
సూది సైకో మరోదాడి
పశ్చిమ గోదావరి: సూది సైకో మరో దాడి చేశాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి.కొండేపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అల్లూరి పాపారావు(35) గురువారం ఉదయం తన బైక్‌పై మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్‌లో బైక్ స్టాండ్ వేస్తుండగా వెనుక నుంచి హెల్మెట్‌తో వచ్చిన ఆగంతకుడు పాపారావు తొడపై సిరంజితో గుచ్చాడు. పాపారావు కేకలు వేసుకుంటూ జనాన్ని అప్రమత్తం చేశాడు. ఈలోగానే ఆగంతకుడు అక్కడి నుంచి జారుకున్నాడు. బాధితుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో కూడా సూది సైకో కలకలం రేపాడు. మండలంలోని ముఠాపురం పంచాయతీ బిల్యాతండాలో అంగన్‌వాడీ ఆయాగా పార్వతి అనే మహిళ పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఆమె విధులు ముగించుకుని గ్రామానికి తిరిగి వస్తుండగా నిర్జన ప్రదేశంలో వెనుక నుంచి బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఆగంతకుడు ఆమె మెడపై సూదితో గుచ్చి మాయమయ్యాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది.