పెద్ద నోట్ల జమ.. ఆపై విత్‌డ్రాలు
Published Thu, Dec 8 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
ముమ్మిడివరం పోస్టు ఆఫీసులో పోస్టల్ అసిస్టెంట్ నిర్వాకం
రూ.4 లక్షలు రికవరీ... ఉద్యోగి సస్పెన్షన్
అమలాపురం టౌన్ : పెద్ద నోట్ల రద్దును కొంతమంది అక్రమార్జనలకు వినియోగించుకుంటున్నారు. ‘పెద్దల పద్దు’ల సేవలో మురిసిపోతున్న వారిపై వేసిన వలలో ఒక్కొక్కక్కరుగా చిక్కుతున్నారు. ముమ్మిడివరం సబ్ పోస్టు ఆఫీసులో సతీష్ అనే పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగిపై విచారణ చేపట్టగా రూ.4 లక్షలు పెద్ద నోట్లను తనకు తెలిసిన కొందరి పొదుపు ఖాతాల్లో డిపాజిట్ చేసి ఆనక విత్ డ్రా చేసుకున్నట్లు తేలింది. దీంతో ఉద్యోగి సతీష్‌ను సస్పెండ్ చేసి అక్రమంగా మార్చిన రూ.4 లక్షల పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం పోస్టల్ అధికారులు ముమ్మిడివరం తంతి తపాల కార్యాలయానికి వెళ్లి సదరు ఉద్యోగి అక్రమ డిపాజిట్లపై విచారణ చేపట్టారు. ఈ విషయం పది రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ ఉద్యోగి చనిపోయిన వారి ఇద్దరి అకౌంట్లలో ఫోర్జరీ సంతకాలతో రూ.24 వేలు వంతున వేసి డ్రా చేసుకున్నట్లు కూడా విచారణలో వెల్లడైంది. విశాఖ పోస్టల్ రీజయన్ పోస్టు మాస్టర్ జనరల్ శ్రీలక్ష్మి కోనసీమ పర్యటనకు వచ్చినప్పుడు ఆ తప్పిదం బయట పడటంతో ఆమె ఇలాంటి అక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నాయామోనన్న అనుమానంతో అన్ని పోస్టు ఆఫీసుల్లో ప్రత్యేక తనిఖీలు కూడా చేయిస్తున్నారు. దీనికి పోస్టల్ విజిలెన్స్ స్క్వాడ్లు ఈ తరహా అక్రమాలపై ప్రత్యేక నిఘాతో జిల్లాలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ స్క్వాడ్ బుధవారం అమలాపురం, నగరం తదితర ప్రాంతాల్లోని పోస్టు ఆఫీసుల్లో తనిఖీలు చేశాయి.
Advertisement
Advertisement