వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, అభిమానికీ, వలంటీర్‌కు ఒక విషయం చెబుతున్నా. వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకూ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్లు వైఎస్సార్‌సీపీ ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఒక్కటే చెబుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీది. మీ బిడ్డ జగన్ మీ అందరికీ ఒక మంచి సేవకుడు.
పెత్తందారులతో యుద్ధానికి నేను సిద్ధం. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొని మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు అడుగులు ముందుకు వేద్దాం. – సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘57 నెలల్లో మన జగనన్న 124 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా మనందరి ఖాతాల్లో నగదు జమ చేశారు. అలాంటి ఆయన కోసం మనం కేవలం రెండు బటన్లు నొక్కలేమా.. అని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్నకు ఓటు వేయక పోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడమే అర్థం అన్నారు. అంటే సంక్షేమాభివృద్ధి పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఒక్కరికీ చెప్పాలని కోరారు. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను బతికించినట్లవుతుందని వివరించాలన్నారు.
శనివారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరు వద్ద నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో అశేష జనవాహినినుద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఇంటి వద్దకే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా.. జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. తనకు తోడేళ్ల మద్దతు లేదని, నక్కజిత్తులు, మోసం చేసే అలవాటు అంత కంటే లేదని చెప్పారు. ‘మీరు రెండు ఓట్ల ద్వారా చంద్రముఖిని శాశ్వతంగా బంధించవచ్చు. లేదంటే అది సైకిలెక్కి, టీ గ్లాసు పట్టుకుని.. పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాక్యులా మాదిరిగా తలుపు తడుతుంది. అప్రమత్తంగా ఉండాలని గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికీ చెప్పండి.
14 ఏళ్లు సీఎంగా పని చేసినా, చంద్రబాబు చెప్పుకొనేందుకు ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశాను.. నాకు ఓటేయండి అని అడగలేని దుస్థితి ఆయనది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఆయనే.. మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ను గుర్తు తెచ్చుకునేదీ ఆయనే. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అని ప్రజల్ని కాదు.. పార్టీలను పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు. కమలం పార్టీలో చేరిన ఆయన మనుషులను రా కదలిరా అని పిలుస్తున్నారు’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
వాళ్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్
♦ రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా ఛార్జ్‌షీట్‌లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని కూడా ‘రా.. కదలిరా’ అని చంద్రబాబు పిలుస్తున్నాడు. బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్‌కు.. అసలు ఈ స్టేట్‌తోనే సంబంధమే లేదు. వీరిలో ఏ ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉండరు. వీరంతా నా¯Œన్ రెసిడెంట్ ఆంధ్రాస్. పని పడినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు.
♦ ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని, పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్‌గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్‌గా, పేద వాడి సంక్షేమం టార్గెట్‌గా వీరంతా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు.
ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం
♦ కార్యకర్తల్ని, నాయకులుగా అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను, చైర్మన్లను నియమించిన చరిత్ర మనది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం మీ జగనన్నకు మాత్రమే సాధ్యం.
♦ గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్ధానంలో మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతోంది.
♦ పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులు కేటాయింపులో ఇదే పంథా, న్యాయం కొనసాగించాం. ఎవ్వరూ గెలవనన్ని పదవులు, గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు.. వార్డు మెంబరు మొదలు సర్పంచులు, ఎంటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రి మండలి సభ్యుల వరకు అవకాశాలు కల్పించాం.
♦ ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఇక్కడున్న మనలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడితే.. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజార్టీతో గెలిపించే కార్యక్రమం జరుగుతోంది. అందుకే భవిష్యత్‌లో ఇంతకంటే గొప్పగా వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం
♦ వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. లంచాలు, వివక్ష లేని పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరినీ మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాది. టార్గెట్ 175 కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీల్లేదు అని తెలియజేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధం కావాలి.
♦ ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనందరికీ ఉన్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్‌తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉండండి. మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ములు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్రంలో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నా.
Comments
Please login to add a commentAdd a comment