సిద్ధం సభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కదలివచ్చారు. సభా వేదికపైకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది ప్రజలు కోల్‌కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు.
సభా ప్రాంగణం నిండిపోవడం, జాతీయ రహదారిపై లక్షలాది మంది ప్రజలు బారులు తీరడంతో.. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని చెబుతున్నారు.
దుష్టచతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన రణగర్జనకు... సిద్ధమంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్క చేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. భీమిలి సభ కంటే రెండు రెట్లు అధికంగా ఏలూరు సభకు జనం తరలివచ్చారు.
‘చంద్ర’ముఖిపై అప్రమత్తం చేద్దాం
రాష్ట్రంలో గత 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. గ్రామంలో.. నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.55 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశారా? అని ప్రతి ఇంటికెళ్లి అడగాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
వైఎస్సార్‌సీపీకి ఓటేయకపోవడం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఓటేయడమంటే సంక్షేమ పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనన్నది ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా 124 సార్లు సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధి చేకూర్చారని.. ఇప్పుడు ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను గుర్తు మీద బటన్ రెండు సార్లు నొక్కాలని.. లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుందని హెచ్చరించారు. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుందని గడపగడపకు చెప్పాలని పిలుపునిచ్చారు.
పోటెత్తిన యువత
సభకు హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. యువతను అభిప్రాయ నిర్ణేతలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఏలూరు సభకు యువత పోటెత్తడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులేనని అంటున్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటేనే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తుండటం వల్లే యువత వైఎస్సార్‌సీపీ పక్షాన సైనికుల్లా నిలబడుతున్నారని చెబుతున్నారు. ఈ సభకు యువతతో పోటీపడి వృద్ధులు కూడా తరలివచ్చారు.
ఉదయం నుంచే బారులు
సభకు సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిపై లక్షలాది మంది జనం నిలబడిపోయారు. సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంత సేపు ఇంకా వాహనాలు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వేలాది మంది సభకు రాలేక వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment