కలియుగ దైవం నృసింహుడు
కలియుగ దైవం నృసింహుడు
Published Fri, Jan 6 2017 10:04 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
* స్వామి ఉత్తరద్వార దర్శనానికి భారీ ఏర్పాట్లు
* లక్ష మంది భక్తుల తరలివచ్చే అవకాశం
* మంగళగిరిలో పండుగ కోలాహలం
మంగళగిరి : మంగళగిరి కేంద్రంగా శని, ఆదివారాలు రెండు పండుగలు జరగనుండడం స్థానికులకు ముందే సంక్రాంతి వచ్చినంత ఆనందగా ఉంది. శనివారం రాత్రి నుంచి ముక్కోటి సందర్భంగా పట్టణంలో కోలాహలం నెలకొంది. లక్ష్మీ నృసింహస్వామి వారు ఉత్తరద్వార దర్శనమివ్వనుండగా ఆలయ అధికారులు, పాలకవర్గం భక్తులకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. దక్షిణ భారతదేశంలో కలియుగ దైవంగా కొలిచే నృసింహుని దర్శనం కోసం లక్ష మంది భక్తులు తరలివచ్చే అవకాశముండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లుతో పాటు అల్పాహారం, అన్నదానం చేసేందుకు పట్టణంలోని ధార్మిక, ఆధ్వాత్మిక, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు.
బంగారు శంఖుతీర్థంతో శుభం....
నృసింహుని దర్శనం అనంతరం సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఇచ్చే బంగారు శంఖుతీర్థాన్ని స్వీకరించడం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఏడాదికి ఒకసారి ఇచ్చే బంగారు శంఖుతీర్ధాన్ని స్వీకరిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి ఆదివారం కాగా శనివారం రాత్రి నుంచే స్వామి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శనివారం రాత్రి స్వామి వారికి ప్రత్యేకపూజలు అభిషేకాలు నిర్వహించి తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. నృసింహుని దర్శనం కోసం శనివారం రాత్రి నుంచే తరలివచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఓంకారనాదంతో వినిపించే బంగారు తొడుగు ఉన్న దక్షిణావృత్త శంఖుతో సంవత్సరంలో ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే భక్తులకు తీర్ధం అందజేయడంతో అత్యంత పవిత్రంగా భావించి భక్తులు దైవదర్శనం అనంతరం తప్పనిసరిగా తీర్ధం సేవిస్తారు. 1820లో తంజావూర్ మహారాజ్ రాజాసర్‌పోజీ ఈ దక్షిణ వృత్తశంఖాన్ని దేవస్థానానికి బహూకరించారు.
Advertisement
Advertisement