అప్పులు చేసి మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు.. రెక్కలుముక్కలు చేసుకొని సాగుచేస్తున్న పంటలు ఎండుముఖం పట్టాయి. ఇక అప్పులు తీరేమార్గం కానరావడం లేదని మనోవేదనకు గురైన ఓ అన్నదాత మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగి తనువు చాలించాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం మారేపల్లి తండాలో శనివారం చోటుచేసుకుంది.
పెద్దేముల్: బాగా బతుకొచ్చని భావించి అప్పు లు చేసి ఆ రైతు మూడు బోర్లు వేయించాడు. ఒక్కదాంట్లోనూ చుక్కనీరు పడలేదు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అప్పులు ఇచ్చినవారు వేధించసాగారు. వాటిని తీర్చేమార్గం కానరాకపోవడంతో మనోవేదనకు గురైన గిరిజన రైతు మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలోని మారేపల్లి తండాలో శనివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, ఆర్‌ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన వర్ధ్యా కిషన్‌నాయక్(54)కు పొలంలో లేకపోవడంతో 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం 3 ఎకరాల 7 కుంటల అసైన్డ్‌భూమిని ఇచ్చింది. దీంతో ఆయన వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చుట్టుపక్కల పొలాల రైతులు బోర్లు వేసుకొని పంటలు సాగుచేస్తున్నారు. దీంతో తాను కూడా బోరు వేసుకొని బాగా పంటలు పండిచ్చవచ్చని కిషన్‌నాయక్ భావించాడు.
ఈక్రమంలో ఏడాది క్రితం పెద్దేముల్ సహకార సంఘంలో రూ.10 వేలు, తెలిసిన వారి వద్ద మరో రూ. 70 వేలు అప్పు చేసి మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దీంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చేమార్గం లేదని ఇటీవల మనస్తాపం చెందాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అప్పులు ఇచ్చిన వారు కొంతకాలంగా కిషన్‌నాయక్‌ను వేధించసాగారు. ఇటీవల సాగుచేసిన పెసర, కందులు వానలు లేక ఎండుముఖం పట్టాయి. దీంతో అప్పులు తీరేమార్గం లేదని కిషన్‌నాయక్ మనస్తాపం చెందాడు. ఈక్రమంలో శనివారం ఉదయం పొలానికి వెళ్లాడు.
మధ్యాహ్నం మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగాడు. పక్కపొలాల రైతులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే రైతు మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఆర్‌ఐ లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి పెద్ద కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. గతంలో అనారోగ్యంతో కిషన్‌నాయక్ భార్య మృతిచెందింది.
అప్పులే ప్రాణం తీశాయి..
అప్పుల బాధతోనే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుమారుడు శ్రీను వాపోయాడు. అప్పులు ఎలా తీర్చాలని నెల రోజులుగా మనోవేదనకు గురయ్యాడని తెలిపాడు. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి. పెట్టుబడి కోసం కొంతకాలం క్రితం రూ.లక్ష విలువైన రెండు ఎద్దులను రూ.65 వేలకే అమ్మేశాం. అప్పులే ముప్పయ్యాయని శ్రీను కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పుల బాధతోనే రైతు కిషన్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆర్‌ఐ లక్ష్మణ్ పేర్కొన్నారు.
దా‘రుణం’
Published Sun, Jun 28 2015 12:59 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement