జ్ఞానసాయికి అండగా మేముంటాం!
జ్ఞానసాయికి వైద్యం చేయించడానికి ముందుకు వచ్చిన ప్రవాస భారతీయులు
రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం
కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, సీఐ
ములకలచెరువు: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జ్ఞానసాయికి వైద్యం చేయించడానికి అండగా మేముంటామంటూ గల్ఫ్‌దేశాల్లో స్థిరపడిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు ప్రవాస భారతీయులు ముందుకు వచ్చారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, దుబాయ్, అబుదాబీ, అలాగే లండన్ లో స్థిరపడిన ప్రవాస భారతీయులు పత్రికల్లో, టీవీల్లో ప్రసారమైన కథనాలకు భారీగా స్పందించారు.
బాధితులతో నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించి చిన్నారి తల్లి జే.సరస్వతి బ్యాంకు ఖాతాలో రూ.5,01,800 వరకు జమ చేశారు. చిన్నారి వైద్యం కోసం సహాయం చేసిన దాతలకు చిన్నారి కుటుంబ సభ్యులు పేరు పేరున చేతులెత్తి దండం పెట్టారు. శనివారం చిన్నారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్‌లో పరీక్షలు నిర్వహించుకుని స్వగ్రామమైన ములకలచెరువు మండలం బత్తలాపురానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
చిన్నారితో కుటుంబసభ్యులు స్వ గ్రామానికి చేరుకు న్నారని తెలుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్, సీఐ రుషికేశవ్, ఎంపీడీవో రాజగోపాల్, తహశీల్దార్ అమరేంద్రబాబు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మీ వెంట మేము ఉంటామని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బాధితులకు రూ. 25 వేలు, కేవీ.రమణ రూ. 5 వేలు, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల రూ.2,500 బాధితురాలి కుటుంబ సభ్యులకు అందించారు. దాతల సహాయం, ప్రజాప్రతినిధుల పరామర్శతో చిన్నారి ప్రాణానికి కొండంత అండ దొరికిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
రేపు చెన్నైలో చిన్నారికి వైద్య పరీక్షలు
చిన్నారి వైద్యానికి ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం విదితమే. సోమవారం చిన్నారికి ఆపరేషన్ కోసం వైద్య పరీక్షలతో చికిత్స మొదలు పెట్టనున్నారు. చిన్నారి వైద్యానికి రూ. 25 లక్షల మేర ఖర్చు అవుతుందని పత్రికలో కథనాలు వెలువడ్డాయి. కథనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులుకు చిన్నారి కోలుకునే వరకు వైద్యం చేయించాలని ఆదేశించారు.
ఇందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హెల్త్ కార్యదర్శి ఎంఎన్‌వీ ప్రసాద్ (ఐఏఎస్) అధికారిని చిన్నారి వైద్యం కోసం నియమించారు. ఈయన పర్యవేక్షణలో చిన్నారికి వైద్యసేవలు అందించనున్నట్లు సమాచారం. శుక్రవారం హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్‌లో చిన్నారికి అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కోసం తమిళనాడు రాష్ట్రం చెన్నై గ్లోబల్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కాలేయ మార్పిడి చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.