
ఐపీఎస్ మరణిస్తే రూ.కోటి
♦ నక్సల్స్ దాడుల్లో మృతి చెందిన పోలీసులకు పరిహారం పెంపు
♦ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: నక్సలైట్ల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచారు. మరణించిన వారికి, గాయపడిన వారికి, శాశ్వత వైకల్యానికి గురైన వారికి వేర్వేరుగా పరిహారాలు ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ జాబితాలో లేని హోంగార్డుల కుటుంబాలకు సైతం పరిహారాన్ని వర్తింపజేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2014 జూన్ 2 నుంచి పరిహారం పెంపు అమలవుతుందని ప్రకటించింది. పరిహారాన్ని మంజూరు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. బాధిత కుటుంబాల ఖాతాల్లో ఈ డబ్బును జమ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పరిహారం పెంపు విషయంలో నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కె.తారకరామారావు ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. పోలీసు అధికారులతో పాటు ఇతర విభాగాల్లోని ఉద్యోగులకు హోదాలను బట్టి గతంలో ఉన్న పరిహారం.. పెరిగిన పరిహారానికి సంబంధించిన వివరాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్పీ స్థాయి, ఐపీఎస్ అధికారులు చనిపోతే ప్రస్తుతం రూ.30 లక్షల పరిహారం అమల్లో ఉంది. దీన్ని రూ.కోటికి పెంచారు. శాశ్వత వైకల్యానికి గురైతే రూ.50 లక్షలు, తీవ్రంగా గాయపడితే 6 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది.
సీఐలు, డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, సమాన హోదా ఉన్నటువంటి ఇతర శాఖల్లోని అధికారులు మరణిస్తే రూ.50 లక్షలు, శాశ్వత వైకల్యం పొందితే రూ.30 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.5 లక్షలు చెల్లిస్తారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐలు, సమాన హోదా ఉన్న ఇతర విభాగాల్లోని ఉద్యోగులు చనిపోతే రూ.45 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. శాశ్వత వైకల్యానికి గురైతే రూ.25 లక్షలు, గాయపడితే రూ.5 లక్షలు అందిస్తారు. పోలీస్ కానిస్టేబుళ్లకు సంబంధించిన పరిహారం పెంపుపై ప్రభుత్వం గత ఏప్రిల్‌లోనే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కానిస్టేబుళ్లు చనిపోతే రూ.40 లక్షల పరిహారం అమల్లో ఉంది.
ఇది యథాతథంగా కొనసాగనుంది. శాశ్వత వైకల్యానికి గురైనా, తీవ్రంగా గాయపడినా హెడ్ కానిస్టేబుళ్ల స్థాయికిచ్చే పరిహారం వర్తిస్తుందని ఈ జీవోలో స్పష్టం చేసింది. హోంగార్డులు చనిపోతే రూ.30 లక్షలు, వైకల్యానికి గురైతే రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షలు అందిస్తారు. తీవ్రవాద దాడుల్లో సాధారణ పౌరులు చనిపోతే సంబంధిత కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లిస్తారు. వైకల్యానికి గురైతే రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షల పరిహారం ఇస్తారు.