టీడీపీ మార్కు రాజకీయం | tdp brand politics | Sakshi
Sakshi News home page

టీడీపీ మార్కు రాజకీయం

Published Fri, Jan 6 2017 11:12 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీ మార్కు రాజకీయం - Sakshi

టీడీపీ మార్కు రాజకీయం

 
ఎమ్మెల్యేలకే ప్రొటోకాల్‌!
- గతంలో ఉన్న ఇన్‌చార్జీలకు రద్దు
- అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు
- కోడుమూరు ఎమ్మెల్యేకు మాత్రం ఎదురుదెబ్బ?
- చర్చనీయాంశంగా అధికార పార్టీ తీరు
- వాడుకుని వదిలేశారనే చర్చ
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో గతం నుంచి ఉన్న ఇన్‌చార్జీలకు, గోడదూకిన ఎమ్మెల్యేలకు మధ్య రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ప్రొటోకాల్‌ ఇవ్వాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. ఇన్‌చార్జీలకు ప్రొటోకాల్‌ రద్దు చేయాలని అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అయితే, ఈ విషయంలో కోడుమూరు ఎమ్మెల్యేకు మాత్రం మినహాయింపు ఇవ్వడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో ఇన్‌చార్జీకే ప్రొటోకాల్‌ వర్తింపచేయాలని సూచించినట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. తాజా వ్యవహారంతో అధికార పార్టీలో పాత, కొత్త నేతల మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో తమ భవితవ్యం ఏమిటనే అంశంపై ఇన్‌చార్జీలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంతగా అవమానాలు పడుతూ తాము ఎలా పని చేయాలని మదనపడుతున్నారు. త్వరలో నేరుగా పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
 
ఆది నుంచీ అంతే...!
వాస్తవానికి అప్పటికే ఉన్న ఇన్‌చార్జీలకు, పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మధ్య వివాదం రగులుతూనే ఉంది. కొత్తగా చేరిన వారికి కేవలం ఎమ్మెల్యేగా ప్రొటోకాల్‌ మాత్రమే ఉంటుందని.. నియోజకవర్గంలో మిగతా అన్ని పనులు ఇన్‌చార్జీలు చేప్పినట్టే జరుగుతాయని స్వయంగా అధికారపార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేల పనులు ఏమీ కావని అందరూ భావించారు. అయితే, పార్టీలో చేరిన తమకు గౌరవం ఇవ్వకపోతే ఎలా అంటూ వీరు సీఎం వద్ద పంచాయితీ పెట్టారు. ఈ మధ్యకాలంలో ఇన్‌చార్జీలే కీలకంగా వ్యవహరించారు. పనులు మొదలుకొని అధికారుల బదిలీల వరకూ అన్నీ తామై వ్యవహరించారు. అయితే, ఎమ్మెల్యేలు కాస్తా తమ పరువు పోతోందంటూ వాపోవడం మొదలుపెట్టారు. దీంతో ప్రొటోకాల్‌ ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్యేల పనులే చేయాలంటూ తాజాగా ప్రభుత్వ పెద్దల నుంచి అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే జన్మభూమి సమావేశాల్లో ఎక్కడా ఇన్‌చార్జీలు దర్శనమివ్వని పరిస్థితి. ఇంతటితో ఆగిపోకుండా ఇన్‌చార్జీలకు అసలు ప్రొటోకాల్‌ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అధికార పార్టీ పెద్దలు తేల్చిచెప్పడంతో వీరు కంగుతిన్నారు. 
 
వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యింది. మొన్నటి దాకా ఎమ్మెల్యే కాకపోయినా ముందుండి జీపుల్లో సెక్యూరిటీ ఇవ్వడం.. సమావేశం అని పిలిస్తే పరుగెత్తి పోవడం జరిగేది. ఇప్పుడు ఆ అవసరం లేదని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. జన్మభూమి సభల్లో ఇన్‌చార్జీలు పెద్దగా కనిపించకపోవడం అందులో భాగమేననే చర్చ జరుగుతోంది. అయితే, కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మాత్రమే ఇన్‌చార్జీలకు బాధ్యతలు ఇవ్వాలని చెబుతున్న అధికార పార్టీ ద్వంద్వ వైఖరిని ఆ పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారు. వాడుకుని వదిలేయడం తమ అధినేతకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు అధికారం వచ్చిందని సంబరపడిపోతున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే అవమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అధికార పార్టీలో రోజుకో మలుపుతిరుగుతున్న ఇన్‌చార్జి–ఎమ్మెల్యేల వ్యవహారం మరింతగా ఇద్దరి మధ్య అగాథం పెంచక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement