- అంతా ఆన్‌లైన్‌లోనే..
– దరఖాస్తులకు ఈ నెల 30 వరకు గడువు
– 31న కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా టెండర్ల ఖరారు
– ఇకపై ప్రతి మద్యం షాపులోనూ పర్మిట్‌రూం
– ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూయదేవీ
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో మద్యం షాప్‌ల నిర్వహణకు సంబంధించి తొలిసారిగా ఆన్‌లైన్‌లో టెండర్ల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూయదేవి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి, సీఐలు శ్యామ్‌ప్రసాద్, నరసింహులుతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2017-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జిల్లాలోని 246 మద్యం షాప్‌ల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు. ఇందులో అనంతపురం డివిజన్ పరిధిలో 146, పెనుకొండ డివిజన్ పరిధిలో వంద దుకాణాలున్నాయన్నారు. వీటికి సంబంధించి శుక్రవారం నుంచే ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి www.applications.excisehpfs.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పొందవచ్చునని చెప్పారు.
రిజిస్ర్టేషన్ ఫీజులు ఇలా..
టెండర్ల దరఖాస్తుకు ఈ నెల 30న సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని, 31న అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న విద్యుత్ కళాభారతి ఫంక‌్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో టెండర్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో రూ. లక్ష, మున్సిపాలిటీ పరిధిలో రూ. 75 వేలు, మండలాల పరిధిలో రూ. 50 వేలు చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది కాక రూ. 50 వేలు దరఖాస్తు రుసుంగా నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఈ ఏడాది నుంచి ప్రతి మద్యం షాప్‌లో పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను రూ. 5 లక్షలు, అప్లికేషన్ ఫీజు రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మద్యం షాపుల టెండర్లలో పాల్గొనే వారు ఆధార్, పాన్‌కార్డుతో పాటు రెండేళ్ల ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్, రూ. 3 లక్షలు ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
వెరిఫికేషన్ తప్పనిసరి
అన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వెంటనే అదేరోజు అనంతపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుందని డీసీ పేర్కొన్నారు. వెరిఫికేషన్ పూర్తి అయిన వెంటనే ఓ టోకన్ నంబర్ ఇస్తారని, వాటి ఆధారంగా 31న లాటరీ ద్వారా నంబర్‌లు కేటాయించడం జరుగుతుందని అన్నారు.
నిబంధనలు తప్పనిసరి
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నూతనంగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలు జాతీయ రహదారులకు 500 మీటర్లు దూరంలో తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే దేవాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలకు 100 మీటర్లు దూరంలో ఉండాలన్నారు. ప్రతి షాపులోనూ సీసీ కెమెరా తప్పనిసరిగా అమర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, మండలం యూనిట్‌లుగా షాపులు కేటాయించారని, ఎక్కడైనా దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు.
మద్యం షాపులకు నోటిఫికేషన్
Published Fri, Mar 24 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
Advertisement
Advertisement