోడవరం ఫోర్ ఎస్ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం ఏయూ క్యాంపస్ స్టూడెంట్‌గా పీజీలో ఎంకామ్ పూర్తి చేశాడు. అకౌంట్స్ పూర్తయిన తర్వాత మదురైలో కనస్ట్రక్షన్ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తుండగా అనుకోకుండా వచ్చిన ఆఫర్‌తో హైదరాబాద్‌లోని రవికిరణ్ వద్ద అకౌంటెంట్ ఆఫీసర్‌గా విధుల్లో చేరాడు. రవికిరణ్ సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా తాను అకౌంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించడంతో చిత్ర పరిశ్రమలో అతనికి మరింత పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌తో కొత్త హీరోలు కూడా సినిమా తీయవచ్చునని దృఢ సంకల్పంతో పెద్ద సినిమాలకు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించామని కుమార్ స్వామి తెలిపాడు. విశాఖ వేదికగా 2015లో వై.వి.కె.ఎస్ క్రియేషన్ సంస్థను ఏర్పాటు చేశానని ఈ క్రియేషన్ కింద వైజాగ్‌పై పాటను చిత్రీకరించామని చెప్పాడు. విశాఖ అందాలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలతో పాట రూపంలో వినిపించామని తాము పడిన శ్రమకు మంచి స్పందన లభించిందని యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అయిందని తెలిపాడు. తాము రూపొందించి చిత్రలహరి వెబ్ సిరీస్ మూడు సీజన్లకు మంచి ఆదరణ లభించిందన్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే కారణం తల్లిదండ్రులతో పాటు మా కుటుంబ సభ్యులైన అక్క, చెల్లె, బావల సహాయ సహకారం, ప్రోత్సాహంతోనే తన సినీ ప్రస్థానం కొనసాగుతోంది. చిత్ర పరిశ్రమలు పలువురు ప్రముఖుల సలహాలు, సూచనలు కూడా అందించారు. విశాఖపట్నం వేదికగా ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయడం ఆనందంగా ఉంది. తక్కువ బడ్జెట్‌తో కూడా సినిమా తీయాలన్న సంకల్పం నెరవేరింది. ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారని ఆశిస్తున్నా. –ఎన్నేటి వెంకట కుమార్ స్వామి, హెచ్23 మూవీ సినీ హీరో -
పెళ్లికి ‘పెద్ద’ కష్టం...
వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న పెళ్లి కుమార్తె ‘రూ.2.5 లక్షల’పై ఎలాంటి ఆదేశాలు లేవని బ్యాంకు స్పష్టీకరణ దేవరాపల్లి: సందడిగా ఉండాల్సిన పెళ్లి ఇంట్లో పెద్ద నోట్ల రద్దుతో బిక్కచచ్చిపోతున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన రొంగలి నారాయణమూర్తి, అచ్చియ్యమ్మ దంపతులు తమ కుమార్తె రొంగలి రాముకు డిసెంబర్ 21న వివాహం నిశ్చయించారు. బ్యాంకులో ఉన్న తమ రూ. 1.80 లక్షల డబ్బును తీసుకునేందుకు వారు వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. పెళ్లి పనులను శుక్రవారం నుంచి చేపట్టాలని పురోహితులు నిర్ణయించడంతో వారు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. గురువారం పెళ్లి కుమార్తె స్వయంగా వెళ్లి వేడుకున్నా వారానికి రూ.24 వేలే ఇవ్వగలమని అధికారులు చెప్పారు. అదైనా తీసుకుందామంటే గురువారం సాయంత్రం వరకు బ్యాంక్‌కు నగదే రాలేదు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పెళ్లిళ్లు ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు తీసుకునే వీలు కల్పించినా బ్యాంక్‌లు నిరాకరించడం అన్యాయమని వాపోయింది. ఈ విషయమై దేవరాపల్లి యూకో బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. పెళ్లిళ్ల వారికి నగదు డ్రాలో వెసులుబాటు కల్పిస్తున్నట్లు తమకు ఆదేశాలు రాలేదన్నారు. -
మంచం పట్టిన మారెపల్లి
పెద్దముల్: రంగారెడ్డి జిల్లా పెద్దముల్ మండలం మారెపల్లి తండా విషజ్వరాలతో మంచంపట్టింది. గ్రామంలోని సుమారు 300 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. వాంతులు, విరోచనాలతో పాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంతలా విషజ్వరాలు ప్రభలుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దా‘రుణం’
అప్పులు చేసి మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు.. రెక్కలుముక్కలు చేసుకొని సాగుచేస్తున్న పంటలు ఎండుముఖం పట్టాయి. ఇక అప్పులు తీరేమార్గం కానరావడం లేదని మనోవేదనకు గురైన ఓ అన్నదాత మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగి తనువు చాలించాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం మారేపల్లి తండాలో శనివారం చోటుచేసుకుంది. పెద్దేముల్: బాగా బతుకొచ్చని భావించి అప్పు లు చేసి ఆ రైతు మూడు బోర్లు వేయించాడు. ఒక్కదాంట్లోనూ చుక్కనీరు పడలేదు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అప్పులు ఇచ్చినవారు వేధించసాగారు. వాటిని తీర్చేమార్గం కానరాకపోవడంతో మనోవేదనకు గురైన గిరిజన రైతు మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలోని మారేపల్లి తండాలో శనివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, ఆర్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన వర్ధ్యా కిషన్‌నాయక్(54)కు పొలంలో లేకపోవడంతో 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం 3 ఎకరాల 7 కుంటల అసైన్డ్‌భూమిని ఇచ్చింది. దీంతో ఆయన వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చుట్టుపక్కల పొలాల రైతులు బోర్లు వేసుకొని పంటలు సాగుచేస్తున్నారు. దీంతో తాను కూడా బోరు వేసుకొని బాగా పంటలు పండిచ్చవచ్చని కిషన్‌నాయక్ భావించాడు. ఈక్రమంలో ఏడాది క్రితం పెద్దేముల్ సహకార సంఘంలో రూ.10 వేలు, తెలిసిన వారి వద్ద మరో రూ. 70 వేలు అప్పు చేసి మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దీంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చేమార్గం లేదని ఇటీవల మనస్తాపం చెందాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అప్పులు ఇచ్చిన వారు కొంతకాలంగా కిషన్‌నాయక్‌ను వేధించసాగారు. ఇటీవల సాగుచేసిన పెసర, కందులు వానలు లేక ఎండుముఖం పట్టాయి. దీంతో అప్పులు తీరేమార్గం లేదని కిషన్‌నాయక్ మనస్తాపం చెందాడు. ఈక్రమంలో శనివారం ఉదయం పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగాడు. పక్కపొలాల రైతులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే రైతు మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఆర్ఐ లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి పెద్ద కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. గతంలో అనారోగ్యంతో కిషన్‌నాయక్ భార్య మృతిచెందింది. అప్పులే ప్రాణం తీశాయి.. అప్పుల బాధతోనే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుమారుడు శ్రీను వాపోయాడు. అప్పులు ఎలా తీర్చాలని నెల రోజులుగా మనోవేదనకు గురయ్యాడని తెలిపాడు. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి. పెట్టుబడి కోసం కొంతకాలం క్రితం రూ.లక్ష విలువైన రెండు ఎద్దులను రూ.65 వేలకే అమ్మేశాం. అప్పులే ముప్పయ్యాయని శ్రీను కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పుల బాధతోనే రైతు కిషన్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆర్ఐ లక్ష్మణ్ పేర్కొన్నారు.