- నాలుగు రోజులుగా చలికి వణుకుతున్న వృద్ధురాలు
- తనది అమలాపురమని, కొడుకు వస్తాడని ఎదురు చూపు..
- సాయం అందిస్తున్న స్థానికులు
మానవత్వం మరిచాం.. మన్నించమ్మా..!
Published Fri, Dec 16 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
ధవళేశ్వరం :
తాను జన్మనిచ్చిన బిడ్డలు ఉన్నారో లేదో తెలియదు.. బంధువులు ఎక్కడున్నారో తెలియదు.. తన కోసం తనను తీసుకువెళ్లేందుకు తన కొడుకు వెంకన్న వస్తాడంటూ చలిలో వణుకుతూ అంటున్న ఆ అమ్మ మాటలు స్థానికులను కలచివేశాయి. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన ఆ పెద్దావిడను నాలుగు రోజుల క్రితం ధవళేశ్వరం బస్టాండ్ వద్ద ఎవరో గుర్తు తెలియని వారు వదిలి వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. గురువారం ధవళేశ్వరం రామపాదాలరేవులోని రామాలయం వద్ద ఎవరో ఆమెను వదిలి వెళ్ళిపోయారు. దయగలవారెవరో ఆమెకు ఒక దుప్పటి ఇచ్చి ఆహారం ఇచ్చారు. బంధువుల సమాచారం అడగ్గా తన పేరు రంకిరెడ్డి సూర్యకాంతం అని, తనది అమలాపురం దగ్గర కొంకాపల్లి గ్రామం అని తనను తీసుకువెళ్ళేందుకు తన కొడుకు వెంకన్న వస్తాడంటూ చెబుతున్నది. సుమారు 80 ఏళ్ల వయస్సు ఉండే ఆ పెద్దావిడ చలిలో గజగజ వణుకుతూ కాలం గడుపుతోంది. అయినవారు ఉన్నారో లేక సభ్య సమాజం తలదించుకునేలా వదిలించుకున్నారో తెలియాల్సి ఉంది. అయినవారు పట్టించుకోనప్పటికీ స్థానికులు, యువకులు ఆమెకు సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.
Advertisement
Advertisement