నోటీసుల జారీ ప్రజా వ్యతిరేకం
పామర్రు: చట్ట సభల్లో ఏ సమస్య వచ్చినా అధికార పక్షాన్ని ప్రజల పక్షాన నిలదీసి ప్రశ్నించే హక్కు ఒక్క ప్రతిపక్షానికే ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయ భాను అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్లనే రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు హోదాను కోరుతున్న విషయాన్ని ప్రశ్నిస్తే నోటీసులు జారీ చేయటం ప్రజా వ్యతిరేకం కాదా అని ప్రశ్నించారు. దేశ ప్రధాని, రాష్ట్ర సీఎం ఏపీకి హోదా ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోయి ప్యాకేజీలకు మొగ్గు చూపడంపై సభలో నిరసన తెలిపామన్నారు. దీనిపై చర్చ జరగాలని పట్టు పట్టి చర్చలతోనే సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతో హోదాపై గళం విప్పిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయటం ఎంత వరకూ సమంజసం అన్నారు. ప్రజల మనోభావాల్ని సభలో ప్రతిబింబించడం కోసమే హోదాకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఇవ్వడం ప్రజా విరుద్ధమన్నారు. దీనిని ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. సత్వరమే దీనిని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. మారిన సీఎం వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఓటుకు నోటు కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారన్నారు. హైదరాబాద్ పదేళ్ల్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా అమరావతి నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీఎం కుమారుడు లోకేష్ తీరు, వ్యవహార శైలి రాజ్యాంగేతర శక్తిలా ఉందన్నారు. అవినీతి మంత్రుల భూకబ్జాలపై సీబీఐ దర్యాప్తులు చేయించాలని కోరారు. సమావేశంలో వీరులపాడు జెడ్పీటీసీ షహనాజ్‌బేగం, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, యువజన నాయకుడు జుబేరు, సర్పంచ్ ఎం. గాంధీ, జిల్లా ఎంపీటీసీల సంఘ కార్యదర్శి మూడే శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.