రణస్థలం: గుజరాత్ ప్రజలు తిరస్కరించిన అణు విద్యుత్ కేంద్రాన్ని కొవ్వాడకు తరలించడాన్ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, నాయకులు పి.తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడులు తీవ్రంగా ఖండించారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రణస్థలం-రామతీర్థం జంక్షన్ నుంచి జాతీయ రహదారిపై ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో సీఐటీయూ నేతలు గోవిందరావు, తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడులతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించా రు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ తమ భూములిచ్చి చావును కొనితెచ్చుకోలేమని గుజరాత్ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తే కొవ్వాడకు ప్లాంట్‌ను తరలించడం భావ్యం కాదన్నారు.
బీజేపీ, టీడీపీ నాయకులు పచ్చి మోసగాళ్లని ధ్వజమెత్తారు. గతంలో అమెరికాతో అణువిద్యుత్ ఒప్పందాలను పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించిన బీజేపీ, టీడీపీలు నేడు అమెరికా ముందు మోకరిళ్లుతున్నాయని విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలున్న ఆస్ట్రేలియాలో ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడా లేదని గుర్తు చేశారు. అమెరికాలోని త్రీవాండ్, రష్యాలోని చెర్నోబిల్ తదితర ప్రాంతాల్లో అణు విద్యుత్ ప్లాంట్ల వల్ల సంభవించిన నష్టాన్ని పాలకులు గుర్తెరగాలని హితవుపలికారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కళ్లు తెరిచి ప్లాంట్ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. లేకపోతే ప్రజల నుంచి నిరసన తప్పదన్నారు.
కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అణుఒప్పందం చేసుకోవడానికే అమెరికా వెళ్లారని వారు ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ రణస్థలం డివిజన్ అధ్యక్షుడు ఎన్.వెంకటరమణ, అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.గురినాయుడు, మండల అధ్యక్షుడు బాలి శ్రీనివాసరావు, నాయకులు ఎస్.సీతారామరాజు, ఎం.శ్రీనివాసరావు, ఎం. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
గుజరాత్‌కు రక్ష.. ఆంధ్రకు శిక్ష
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పెట్టాల్సిన అణువిద్యుత్ ప్లాంట్‌ను స్థానికుల వ్యతిరేకతతో కొవ్వాడకు తరలించారని, ఈ విషయంలో మోదీ, చంద్రబాబుల కుట్రలు దాగున్నాయని సీపీఎం నేతలు ఆరోపించారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలి వద్ద మంగళవారం అణువిద్యుత్ ప్రతిని దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు మంచివారే కాని అమాయకులు కారని గుర్తెరగాలన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేద న్నారు. అణువిద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగే మొత్తం ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల వరకు ముప్పు ఉంటుందని చెప్పారు. ప్లాంట్ ప్రయత్నాలు విరమించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి కె.శ్రీనివాస్, వి.జి.కె మూర్తి, టి.తిరుపతిరావు, ఎం.ప్రభాకరరావు, ఎం.ఆదినారాయణమూర్తి, బి.సత్యంనాయుడు, కనకమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గుజరాత్ వద్దంటే కొవ్వాడకు తరలిస్తారా?
Published Wed, Jun 8 2016 9:12 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement