సాంకేతిక పద్ధతులతోనే గుర్తింపు
సాంకేతిక పద్ధతులతోనే గుర్తింపు
Published Wed, Aug 31 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
ఎన్టీటీపీఎస్ సీఈ ప్రభాకరరావు
ఇబ్రహీంపట్నం:
నూతన సాంకేతిక పద్ధతులు అవలంభించటం వల్లే జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ రావి ప్రభాకరరావు అన్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌కు జాతీయస్థాయిలో ఉత్తమ సేఫ్టీ మేనేజ్‌మెంట్ గ్రీన్‌టెక్ (గోల్డ్) అవార్డు లభించింది. జీరోస్థాయి ప్రమాద రేటును సాధించినందుకు ఢిల్లీకి చెందిన గ్రీన్‌టెక్ ఫౌండేషన్ వారు ఆగస్టు 29న గోవాలో నిర్వహించిన సమావేశంలో ఈ అవార్డును సీఈ అందజేశారు. గురువారం ఎన్టీటీపీఎస్‌లో అభినందనసభ నిర్వహించారు. సీఈ మాట్లాడుతూ ఉద్యోగుల నిరంతర కృషి వలనే ఈ అవార్డు దక్కిందని పేర్కొన్నారు. మూడేళ్లుగా సంస్థలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా విధులు నిర్వహించటం సంస్థకు గర్వకారణమన్నారు. కార్మిక సంఘాలు కూడా భద్రత విషయంలో శ్రద్ధ చూపాయని కొనియాడారు. సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, యూనియన్, అసోసియేషన్ నాయకులు, కార్మికులను సత్కరించారు. సీఈ ప్రభాకరరావును సన్మానించారు. కార్యక్రమంలో ఏపీజెన్‌కో శిక్షణా కేంద్రం సీఈ పద్మసుజాత, పర్యవేక్షక ఇంజినీర్లు మురళీకృష్ణ, నవీన్‌గౌతం, రమేష్‌బాబు, జవహర్, శ్రీరాములు, శేఖర్, గౌరీపతి, సాంబశివరావు, కర్మాగారాల మేనేజర్ కాండ్రు మైసూర్‌బాబు, డిప్యూటీ కార్యదర్శి భాస్కరరావు, ఏడీఈ శ్రీనివాసరావు, భద్రతాధికారి నాగబాబు, అప్పారావు, కార్మికులు పాల్గొన్నారు.
Advertisement