ఓం సాయి..శ్రీసాయి..
- ఘనంగా దత్తజయంతి వేడుకలు
– భక్తులతో కిటకిటలాడిన సాయిమందిరాలు
కర్నూలు (న్యూసిటీ/కల్చరల్) దత్త జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని సాయిబాబా ఆలయాల్లో ఓం సాయి.. శ్రీసాయి.. జయ జయ సాయి నామస్మరణ మార్మోగింది. తెల్లవారుజామునే మహిళలు కుటుంబసమేతంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవిష్ణు సహస్ర నామావళి మంత్రాలను పఠించారు. గురు చరిత్ర పారాయణం చేశారు. అంతకు ముందుగా వేద పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి విగ్రహాలకు అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు, పూజలతో అలంకరణ చేశారు. కర్నూలు నగరంలో పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున వెలసిన దక్షిణ షిరిడి శ్రీసాయిబాబా, బాలాజీ నగర్, బుధవారపేట, అశోక్‌నగర్, వినాయక ఘాట్, కృష్ణారెడ్డి నగర్‌లలోని సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. బిర్లాగేట్ సమీపంలోని శంకర మందిరరంలో షిరిడీసాయి జీవిత చరిత్రపై ప్రముఖ వాగ్గేయకారులు ఈమని రామకృష్ణప్రసాద్ మధురమైన గీతాలు వినిపించారు. సంగీత విభావరికి నాగరాజు, గోపాల్, శిరీష, వాయిద్యా సహకారం అందించారు. ఆలయ కమిటీలు, దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.