నోటు మీద కొట్టారు
Published Mon, Nov 28 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
కొవ్వూరు : రెండు రోజుల నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. అసలే నోట్లు అవసరమైన మేరకు రాకపోవడంతో ఏటీఎంలలో అరకొరగానే నగదు పెడుతున్నారు. దీంతో శనివారమే జిల్లాలో చాలాచోట్ల ఏటీఎంలు సొమ్ముల్లేక మూతపడ్డాయి.ఆదివారం జిల్లావ్యాప్తంగా దాదాపు ఏటీఎంలన్నీ ఖాళీ కావడంతో జనం నానా అవస్థలు పడ్డారు. రెండు రోజుల వరుస సెలవులు విషయం తెలియకపోవడంతో కొందరు నగదును ముందస్తుగా డ్రా చేసుకోలేకపోయారు. జిల్లాలో సుమారు 700 బ్యాంకులు, 350 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క కొవ్వూరులోనే పదికిపైగా ఏటీఎంలు ఉన్నాయి.ఆదివారం ఒక్క ఏటీఎంలోనూ సొమ్ముల్లేవు. జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈరెండు రోజుల్లో రోజుకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయినట్టు అంచనా.
నేడు హర్తాళ్‌కుSపిలుపు
పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా వామపక్షాలు హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి.దీనికి వైఎస్సాఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేంత వరకు పాతనోట్లను వినియోగంలో ఉంచాలని, లేదంటే సరిపడినంత చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ చేపట్టిన ఈ హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ సన్నద్ధమవుతున్నాయి.
పంట డబ్బుకూ తంటా
భీమడోలు : ఈయన పేరు బొబ్బనబోయిన వెంకటేశ్వరరావు. స్వగ్రామం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురం. వయస్సు 80 ఏళ్లు. వ్యవసాయంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ఏడాది తనకున్న రెండెకరాలకు తోడు, మరో రెండెకరాలను కౌలుకు తీసకుని సాగుచేశాడు. దిగుబడి బాగానే వచ్చింది. ధాన్యాన్ని కమీష¯ŒS వ్యాపారికి విక్రయించాడు. అతని వద్ద నుంచి రూ.1.60 లక్షలు రావాలి. ఇంతలో పెద్దనోట్లు రద్దయ్యాయి. దీంతో నగదు ఇవ్వాలంటే ఆధార్, బ్యాంకు పుస్తకాల జిరాక్స్ తేవాలని కమీష¯ŒS వ్యాపారి చెప్పాడు. ఎందుకంటే మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తానన్నాడు. అదీ నెల తర్వాతని చెప్పాడు. దీంతో వెంకటేశ్వరరావు తన వద్ద ఉన్న డొక్కు సైకిల్ వేసుకుని చిరిగిన పంచెతో నాలుగుకిలోమీటర్ల దూరంలోఉన్న పూళ్ల వచ్చాడు. గ్రామంలో జిరాక్స్ యంత్రం లేకపోవడమే దీనికి కారణం. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం డబ్బులు వస్తే పంట కోసిన కూలీలకు, పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు ఇవ్వాలని, వారు మాటిమాటికి ఇంటికి వచ్చి నిద్రపోనివ్వడం లేదని వాపోయాడు. నెల తర్వాత వ్యాపారి డబ్బిస్తే ఎలాగో అర్థం కావడం లేదని, దాళ్వా సాగు పెట్టుబడికి నగదు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Advertisement