నోటుపాట్లు | notes problems | Sakshi
Sakshi News home page

నోటుపాట్లు

Published Sat, Nov 12 2016 9:19 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ఎమ్మిగనూరులో బారులుదీరిన జనం - Sakshi

ఎమ్మిగనూరులో బారులుదీరిన జనం

- పోటెత్తిన బ్యాంకులు
- తీవ్రమైన రూ.100 నోట్ల కొరత
- నిప్పై మండిన ఉప్పు 
- పడిపోయిన వ్యాపారాలు 
 
కర్నూలు(అగ్రికల్చర్‌): నోట్ల కష్టాలు ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని పనులు వదులుకొని కేవలం వేలాది మంది నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అక్కడ రూ. 2000 నోట్లు ఇస్తుండడంతో వాటిని ఎక్కడ మార్చుకోవాలని తెలియని పరిస్థితి. జిల్లాలో రూ.100 నోట్ల కోతర తీవ్రమైంది. కిరాణం షాపులు, పాల వాళ్లు ఇతరులు రూ.1000, 500 నోట్లను తిరçస్కరిస్తుండటంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉన్నట్టుండి శనివారం జిల్లాలో ఉప్పు నిప్పు అయింది. ఉప్పు ఇక దొరకదంట అనే ప్రచారం ఎక్కువగా జరుగడంతో  జనం పరుగులు తీశారు. నిత్యావసర వస్తువులు ప్రధానంగా హైదరాబాద్, విజయవాడల నుంచి సరఫరా అవుతాయి. హోల్‌సేల్‌ వ్యాపారులు పెద్దనోట్లను తీసుకోవడం లేదు. కింది స్థాయిలో వ్యాపారులు కూడా వినియోగదారుల నుంచి పెద్దనోట్లు స్వీకరించడం లేదు. దీంతో ఇప్పటికే నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో నగదు సమస్యలు పరిష్కారం కాకపోతే నిత్యావసర వస్తువులు లభించడం కష్టమవుతుందనే ప్రచారం సాగుతోంది.
 
తీరని వందనోట్ల కొరత...
బ్యాంకులకు రూ.500, 1000 నోట్ల డిపాజిట్లు పోటెత్తున్నా... రూ.100 నోట్ల కొరత తీవ్రం కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కొత్త రూ.500 నోట్లు ఎపుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. రద్దు అయిన పెద్ద నోట్లను చేత పట్టుకొని మార్పుడికి  బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. వందనోట్ల కొరత వల్ల ఏటీఎం సేవలు నామమత్రమే అయ్యాయి. కరెన్సీ కొరతనే ఇందుకు కారణం. బ్యాంకులకు ప్రజలు పోటెత్తుతున్నా నగదు మార్పిడి, విత్‌ డ్రాల్లో వంద నోట్లు 10 వరకు మాత్రమే ఇస్తున్నారు. జిల్లాకు వందనోట్ల అవసరం రోజుకు రూ.50 కోట్ల వరకు ఉన్నా బ్యాంకులు, ఏటీఎంల ద్వారా రూ.కోటి కూడా  మార్కెట్‌లోకి రాపోవడంతో ఆర్థిక కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ఏటీఎంలు 403 ఉన్నా 20 శాతం కూడా పనిచేయలేదు. 
మూడు రోజుల్లో రూ.1000 కోట్ల డిపాజిట్లు...
 మూడు రోజుల్లో బ్యాంకులు, పోస్టుపీసులకు పెద్ద నోట్లు రూ.1000 కోట్లు డిపాజిట్‌లు వచ్చినట్లు సమాచారం. నగదు మార్పిడి, విత్‌డ్రాకు ఎంత డిమాండ్‌ ఉందో డిపాజిట్‌లకు అంతే డిమాండ్‌ ఏర్పడింది. వీలైనంత త్వరగా పెద్దనోట్లను వదిలించుకోవాలనే ఆత్రుత ప్రజల్లో కనిపిస్తోంది. అందువల్లనే డిపాజిట్లు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులకు తరలివస్తున్నారు.  
పడిపోయిన వ్యాపారాలు...
నగదు కొరతతో జిల్లాలో వ్యాపార లావాదేవీలు పడిపోయాయి. పసిడి వ్యాపారం నేలకు పాకింది. జిల్లా మొత్తం మీద బంగారం వ్యాపారం రోజు రూ.50 కోట్ల వరకు ఉంటుంది. అటువంటిది మూడు రోజులుగా బంగారం వ్యాపారం జిల్లా మొత్తం మీద రూ.2కోట్లకు మించడం లేదు. కర్నూలులోని షరాఫ్‌ బజార్‌ కొనుగోలు దారులేక వెలవెల పోతోంది. కనీసం బోణీ కాని షాపులు ఉండటం గమానార్హం. కొందరు వ్యాపారులు ధరలు అనూహ్యంగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అన్ని రకాల వ్యాపారాలు పడిపోయాయి. జిల్లాలో ప్రధానంగా వస్త్ర వ్యాపారం, ఫర్నిచర్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌పోన్‌లు, ఎరువుల వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. పెద్ద నోట్లు రద్దుకు ముందన్న వ్యాపారంతో పోలిస్తే ప్రస్తుతం 20 శాతం వ్యాపారం కూడా లేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement