జలచౌర్యంపై దాడులు
హొళగుంద: తుంగభద్ర దిగువ కాల్వ(ఎల్లెల్సీ) నుంచి అక్రమ నీటిమళ్లింపును అరికట్టేందుకు ఆంధ్ర–కర్ణాటక రాష్ట్ర అధికారులు ఉమ్మడిగా దాడులు చేపట్టారు. వర్షాభావంతో తుంగభద్ర డ్యాంలో నీటి పరిమాణం తగ్గుతుండడం, అక్రమ ఆయకట్టు వల్ల ఎల్లెల్సీలో నీరు ముందుకు వెళ్లకపోవడంతో ఇరు రాష్ట్రాలకు చెందిన కలెక్టర్ల ఆదేశాల మేరకు టీబీ బోర్డు, ఆంధ్ర ఎస్‌ఈ శశిభూషణ్‌రావు, నాగేశ్వరరావు, ఈఈలు విశ్వనాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి స్పందించారు. ఏఆర్, సివిల్ పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖాధికారులతో కూడిన 8 బృందాలను కాల్వపై గస్తీ తిరగడానికి ఏర్పాటు చేసినట్లు ఎస్డీఓ పంపన్నగౌడ్ తెలిపారు. ఆదివారం హొళగుంద ఎల్లెల్సీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర సరిహద్దు 135–250 కిమీ వరకు ఐదు బృందాలు 250–329 కిమీ వరకు మూడు బృందాలు గస్తీ తిరుగుతున్నట్లు తెలిపారు. జలచౌర్యానికి పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, భారీగా జరిమానాలు వేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1607.31 అడుగులతో 30 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన చెప్పారు. రోజుకు ఒక టీయంసీ ప్రకారం విడుదల జరుగుతోందని, నవంబర్ 15వ తేదీ లోపల కాల్వకు నీటి సరఫరా నిలిపి వేసే అవకాశాలున్నాయన్నారు.