సాక్షి ప్రతినిధి – నెల్లూరు : ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోటీలోని అభ్యర్థులు పింక్, తెలుపు రంగులో నమూనా బ్యాలెట్ ముద్రించుకోకూడదు. పట్టాభి ఈ నిబంధన ఉల్లంఘించి నమూనా బ్యాలెట్లు ముద్రించారని పీడీఎఫ్ అభ్యర్థుల మద్దతుదారులు రెండు రోజుల కిందట ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ఎన్నికల అధికారులు ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకున్నారు. ఈ నమూనా బ్యాలెట్లు ఎందుకు ముద్రించారు ? ఎక్కడ, ఎన్ని ముద్రించారు? ఎక్కడెక్కడ పంపిణీ చేశారు? తదితర విషయాలపై రాత పూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని సహాయ రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేశారు. ఇదిలా ఉండగా పట్టాభితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వాసుదేవనాయుడు పేరుతో కూడా పింక్, తెలుపు రంగులో నమూనా బ్యాలెట్ పత్రాలు ముద్రించి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని పీడీఎఫ్ అభ్యర్థుల మద్దతుదారులు ఎన్నికల అధికారులకు మరో ఫిర్యాదు చేశారు.
పట్టాభికి నోటీసులు
Published Sat, Mar 4 2017 11:19 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement