ఎమ్మెల్యేలదే పెత్తనం!
ఎమ్మెల్యేలదే పెత్తనం!
Published Fri, Oct 28 2016 11:13 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఇన్‌చార్జీలు ఇక డమ్మీలే..
- అధికార పార్టీలో కొత్త ముసలం
- నియోజకవర్గాల్లో ఇక ఒక్కరిదే రాజ్యం
- గుంటూరు సమావేశంలో స్పష్టం చేసిన అధినాయకత్వం?
- అదే జరిగితే సత్తా చూపుతామంటున్న పాత కాపులు
- పార్టీ రెండుగా చీలక తప్పదని హెచ్చరికలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో ఇక ఎమ్మెల్యేల పెత్తనం సాగనుందా? వారే నియోజకవర్గానికి రాజుగా వ్యవహరించనున్నారా? నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఉన్న వారు ఇక డమ్మీలేనా? అనే వరుస ప్రశ్నలకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అవుననే అంటున్నారు. వారం రోజుల క్రితం గుంటూరులో జరిగిన సమావేశంలో ఈ మేరకు అధికార పార్టీ నాయకత్వం స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అయితే, అలాంటిదేమీ లేదని నియోజకవర్గ ఇన్‌చార్జీలు కౌంటర్ ఇస్తున్నారు. నిజంగా ఎమ్మెల్యేలకే పెత్తనం ఇస్తే.. ఇన్ని రోజులుగా పార్టీకి సేవచేసి.. కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీ వెంట నడిచిన వారిని కాదంటే కార్యకర్తలకు రాంగ్ సిగ్నల్ పంపినట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే అమలైతే ఇక అధికార పార్టీని సొంత కేడర్ కూడా నమ్మే పరిస్థితి ఉండదంటున్నారు. మొత్తం మీద తాజా నిర్ణయం అధికార పార్టీలో కొత్త రచ్చకు తెరలేపింది.
పార్టీ మారినా దక్కని పరువు...!
వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలో చేరిన తర్వాత కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలే పెత్తనం చెలాయిస్తూ వస్తున్నారు. వారు సిఫారసు చేసిన వారికే నామినేటెడ్ పోస్టులు దక్కాయి. జన్మభూమి కమిటీల్లోనూ వారి పెత్తనమే సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ మారినప్పటికీ తమకు ఏ మాత్రం విలువ లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పైగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు ప్రకటనలు గుప్పించామని.. అలాంటిదేమీ జరగకపోవడంతో నోట్ల కట్టల కోసమే పార్టీ మారామనే విషయం ప్రజలకు తెలిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పార్టీ మారడంతో కేడర్ నుంచి వ్యతిరేకత వస్తోందనేది వీరి వాదనగా ఉంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా తమనే పరిగణించాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు అది అమలు కాలేదు. అయితే, గత నాలుగు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలకు పెత్తనం అప్పగించాలనే నిర్ణయం జరిగిందని అధికార పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు.
చీలిక ఖాయం
ఎమ్మెల్యేల పెత్తనం రాబోతుందన్న వార్తలను ఇన్‌చార్జీలు కొట్టిపడేస్తున్నారు. ఇదే జరిగితే కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వారంతా క్రమంగా పార్టీకి దూరమవుతారని అంటున్నారు. పైగా మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి సాహసం పార్టీ చేయదని వీరు వాదిస్తున్నారు. ఇది అమలైన మరుక్షణం కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ రెండుగా చీలుతుందని వీరు బలంగా పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేల రాజ్యం అమల్లోకి వచ్చిన మరుక్షణం తమ సత్తా ఏమిటో మార్చిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చూపుతామని హెచ్చరిస్తున్నారు.
Advertisement